సోమవారం 30 నవంబర్ 2020
Mahabubabad - Aug 12, 2020 , 02:40:03

జిల్లాలో పొంగుతున్న వాగులు

జిల్లాలో పొంగుతున్న వాగులు

మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ: గత రెండు రోజులుగా కురిసిన వర్షాలతో జిల్లా జలకళను సంతరించుకుంది. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చెరువులు, కుంటల్లోకి భారీగా వరదనీరు చేరింది. కొన్ని చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక వర్షపాతమని, ఇక సాగుకు ఢోకా లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అంతటా వరినాట్లు ఊపందుకున్నాయి. ఈ నెల 31తో వరినాట్లు వేసే గడువు ముగియనుందని వ్యవసాయ అధికారులు ఇప్పటికే ప్రకటించడంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. బోరుబావులు, బావుల కింద కొంతమేరకు వరినాట్లు పూర్తయ్యాయి. చెరువుల కింది రైతులు నాట్లు వేసేందుకు పొలం మడులను సిద్ధం చేసుకుంటున్నారు. కొత్తగూడ, బయ్యారం, గూడూరు, మహబూబాబాద్‌, కేసముద్రం మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జూన్‌, జూలై నెలల్లో కురిసిన వర్షాలతో పత్తి, కంది, పసుపు, తదితర పంట లు వేశారు. ప్రస్తుతం వాటిలో కలుపుతీయడం, గొర్రు తోలడం వంటి పనులు చేస్తున్నారు.

రెండు రోజులుగా కురిసిన వర్షాలతో జిల్లాలోని చెరువులన్ని జలకళను సంతరించుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1560 చెరువులు ఉండగా, ఇందులో పూర్తి స్థాయి లో నిండిన చెరువులు 400 ఉన్నాయి. 75నుంచి 100శాతం నిం డిన చెరువులు 478, 50నుంచి 75శాతం నిండినవి 318, 25నుంచి 50శాతం నిండిన చెరువులు 287 ఉన్నాయి. 0నుంచి 25శాతం వరకు నిండిన చెరువులు 77 ఉన్నాయి. 16మండలాల్లోని 1560 చెరువులు, కుంటల్లోకి వరదనీరు చేరడంతో సాగు పనులు జోరందుకున్నాయి. మహబూబాబాద్‌ శివారులోని మున్నే రు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. బయ్యారం మండలం తులారం ప్రాజెక్టు, గౌరారం, పెద్ద చెరువు లు మత్తడి పోస్తున్నాయి. కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి చెరువుతోపాటు వెంకటగిరిలో సూరారం చెరువు, ఉప్పరపల్లిలో ఊర చెరువు, కల్వలలో తుమ్మ ల చెరువు మత్తడి దుంకుతున్నాయి. మహబూబాబాద్‌ మండలంలో ఈదులపూసపల్లి, సాదుతండా, వీఎస్‌ లక్ష్మీపురం, సికింద్రాబాద్‌ తండాలో ఊర చెరువు, నర్సింహులపేట మండలంలో కొమ్ములవంచ కొత్తచెరువు, పడమటిగూడెం ఊర చెరువు, నాగారం పెద్దచెరువు, దంతాలపల్లి మండలంలో కుమ్మరికుంట్లలో రెండు, పెద్దముప్పారంలో రెండు, గున్నేపల్లిలో ఒకటి, రేపోణి, దాట్ల, దంతాలపల్లిలో రెండు చెరువులు, చిన్న గూడూరు పెద్దచెరువు మత్తడి పోస్తున్నాయి. బయ్యా రం చెరువు నిండి ఎర్ర క్వాల ద్వారా గార్ల పెద్ద చెరువులోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో మత్తడిపోస్తున్నది. గార్ల మండల కేంద్రం శివారులో ని పాకాల ఏరు చెక్‌డ్యాంపై నుంచి వర ద ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో రాంపురం, మద్దివంచ, కొత్తతండా, పులిగుట్టతండా తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పొన్నగండి చెరువు అలుగు పోస్తున్నది.