సోమవారం 26 అక్టోబర్ 2020
Mahabubabad - Sep 23, 2020 , 03:18:57

వీడిన మిస్సింగ్‌ మిస్టరీ

వీడిన మిస్సింగ్‌ మిస్టరీ

  • అదృశ్యమైన హోంగార్డు హత్య?
  •  ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం 
  •  అప్పల్‌రావుపేట శివారులో మృతదేహాన్ని తగులబెట్టిన ఆనవాళ్లు

నెక్కొండ, సెప్టెంబర్‌ 22 : హోంగార్డు మిస్సింగ్‌ మిస్టరీ వీడింది. వారం రోజుల నుంచి కనిపించకుండాపోయిన బాదావత్‌ ధర్‌యావత్‌సింగ్‌ హత్యకు గురికాగా, అప్పల్‌రావుపేటలో మృతదేహాన్ని తగులబెట్టిన ఆనవాళ్లు దొరకడం కలకలం రేపింది. కుటుంబ సభ్యులు, విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నెక్కొండ మండలం గేటుపల్లికి చెందిన బాదావత్‌ ధర్‌యావత్‌సింగ్‌ (42) వరంగల్‌లో ట్రాఫిక్‌ విభాగంలో హోంగార్డుగా పని చేస్తున్నాడు. అతని భార్య జ్యోతి టైలర్‌ షాపును నిర్వహిస్తుండగా కొన్నేళ్లుగా నెక్కొండలో నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు, కూతు రు ఉన్నారు. ఈ క్రమంలో జ్యోతికి అప్పల్‌రావుపేటకు చెందిన జిల్ల రాజుతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇటీవల విషయం బయటకు పొక్కడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ నెల 15 నుంచి ధర్‌యావత్‌సింగ్‌ కనపడకుండా పోవడం తో కుటుంబ సభ్యులు మూడు రోజుల క్రితం నెక్కొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా భార్య, ఆమె ప్రియుడు హత్య చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇంటిలోనే జ్యోతి సాయంతో హతమార్చిన ప్రియుడు తన బంధువుల సహకారంతో మృతదేహాన్ని అప్పల్‌రావుపేట శివారు గుట్టప్రాంతంలో తగులబెట్టినట్లు సమాచారం. అంతేకాకుండా ఆధారాలు దొరకకుండా చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మంగళవారం మధ్యాహ్నం స్థానిక పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకుని హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేశారు.  కేసు విచారణకు వచ్చిందని న్యాయం చేస్తామనడంతో శాంతించారు. నర్సంపేట ఏసీపీ ఫణీందర్‌, సీఐ తిరుమల్‌, ఎస్సై నాగరాజు సంఘటన స్థలా న్ని పరిశీలించారు. అయితే హత్యకు వివాహేతర సంబంధమే కారణమా? లేక మరేమైనా ఉన్నా యా అనేది విచారణలో తేలనుంది.logo