పడవలో పక్కదారి

అక్రమంగా తరలుతున్న రేషన్ బియ్యం
పీడీ యాక్టు కేసులు నమోదవుతున్నా భయపడని అక్రమార్కులు
మహబూబాబాద్, నమస్తే తెలంగాణ : పీడీఎస్ బియ్యాన్ని పడవల ద్వారా అక్రమార్కులు ఇతర దేశాలు దాటిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళల్లో దందా సాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 553 రేషన్ షాపుల ద్వారా 2,42,465 మంది ఆహార భద్రత కార్డుదారులకు ప్రతి నెల 48,555 క్వింటాళ్ల రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. వీటిని కొంతమంది బ్రోకర్లు, మిల్లర్లు యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రేషన్ షాపుల నుంచి కార్డుదారులు తీసుకెళ్లిన బియ్యాన్ని సేకరించేందుకు జిల్లాలో పలు మండలాలు, గ్రామాల్లో బ్రోకర్లు తిరుగుతున్నారు. ట్రాలీ ఆటోలు వేసుకొని గ్రామాల్లో తిరుగుతు రూ.8లకు కిలో బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని ఆటోల ద్వారా మిల్లులకు తరలిస్తున్నారు. ఇక్కడ రీసైక్లింగ్ చేసి గోనె సంచుల్లో నింపుతున్నారు. రాత్రికి రాత్రే లారీల్లో లోడ్ చేసి మానుకోట వయా కోదాడ చెక్‌పోస్టు మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. తెల్లవారక ముందే లారీలు రాష్ట్రం సరిహద్దులు దాటుతున్నాయి. జిల్లాలో కురవి, గంగారం, కొత్తగూడ, గూడూరు మండలాల్లోని పాడుబడిన ఇళ్లను ఎంపిక చేసుకొని అక్కడ నుంచి దందా కొనసాగిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పలు పాత మిల్లులో కొంతమంది అక్రమార్కులు కలిసి ఈ దందా కొనసాగిస్తున్నారు. కురవి మండలంలో అయ్యగారిపల్లి, నేరడ, సీరోలు, బయ్యారం మండలంలో ఉప్పలపాడు, బాలాజీపేట, కంబాలపల్లి, డోర్నకల్ మండల కేంద్రంతో పాటు వెన్నారంలో జోరుగా అక్రమ దందా సాగుతున్నది. మహబూబాబాద్ మండలం బోడగుట్ట తండాలో ఒక ఇంట్లో అక్రమంగా 100 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు.
పీడీయాక్టు కేసులు నమోదు చేస్తున్నాం
పీడీఎస్ బియ్యం తరలించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పలువురిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేశాం. జిల్లా వ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమ రవాణపై నిఘా పెట్టాం. నిత్యం తనిఖీలు చేపట్టి రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికడుతున్నాం. గతంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేసిన వ్యక్తులను గుర్తించి ఇప్పటికే కౌన్సెలింగ్ ఇచ్చాం.దీంతో పాటు గుట్కా, గంజాయి, తదితర నిషేధిత వస్తువులను అక్రమ రవాణా చేసే వారిపై నిఘా పెంచాం. రాత్రి వేళల్లో ప్రధాన కూడళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మరింత నిఘా ఏర్పాటు చేస్తాం.
-నరేశ్‌కుమార్, మహబూబాబాద్ డీఎస్పీ
మహబూబాబాద్ టు కాకినాడ
కార్డుదారుల నుంచి కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని బ్రోకర్లు మిల్లులకు తరలిస్తారు. అనంతరం బియ్యాన్ని రిసైక్లింగ్ చేసి గోనే సంచుల్లో నింపి, లారీల్లో లోడింగ్ చేస్తారు. అర్ధరాత్రి సమయంలో జిల్లా నుంచి ఏపీలోకి ప్రవేస్తుంది. తెల్లవారేలోపు పనంతా చకచకా పూర్తవుతుంది. మిల్లర్లు రూ.8లకు కిలో చొప్పున కొని రూ.18లకు విక్రయిస్తున్నారు. దీంతో మిల్లర్లకు ఒక క్వింటాలుకు అన్ని ఖర్చులు పోను వెయ్యి రూపాయల లాభం ఉంటుంది. ఒక లారీలో సుమారుగా 200 క్వింటాళ్ల బియ్యం తరలిస్తారు. మిల్లర్లు, బ్రోకర్లు లారీకి రూ.2 లక్షల వరకు లాభం పొందుతున్నారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించే వారిపై పోలీసులు పీడీ యాక్టు కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ పోలీసుల తనిఖీల్లో వందల క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుబడుతూనే ఉన్నాయి.
తాజావార్తలు
- బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది విడత కౌన్సెలింగ్
- మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు?
- శ్రీమతికి మహేష్ బర్త్‌డే విషెస్.. పోస్ట్ వైరల్
- రేపు బెంగాల్, అసోంలో ప్రధాని పర్యటన
- ఈ ఫొటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..!
- 20 తీర్మానాలను ఆమోదించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ
- బోల్తాపడిన ట్రాక్టర్.. 20 మంది కూలీలకు గాయాలు
- శివమొగ్గ ఘటనపై ప్రధాని సంతాపం
- కండ్లు చెదిరే రీతిలో.. కరిగెటలో ఫుట్‌బాల్ పోటీల కసరత్తు
- ఓయూ డిస్టెన్స్‌పై పుకార్లు నమ్మొద్దు