శనివారం 28 నవంబర్ 2020
Mahabubabad - Oct 23, 2020 , 02:03:00

బతుకు చిత్రం.. బతుకమ్మ పాట

బతుకు చిత్రం.. బతుకమ్మ పాట

  • అనాదిగా తెలంగాణలో ఆదరణ
  • జీవనశైలి, పురాణ ఇతిహాసాలపై కోలాట పాటలు
  • 50 ఏళ్ల క్రితం నుంచే పాటల పుస్తకాల ప్రచురణ
  • కాలక్రమేణా మారుతున్న శైలి

సమైక్య జీవనంతో ముడిపడి ఉన్న బతుకు చిత్రమే బతుకమ్మ పాట. అనాదిగా వ్యవసాయ పనులకు వెళ్లే మహిళలు తమ కష్టాన్ని మరిచిపోయేలా పండుగలప్పుడు పాట రూపంలో వెల్లడించేవారు. దీంతో పాటు ఇతిహాసాలు, చరిత్ర, గుండెలను కదిలించే సంఘటనలను వినిపించేవారు. సుమారు 50 ఏళ్ల క్రితమే వరంగల్‌ కేంద్రంగా ఈ పాటలన్నింటినీ ముద్రించి బతుకమ్మ వేడుకల్లో అందించేవారు. నాటి నుంచి నేటి వరకు ఈ పాటల విశిష్టత తెలంగాణ సగటు జీవనానికి ముడిపడి ఉంది.

 తొర్రూరు:  తెలంగాణ సాంస్కృతిక వైభవానికి దర్పణం బతుకమ్మ. ప్రకృతితో మమేకమై తీరొక్క పూలను, పసుపు కుంకుమను కలగలిపి పూజించే ఈ పండుగ ఎన్నో ఏళ్లుగా తెలంగాణ మహిళ ఆత్మగౌరవంతో పెనువేసు కున్నది. బతుకమ్మ వచ్చిందంటే చాలు.. ఆడబిడ్డల పూల సింగిడి, కోలాటాల పాటలతో తొమ్మిది రోజుల పాటు పల్లె, పట్నం తేడా లేకుండా సంబురాలతో మార్మోగుతుంది. ఈ పండుగకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారిక హోదా ఇచ్చి చెరువుల వద్ద సంబురాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ బతుకమ్మను విశ్వవినీతం చేసింది. తెలంగాణ నిత్య బతుకు జీవన గమనంలో సమస్యలను సంతోషాన్ని, దుఃఖాన్ని, పురాణ చరిత్రలను కలగలుపుకుంటూ కోలాట పాటలను రూపొందించుకుని ఆడిపాడి సంతోషంగా గడుపుతారు. పెళ్లి కావాల్సిన యువతులు బొడ్డెమ్మలు ఆడిన తరువాత పెళ్లయిన మహిళలు, యువతులు పసుపు, కుంకుమలు సల్లంగా ఉండాలని బతుకమ్మపై గౌరమ్మను ఉంచి పూజలు చేసి వేడుకల వద్ద అందరు ఆత్మీయంగా పలుకరించుకుంటూ మనసులోని భారా న్ని దించుకుంటారు. సుమారు 50ఏళ్ల క్రితమే వరంగల్‌ కేంద్రంగా ఎంతో మంది బతుకమ్మ పాటలు రచించి పుస్తకాల రూపంలో ముద్రించారు. నాడు ఈ పుస్తకాలే మహిళల గొంతుకుల నుంచి కమ్మనైన పాటలుగా రూపుదిద్దుకున్నాయి. ఐదు దశాబ్దాల క్రితం వ్యవసాయ పనులకు వెళ్లే మహిళలు తమ కష్టాన్ని మరిచిపోయేలా పండుగ సందర్భంలో బతుకమ్మ పాటలను పాడేవారు. దీంతోపాటు ఇతిహాసాలు, చరిత్రలు, తదితర సంఘటనలు బతుకమ్మ పాటల రూపంలో వినిపించేవారు. గౌరమ్మ, ధర్మాంగధ, చంద్రహాసి చరిత్ర, సత్యహరిశ్చంద్ర చరిత్ర, సతీసావిత్రి, శ్రీ చిలుపూరి వేంకటేశ్వరస్వామి ఉయ్యా ల పాట, జడ్చర్ల రైలు ప్రమాదాన్ని కళ్లకు కట్టేలా, వీరబ్రహ్మంగారి చరిత్ర, బా లనాగమ్మ, కుశలవులు, నక్క ఆండాళమ్మ చరిత్రలతో ఎన్నో బతుకమ్మ ఊ యల పాటలు రూపుదిద్దుకున్నాయి. వరంగల్‌ కేంద్రంగా ప్రత్యేకంగా ఊయల పాటలను ముద్రించి అందరికీ బతుకమ్మ వేడుకల్లో అందుబాటులో ఉంచేవారు. తెలంగాణ సాధన కోసం అసువులు బాసిన అమరవీరులను స్మరిస్తూ కూడా బతుకమ్మ పాటలు అందుబాటులోకి వచ్చాయి. కాలం మారుతున్నా కొద్ది పాటల శైలి రూపాంతరం చెందుతుంది. ఎంతో మంది గాయకులు యేటా కొత్త తరహా బతుకమ్మ పాటలను పాడుతున్నారు. అనేక టీవీ మాధ్యమాలు ప్రతి సంవత్సరం ఒక కొత్త పాటను బతుకమ్మ సందర్భంగా విడుదల చేస్తూ ఏ పాట బాగా ప్రాచుర్యంలోకి వస్తుందో ఆ చానల్‌ టీఆర్పీని పెంచు కుంటోంది. బతుకమ్మ వేడుకలు నిర్వహించుకునే చెరువుల వద్ద ఊర్రూతలూగించే పాట డీజేల్లో మార్మోగుతుండగా పాటకు తగ్గట్టు మహిళలు కోలాటం వేస్తూ ఉత్సాహభరిత వాతావరణంలో పండుగ జరుపుకుంటున్నారు.