శనివారం 05 డిసెంబర్ 2020
Mahabubabad - Sep 21, 2020 , 05:27:38

అసైన్డ్‌ లెక్క తేలుతోంది

అసైన్డ్‌ లెక్క తేలుతోంది

  • కొత్త రెవెన్యూ చట్టం నేపథ్యంలో అంతటా సర్వే
  • అనర్హుల ఆధీనంలో వేలాది ఎకరాలున్నట్లు గుర్తింపు
  • ఇక పక్కాగా సర్కారు భూముల లెక్క
  • ప్రభుత్వ, అసైన్డ్‌ వివరాలు సేకరిస్తున్న రెవెన్యూఅసలు లబ్ధిదారులెవరనే విషయమై ఆరా
  • పలుచోట్ల ఇతరుల చేతుల్లో స్థలాలు
  • అన్యాక్రాంతమైన భూములపై త్వరలో నిర్ణయం
  • సర్కారు ఆదేశాలు రాగానే అక్రమార్కులపై చర్యలు
  • ఆక్రమణదారుల గుండెల్లో గుబులు

కొత్త రెవెన్యూ చట్టం.. రెవెన్యూ వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొస్తోంది. ఇటీవల అసెంబ్లీలో బిల్లుకు ఆమోదముద్ర పడడంతో అధికార యంత్రాంగం భూముల లెక్క తేల్చే పనిలో పడింది. ఇంతకీ ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి..? పేదలు, ఇతరులకు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూమి ఎంత? అందులో అనర్హుల చేతికి వెళ్లినవి ఎన్ని? ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్నాయనే వివరాలపై క్షుణ్ణంగా సర్వే చేయిస్తోంది. చట్ట ప్రకారం విక్రయించేందుకు వీలులేకున్నా వేలకొద్ది ఎకరాల అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతమైనట్లు గుర్తించింది. త్వరలో మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోనుండడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది.

- మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ

మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ : సర్కారు భూము ల వివరాలపై అధికార యంత్రాంగం లెక్కలు వేస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టానికి ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో జిల్లాలో ఉన్న భూముల వివరాలు సేకరిస్తోంది. ఇప్పటికే ఎక్కడెక్కడ ఎంత భూమి ఉందనే సమాచారమంతా ఆన్‌లైన్‌లో అధికారులు వద్ద ఉండగా, తాజాగా అ సైన్డ్‌ భూములు లెక్క తేల్చేందుకు రంగంలోకి దిగారు. ఈమేరకు ఎంతమందికి భూమిని పంపిణీ చేశారు? అందులో అసలైన లబ్ధిదారులు ఉన్నారా? లేక ఇతరుల చేతిలోకి వెళ్లిందా? అనే వివరాలు సేకరిస్తున్నారు. అయితే జిల్లాలో చాలాచోట్ల అనర్హుల ఆధీనంలో ప్రభుత్వ భూములున్నట్లు జిల్లా యం త్రాంగం ఇదివరకే గుర్తించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త గా వచ్చిన కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ జిల్లాకేంద్రంలో సర్వేచేయించారు. సర్కారు భూమి ఎంత ఉంది? అందులో ఎంతమందికి పట్టాలు ఇచ్చాం? ఎంతభూమిని ఆక్రమించారనే వివరాలు సేకరించారు. తాజాగా ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం నేపథ్యంలో ఆదేశాలివ్వడంతో మరోమారు అసైన్డ్‌ భూముల తేల్చుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే నిరుపేదలకు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములు ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్నాయి? వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటనే వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన భూమి వారి పేరు మీ దే ఉన్నాయా..? లేక ఇతరుల పేర మారాయా అని ఆరా తీ స్తున్నారు. ఇవేగాక అసైన్‌ చేయకుండా ఉన్న భూములెన్ని అ నే వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ప్రతి మండలంలో త హసీల్దార్‌ నేతృత్వంలో మండలాన్ని యూనిట్‌గా తీసుకొని భూముల వివరాలను సేకరించారు.

భూముల వివరాల సేకరణ..

రెవెన్యూ అధికారులు ప్రస్తుతం రికార్డుల ఆధారంగానే అసైన్డ్‌ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలుసుకొని వివరాలు నమోదు చేస్తున్నారు. పూర్తిస్థాయిలో రెవెన్యూ అధికారుల బృందం క్షేత్రస్థాయిలోకి వెళ్లి అసైన్డ్‌ భూములను పరిశీలిస్తే వందలాది ఎకరాలు ప్రభుత్వపరం కానున్నాయి. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా జిల్లాలో మెజార్టీ అసైన్డ్‌ భూ ముల క్రమబద్ధీకరణ పూర్తయింది. మండలకేంద్రాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న అసైన్డ్‌ భూములకు మాత్రమే ప ట్టాల పంపిణీ నిలిపివేశారు. లబ్ధిదారుల్లో నిరుపేదలు, మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారు. భూముల విలువ భారీగా పెరడంతో సగానికి పైగా ఇతరులకు విక్రయించినట్లు తెలుస్తోంది. పీవోటీ చట్టం(1977) ప్రకారం అసైన్డ్‌ భూముల అమ్మడం, కొనడం చేయరాదు. అయినప్పటికీ భూముల క్రయవిక్రయాలు భారీగా జరిగాయి. చాలావరకు భూములు అమ్ముకున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇందు లో భూ మాఫియా చేతుల్లోకి కొంత వెళ్లగా, మరికొంత భూమి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునేందుకు కొనుగోలు చేశారు. ఇక పట్టణ ప్రాంతాల్లో ఉన్న అసైన్డ్‌ భూ ముల్లో కట్టడాలు కూడా వెలియడం గమనార్హం.

అనర్హుల చేతిలో 24వేల ఎకరాలు..

మహబూబాబాద్‌ జిల్లావ్యాప్తంగా 16 మండలాల పరిధిలో 1.10 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 41,724మందికి 53,701ఎకరాల భూమిని అర్హులైన పేదలతో పాటు స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు పంపిణీ చేశారు. ఇందులో 29,283 మంది రైతులకు 29,238 ఎకరాల భూమి ఉంది. అంటే 12441 మంది లబ్ధిదారులు 24463 ఎకరాల భూమిని ఇతరులకు అమ్ముకున్నారు. అయితే సాగు చేసుకునేందుకు ఇచ్చిన భూమిని కొం దరు లబ్ధిదారులు స్వలాభం కోసం అమ్ముకున్నారు. దీనిని గుర్తించిన అధికార యంత్రాంగం వివరాలు సేకరిస్తోంది. దీంతో కొత్త చట్టం ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వ భూ ములను కొనుగోలు చేసిన వారిలో ఆందోళన మొదలైంది. తాము కొనుగోలు చేసిన భూమి దక్కుతుందా? లేక ప్రభు త్వం స్వాధీనం చేసుకుంటుందా అని చర్చించుకుంటున్నారు.

కొత్త చట్టం.. ఏం చెబుతోంది?

ప్రభుత్వ భూమిని ఆక్రమించినా, నిరుపేదలకు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూమిని అమ్మినా, ఇతరులు కొన్నా చెల్లదు. అవసరమైతే అమ్మిన, కొన్నవారు ఇద్దరిపై ప్రభుత్వం కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. అసైన్డ్‌ భూమిని మొదటిసారి తెలియక ఎవరైనా విక్రయిస్తే తిరిగి వారికే అప్పగిస్తుంది. రెండోసారి మళ్లీ అలాగే అమ్మితే కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. జిల్లాలో చాలా మండలాల్లో అసైన్డ్‌ భూములు వందల ఎకరాల్లో చేతులు మారాయి. గతంలో మహబూబాబాద్‌, నెల్లికుదురు మండలాల్లో అసైన్డ్‌ భూము లు అన్యాక్రాంతమైన సంఘటనలు వెలుగుచూశాయి. ఇవేగాక అనేక మండలాల్లో అసైన్డ్‌ భూములు అనర్హుల చేతిలో ఉన్నట్లు గుర్తించారు. తాజాగా వచ్చిన కొత్త చట్టంతో సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోనున్నారు.

కొత్త చట్టం ప్రకారం చర్యలు

ప్రభుత్వ భూమిని గతంలో అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశాం. అసైన్డ్‌ భూమిలో అర్హులే ఉన్నారా? లేక ఇతరులెవరైనా కొన్నారా? అనే వివరాలు సేకరిస్తున్నాం. కొత్త చట్టం ప్రకారం వచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే మా వద్ద ఉన్న రికార్డులతో సహా అన్ని వివరాలున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటాం.

కొమురయ్య, మహబూబాబాద్‌ ఆర్డీవో