శుక్రవారం 15 జనవరి 2021
Mahabubabad - Nov 27, 2020 , 01:23:46

రహదారు పనులు త్వరగా పూర్తి చేయాలి

రహదారు పనులు త్వరగా పూర్తి చేయాలి

మహబూబాబాద్‌ రూరల్‌  : జాతీయ రహదారుల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం మహబూబాబాద్‌ నుంచి కంబాలపల్లి వరకు ఉన్న జాతీయ రహదారుల పనులను, వంతెనలను పరిశీలించారు. కంబాలపల్లి వద్ద రహదారుల విస్తరణ ఆర్చి నిర్మాణం, డ్రైనేజీ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నిర్ణీత గడువులోగా పనుల ను పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్‌ అధికారులు ఈఈ హరిచంద్ర ప్రసాద్‌, ఏఈ మధన్‌ గౌడ్‌ కాంట్రాక్టర్‌ శ్రీనివాస్‌ తదితరులున్నారు.

గూడూరు: మండల కేంద్రంలోని నిర్మిస్తున్న జాతీయ రహదారి 365 పనులను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను కలెక్టర్‌ వీపీ గౌతం ఆదేశించారు.  మండలంలోని గూడూరు నుంచి భూపతిపేట వర కు గల ఎన్‌హెచ్‌ నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్డును, కల్వర్టులను, భూపతిపేట వద్ద బ్రిడ్జిని పరిశీలించారు. పనులను వేగంగా నాణ్యతగా నిర్మించాలని ఆదేశించారు.  ఆయన వెంట తహసీల్దార్‌ శైలజ, ఇంజినీరింగ్‌ అధికారులున్నారు.

అభివృద్ధి పనుల పరిశీలన..

కొత్తగూడ : మండలంలోని కొత్తగూడ, కార్లాయి, బత్తులపల్లి, వేలుబెల్లి గ్రామాల్లో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ పర్యటించారు. శ్మశాన వాటిక, సెగ్రిగేషన్‌ షెడ్డు, డంప్‌ యార్డు పనులను పరిశీలించారు. శ్మశాన వాటిక పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయా గ్రామాల సర్పంచ్‌లకు ఆదేశించారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తయ్యేలా  అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయానిక చేరుకొని భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అధికారులతో కలిసి ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి నర్సింగరావు, పంచాయతీ రాజ్‌ ఇన్‌చార్జి మహేశ్‌ పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వద్దు 

గంగారం: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయవద్దని అధికారులకు కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ఆదేశించారు. మండల కేద్రంలోని పంచాయతీ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.   మండల అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఎంపీడీవో శ్యాం సుందర్‌ సరైన సమాధానం చెప్పకపోవడంతో మండి పడ్డా రు.  అర్హులైన ప్రతి ఒక్కరికీ జాబ్‌ కార్డు అందించి ఉపాధి చూపించాలన్నారు. డిసెంబర్‌లో ప్రతి గ్రామ పంచాయతీలోని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామాభివృద్ధి అధికారి పీడీ విద్యాచందన, డిప్యూటీ తహసీల్దార్‌ సంపత్‌ కుమార్‌, ఎంపీడీవో శ్యాంసుంధర్‌, ఏపీవో అరుణ్‌కుమార్‌, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు సూరయ్య, సమ్మయ్య, వెంకటలక్ష్మి, కాంతారావు, సారక్క, మండల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.