బుధవారం 25 నవంబర్ 2020
Mahabubabad - Oct 22, 2020 , 01:50:27

పల్లెప్రగతిలో నల్లెల్లకు మొదటి ర్యాంకు

పల్లెప్రగతిలో నల్లెల్లకు మొదటి ర్యాంకు

కురవి, అక్టోబర్‌ 21: పల్లెప్రగతి ప్రోగ్రెస్‌లో కురవి మండలం నల్లెల్ల గ్రామం మొదటి ర్యాంకు సాధించినట్లు ఎంపీడీవో కె.ధన్‌సింగ్‌ తెలిపారు. బుధవారం పల్లెప్రగతి పనులకు మండలంలోని 48 గ్రామాలకు ర్యాంకులను కేటాయించారు. నర్సరీ, సేంద్రియ ఎరువుల షెడ్‌, హరితహారం, మొక్కల పెంపకం, ఇంటింటికీ ఇంకుడుగుంతలు, శ్మశానవాటిక, వ్యక్తిగత మరుగుదొడ్లు, పారిశుధ్యం, ట్రాక్టర్‌, ట్రాలీ, వాటర్‌ ట్యాంకర్ల వినియోగం అంశాలపై 100 పాయింట్లకు గాను 78 పాయింట్లు సాధించి నల్లెల్ల గ్రామంలో కురవి మండలంలోని 48 గ్రామాల్లో ముందంజలో ఉన్నట్లు తెలిపారు. 77 పాయింట్లతో బంచరాయితండా, కొత్తూరు, కాకులబోడుతండా, కంచర్లగూడెం గ్రామాలు రెండో స్థానంలో నిలిచినట్లు తెలిపారు. గ్రామాల మధ్య పోటీతత్వం పెంచేందుకు ఈ ర్యాంకులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. నల్లెల్ల సర్పంచ్‌ సుధాకర్‌రెడ్డికి ఎంపీడీవో శుభాకాంక్షలు తెలిపారు. తక్కువ పాయింట్లు వచ్చిన సర్పంచ్‌లు పోటీ పడి మొదటి ర్యాంకు వచ్చేలా కృషి చేయాలన్నారు.  సర్పంచ్‌ ఎర్రంరెడ్డి  సుధాకర్‌రెడ్డి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్‌లలో వయస్సులో పెద్దవారు. ఆయన గతంలో మూడు పర్యాయాలు నల్లెల్ల సర్పంచ్‌గా కొనసాగారు. సర్పంచ్‌ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. అన్ని పార్టీల నాయకులు, కులసంఘాల పెద్దలను  గ్రామపంచాయతీ పాలక మండలి సమావేశానికి ఆహ్వానించి వారి సలహాలు తీసుకోవడం ద్వారానే పనులు శరవేగంగా పూర్తి అయ్యాయన్నారు. గ్రామాభివృద్ధికి యువకులచే ఒక వాట్సప్‌ గ్రూపును ఏర్పాటు చేశామని, వారి సూచనలు కూడా ఆమోదయోగ్యమైతే స్వీకరించామన్నారు.