శుక్రవారం 27 నవంబర్ 2020
Mahabubabad - Oct 25, 2020 , 02:14:57

ఊరూరా పూల జాతర

ఊరూరా పూల జాతర

వరంగల్‌ కల్చరల్‌ : ఉమ్మడి జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. శనివారం ఉదయం నుంచే ఊరూరా సందడి నె లకొన్నది. తీరొక్క పూలతో పెద్ద బతుకమ్మలను అందంగా పేర్చిన ఆ డబిడ్డలు సాయంత్రం కూడళ్లు, ఆలయాలు, చెరువు గట్ల వద్ద ఉంచి ఆడిపాడడంతో ఆయా ప్రాంతాలు మార్మోగాయి. ‘బతుకమ్మ బతుక మ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో అంటూ మొదలుపెట్టి, ‘పోయిరా గౌరమ్మ పోయిరావమ్మా..’ అంటూ వీడ్కోలు పలకడంతో తొమ్మిది రోజులపాటు సాగిన ‘పూల జాతర’ ఘనంగా ముగిసింది. 

ఉదయం నుంచీ సందడి..

ఉదయం నుంచి తీరొక్కపూలతో ఓర్పుగా, అందంగా బతుకమ్మలను పేర్చిన ఆడబిడ్డలు, ‘ఆట చిలుకలూ, పాట చిలకలే అయ్యారు. సాయంత్రం కూడళ్లలో ఆడిపాడి, ఊరూవాడా హోరెత్తించారు. అనంతరం బతుకమ్మలను చెరువులు, గుండాల్లో నిమజ్జనం చేసి ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు. కరోనా కారణంగా పలు ప్రాంతాల్లో వేడుకలు వెలవెలబోయాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి, రాయపర్తి మండలాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌లో మంత్రి ఈటల రాజేందర్‌, ఆయా చోట్ల ఎమ్మెల్యేలు వేడుకల్లో పాల్గొని స్థానికుల్లో ఉత్సాహం నింపారు. నగరంలోని పద్మాక్షి గుండం, ఉర్సు గుట్ట వద్ద సంబురాలు హోరెత్తాయి. జనగామ, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో పల్లెపల్లెనా పెద్ద బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. 

పూలను పూజించే గొప్ప సంస్కృతి మనది..

మహబూబాబాద్‌  రూరల్‌ : పూలను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ ఆడబిడ్డలదని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని తండ్రిగా, అన్నగా, మేనమామగా చీరెలు అందిస్తున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్‌ అని అన్నారు. సద్దుల బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల జీవితాల్లో ఆనందం తీసుకురావాలని ఆకాక్షించారు.