గురువారం 26 నవంబర్ 2020
Mahabubabad - Oct 29, 2020 , 02:03:38

రైతు సంక్షేమమే కేసీఆర్‌ లక్ష్యం...

రైతు సంక్షేమమే కేసీఆర్‌ లక్ష్యం...

  • చివరి గింజ దాకా కొనుగోలు చేస్తాం
  • ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు
  • నేటి నుంచి సీసీఐ కేంద్రాలు ప్రారంభం
  • నవంబర్‌ ఒకటి నుంచి ధాన్యం కొనుగోళ్లు
  • రైతులు తేమ, తాలు లేకుండా చూసుకోవాలి
  • అధికారులు సమన్వయంతో పనిచేయాలి
  • ఇక నుంచి మక్క పంట వేయొద్దు
  • ప్రతి కేంద్రం వద్ద పర్యవేక్షణాధికారి 
  • మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌
  • ధాన్యం, పత్తి, మక్కల కొనుగోళ్లపై సమీక్ష

రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల్లో ధాన్యం, పత్తి, మక్కల కొనుగోళ్లపై రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వ్యవసాయ, పౌర సరఫరాల, మార్కెటింగ్‌ శాఖల అధికారులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్లతో హన్మకొండ హరిత హోటల్‌లో బుధవారం వారు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ గురువారం నుంచి పత్తి, నవంబర్‌ 1నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపడుతామని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, చివరి గింజ వరకూ కొంటామని భరోసానిచ్చారు.   

హన్మకొండ : రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం హన్మకొండ హరిత హోటల్‌లో వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ధాన్యం, పత్తి, మక్కల కొనుగోలు ప్రణాళికపై కలెక్టర్లు, వ్యవసాయ, పౌర సరఫరాలు, మార్కెటింగ్‌ శాఖ అధికారులు, ఎమ్మెల్యేలు, మార్కెట్‌ కమిటీ చైర్మన్లతో జిల్లాస్థాయి కార్యాచరణ ప్రణాళిక  సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి ఎర్రబెల్లి, స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ హాజరై జిల్లాలవారీగా వానకాలం ధాన్యం, పత్తి, మక్కలు కొనుగోలు ప్రణాళికపై సమీక్షించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విలేకరులతో మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసమే కేసీఆర్‌ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 

ఇది రైతు ప్రభుత్వమని వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రణాళికలు అమలుచేస్తామని చెప్పారు. గతం కంటే ఈసారి ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి వెంటనే కొనుగోళ్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సీఎం  కేసీఆర్‌ పిలుపు మేరకు రైతులు సన్నరకాలు సాగు చేశారని ఆఖరి గింజ వరకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. గతం కంటే ఈసారి దిగుబడి ఎక్కువ వచ్చే వస్తుందనే అంచనాల మేరకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. నిబంధనల ప్రకారం తేమ, తాలు శాతం ఎక్కువ లేకుండా ఆరబెట్టి తీసుకొస్తే వెంటనే కొనుగోలు చేయడంతో పాటు రైస్‌మిల్లర్లతోనూ ఇబ్బంది ఉండదన్నారు. ఈ విషయమై అధికారులు, రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్ని రోజులైనా ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తొందరపడి తేమ, తాలు ఉన్న ధాన్యం తేవద్దని ఆయన కోరారు. గత యాసంగిలో కరోనా సమస్యతో ఇబ్బందులున్నా సీఎం ఆదేశాల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ధాన్యం కొనుగోలు చేశారు. 

ఇప్పుడు ఆ ఇబ్బందులేవీ లేవని అవసరమైతే మరిన్ని కేంద్రాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు. అలాగే కేంద్రాలు, రవాణా వాహనాలు, గోదాముల సంఖ్యను పెంచడమే గాక కేంద్రాల వద్ద పర్యవేక్షణ కోసం జిల్లాస్థాయి అధికారితో పాటు పోలీసులను నియమిస్తున్నట్లు తెలిపారు. ధాన్యం, పత్తి కొనుగోలు విషయంలో మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. గురువారం నుంచి అన్ని మార్కెట్‌ యార్డుల్లో సీసీఐ ద్వారా పత్తి, నవంబర్‌ ఒకటో తేదీ నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. పత్తిలో కూడా తేమ శాతం 12లోపు ఉండేలా చూడడంతో పాటు గన్నీ బ్యాగుల్లో తీసుకురావద్దన్నారు. గ్రామస్థాయిలో ధాన్యం, పత్తి, మక్కలు కొనుగోలుకు సంబంధించి అధికారులు ఒక కమిటీ వేసుకొని రైతులకు టోకెన్లు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. అనంతరం యాసంగి ధాన్యం కొనుగోలు ప్రణాళిక పోస్టర్‌ను విడుదల చేశారు.

మక్కలు కొనుగోలు చేస్తాం..

ప్రభుత్వం వద్దన్నా కొందరు రైతులు మక్క సాగుచేశారని, వారు నష్టపోవద్దని సీఎం కేసీఆర్‌ ఆలోచించి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఆదేశించారని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇతర దేశాల నుంచి(నేపాల్‌) క్వింటాలుకు రూ.900కే మక్కలు అమ్ముతున్నారని, దీంతో మన రాష్ట్రంలో మక్కలకు ధర తగ్గి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. గతేడాది కొనుగోలు చేసిన మక్కలతో ప్రభుత్వానికి రూ.900కోట్ల నష్టం వచ్చినా సీఎం కేసీఆర్‌ రైతుల మేలు కోరి కొనుగోలు చేశారన్నారు. ఈసారి మక్కలు కొనుగోలు చేసేందుకు కోళ్ల రైతులు కూడా ముందుకురావడం లేదని, ఈ పరిస్థితుల్లో రైతులు అప్పులపాలు కావద్దని మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. అందుకే ఇక నుంచి మక్కలు వేయవద్దని కోరారు.

అర్బన్‌ జిల్లాలో 101 కేంద్రాలు..

అర్బన్‌ జిల్లాలో ఈ వానకాలంలో ధాన్యం కొనుగోలుకు 101, పత్తి కోసం 24 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. గత యాసంగిలో ఎదుర్కొన్న సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. క్లస్టర్లు ఏర్పాటు చేసి 45వాహనాల ద్వారా ధాన్యం తరలించనున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.

సన్నాలే ఎక్కువ..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినట్లు రైతులు నియంత్రణ విధానంలో సాగు చేసి ఆయన నమ్మకాన్ని మరోసారి నిలబెట్టారని స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. సీఎం చెప్పినట్లు సన్నాలే ఎక్కువ వేశారని కొద్దిమంది మాత్రమే దొడ్డు వరి, మక్కలు వేశారన్నారు. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సీఎం హామీ ఇచ్చారన్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా పత్తి, పసుపు వంటి వాణిజ్య పంటలు వేశారన్నారు. కలెక్టర్లు, వ్యవసాయ, సివిల్‌ సప్లయ్‌, మార్కెటింగ్‌, సీసీఐ అధికారుల సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. గత యాసంగి సీజన్‌లో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. కేంద్ర విధివిధానాల వల్ల విదేశాల నుంచి కూడా 5లక్షల మెట్రిక్‌ టన్నుల మక్కలు మన దేశానికి వచ్చాయని గుర్తుచేశారు. ఇకనుంచి ఇక్కడి అవసరాల కోసం మా త్రమే పంటలు వేసి, ఎవరూ నష్టపోకుండా చూడాలని రైతును ప్రత్యేకంగా కోరుతున్నట్లు పేర్కొన్నారు.

వెనువెంటనే కొనుగోళ్లు

ఈసారి జిల్లాలో 4.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశముందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. గతేడాది ధాన్యం అమ్మేందుకు రైతులు వారం రోజుల పాటు ఎదురుచూడాల్సి వచ్చిందని ఇప్పుడా సమస్యలేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేసి లారీల్లో ఎక్కించాలని, ప్రభుత్వం కనీసం 3లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం స్టాక్‌చేసే గోడౌన్‌ వసతి ఉండాలన్నారు. ప్రాంతాలవారీగా ధాన్యం రవాణా చేయాలని చెప్పారు.

కోసిన తర్వాతే టోకెన్లు ఇవ్వాలి..

గత సీజన్‌లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారులు సమన్వయంతో విజయవంతంగా ధాన్యం కొనుగోళ్లు చేశారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రవాణా విషయంలో గతంలో వలె ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. ధాన్యం కోసిన తర్వాతే టోకెన్లు ఇవ్వాలన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్‌, జడ్పీ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, కలెక్టర్లు రాజీవ్‌గాంధీహన్మంతు, ఎం.హరిత, వరంగల్‌ రూరల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ మహేందర్‌రెడ్డి, ఆర్‌డీవోలు వాసుచంద్ర, మహేందర్‌జీ, ఏసీపీ జితేందర్‌రెడ్డి, డీఆర్‌డీవో శ్రీనివాస్‌కుమార్‌, డీసీఎస్‌వో వసంతలక్ష్మి, సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ డీఎం కృష్ణవేణి, తహసీల్దార్‌ కిరణ్‌ప్రకాశ్‌ పాల్గొన్నారు.

నేడు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న మంత్రి 

కాశీబుగ్గ : వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌ ఆవరణలో గురువారం ఉదయం 9గంటలకు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి దయాకర్‌రావు ప్రారంభించునన్నట్లు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చింతం సదానందం తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు.