శనివారం 16 జనవరి 2021
Mahabubabad - Nov 26, 2020 , 02:07:04

మనసున్న సర్పంచ్‌

మనసున్న సర్పంచ్‌

  • మహబూబాబాద్‌ ఏరియా దవాఖానకు అత్యాధునిక పరికరాల అందజేత
  • వాటి విలువ రూ.15లక్షలు
  • ప్రారంభించిన కలెక్టర్‌ వీపీ గౌతమ్‌
  • మచ్చ శ్రీనివాసరావుకు అభినందనల వెల్లువ

నిరుపేదలకు కార్పొరేట్‌ తరహా వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న యజ్ఞంలో తానూ భాగమయ్యాడు. మహబూబాబాద్‌ ఏరియా దవాఖానకు అత్యాధునిక వైద్యపరికరాలు అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. మరిపెడ మండలం బురహాన్‌పురం సర్పంచ్‌ మచ్చ శ్రీనివాసరావు రూ.10 లక్షల63వేల విలువగల ఎక్స్‌రే మిషన్‌, రూ.4లక్షల 37వేల విలువగల బ్లడ్‌ గ్యాస్‌ ఎనలైజర్‌ను సమకూర్చి ఆదర్శంగా నిలిచాడు. వీటిని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ బుధవారం ప్రారంభించి, సర్పంచ్‌ను అభినందనలతో ముంచెత్తారు.  

- మహబూబాబాద్‌ రూరల్‌ 

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ ఏరియా దవాఖానకు మరిపెడ మండలం బురహాన్‌పురం సర్పంచ్‌ మచ్చ శ్రీనివాసరావు రూ.10లక్షల63వేల విలువగల 500 ఎంబీ ఎక్స్‌రే మిషన్‌, రూ.4లక్షల 37వేల విలువగల బ్లడ్‌ గ్యాస్‌ ఎనలైజర్‌ను సమకూర్చి ఆదర్శంగా నిలిచాడు. వీటిని సర్పంచ్‌తో కలిసి కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలల్లో పేదలకు ప్రైవేట్‌ దీటుగా ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎక్స్‌రే సేవలపై వైద్యాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎక్స్‌రే మిషన్‌ సరైన సామర్థ్యం లేక ఇబ్బందులు ఎదురయ్యాయని ప్రస్తుతం అలాంటి సమస్యలు ఇక ఉండబోవన్నారు. పేదలకు సర్కారు వైద్యశాలలో కార్పొరేట్‌ తరహా వైద్యసేవలు అందించేందుకు ముందుకు వచ్చి విలువైన పరికరాలను అందించిన సర్పంచ్‌ శ్రీనివాసరావును అభినందించారు. హై ఇంటెన్సిటీతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఎక్స్‌రే పరికరాన్ని కొనుగోలు చేసి ఇవ్వడం గొప్ప విషయమన్నారు. సర్పంచ్‌ శ్రీనివాసరావును స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలో మరింత మంది ముందుకు వచ్చి వైద్యశాల అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. రూ.80లక్షలతో ఐసీయూ, వెంటిలేటర్‌ సిస్టం, 20 ఆక్సిజన్‌ సిలిండర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కొత్తగా మూడు అంబులెన్స్‌లు కేటాయించినట్లు చెప్పారు. జిల్లాలో ప్రసవాల ప్రగతిపైనా రోజూ సమీక్షిస్తున్నామని చెప్పారు. అనంతరం ఏరియా వైద్యశాలను, కొవిడ్‌ విభాగాన్ని సూపరింటెండెంట్‌, కో ఆర్డినేటర్‌ భీమ్‌ సాగర్‌తో కలిసి పరిశీలించారు. అందుతున్న వైద్యసేవలు, సౌకర్యాలపై గర్భిణులను అడిగి తెలుసుకున్నారు. దవాఖానకు వచ్చిన ప్రతి ఒక్కరికి కొవిడ్‌ టెస్ట్‌ చేయాలని ఆదేశించారు. ఇక్కడ నిర్మిస్తున్న కొవిడ్‌ విభాగం భవనాన్ని వెంటనే పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు సూచించారు. కార్యక్రమంలో వైద్యులు రమేశ్‌, సూర్యకుమారి, సతీష్‌, వెంకన్న పాల్గొన్నారు.