మంగళవారం 20 అక్టోబర్ 2020
Mahabubabad - Sep 25, 2020 , 05:37:17

హలధారుల ఆనందహేల

హలధారుల ఆనందహేల

  • సీఎం కేసీఆర్‌పై అన్నదాతల్లో వెల్లువెత్తిన కృతజ్ఞతాభిమానం  
  • కొత్త రెవెన్యూ చట్టంపై హర్షాతిరేకాలు
  • మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో 500 ట్రాక్టర్లతో రైతుల భారీ ర్యాలీ
  •  ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ ఆధ్వర్యంలో సంబురాలు
  • ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
  • కేంద్ర బిల్లులపై ఆగ్రహం
  • తెలంగాణలో రైతురాజ్యం : ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌

మహబూబాబాద్‌ : కొత్త రెవెన్యూ చట్టంపై హర్షం వ్యక్తం చేస్తూ మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్లతో గురువారం భారీ ర్యాలీ తీశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్సార్‌ సెంటర్‌ దాకా వందలాది మంది పటాకులు కాలుస్తూ నినాదాలతో హోరెత్తించారు. నెహ్రూ సెంటర్‌ వద్ద సీఎం చిత్రపటానికి ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ రైతులతో కలిసి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో రైతు రాజ్యం దిశగా ప్రభుత్వం ముందుకు పోతున్నదని, రాష్ట్రంలో పల్లెలు పచ్చని పొలాలతో కళకళలాడుతున్నాయన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెచ్చిన నూతన రెవెన్యూ చట్టంతో రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తున్నదన్నారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి, కొత్త రెవెన్యూ చట్టంతో సీఎం కేసీఆర్‌ రైతులు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేశారని కొనియాడారు. కేంద్రం తెచ్చిన బిల్లులు కార్పొరేట్‌ సంస్థలకు మేలు చేసేవిగా, రైతులకు అన్యాయం చేసేవిగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సదరు బిల్లులను కేంద్రం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, కేంద్రం వ్యవసాయ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని మండిపడ్డారు. దేశంలో రైతుల నడ్డి విరిచేలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 రాష్ర్టాలు వ్యతిరేకించినా కేంద్రం బిల్లులను ఆమోదింపజేయడం అప్రజాస్వామికమన్నారు.

గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చి అభివృద్ధి పథాన నిలుపుతున్న దేవుడు కేసీఆర్‌ అని కొనియాడారు. పట్టణంలోని అండర్‌బ్రిడ్జి నుంచి వివేకానంద సెంటర్‌దాకా సాగిన ఈ ర్యాలీలో మహబూబాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, మహబూబాబాద్‌ జడ్పీటీసీ లూనావత్‌ ప్రియాంక, నెల్లికుదురు ఎంపీపీ మాధవి, టీఆర్‌ఎస్‌ మహబూబాబాద్‌ మండలాధ్యక్షుడు యాస వెంకట్‌రెడ్డి, జిల్లా నాయకలు మార్నేని వెంకన్న, సుధగాని మురళి, యాదగిరిరావు, టీఆర్‌ఎస్‌ యూత్‌ నియోజకవర్గ అధ్యక్షుడు యాళ్ల మురళీధర్‌రెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ చిట్యాల జనార్దన్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ బూర్ల ప్రభాకర్‌, మండల కో ఆర్డినేటర్‌ తేళ్ల శ్రీను, కౌన్సిలర్లు బాలూనాయక్‌, మార్నేని రఘు, అర్షికారావిష్‌, నాయకులు లూనావత్‌ అశోక్‌, ఎం రఘు, దామునాయక్‌, నర్సింగ వెంకన్న పాల్గొన్నారు. 


logo