శనివారం 23 జనవరి 2021
Mahabubabad - Aug 10, 2020 , 00:32:46

ఏడుగురు పీడీఎస్‌ బియ్యం వ్యాపారుల అరెస్టు

ఏడుగురు పీడీఎస్‌ బియ్యం వ్యాపారుల అరెస్టు

పెద్దవంగర, ఆగస్టు 9 : అక్రమంగా పీడీఎస్‌ బియ్యాన్ని తరలిస్తున్న ఏడుగురు వ్యాపారులను అరెస్టు చేసినట్లు తొర్రూరు డీఎస్పీ ఎం వెంకటరమణ తెలిపారు. ఆదివారం వివరాలను ఆయన వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటకు చెందిన మాలోత్‌ లింగా, భూక్యా విజయ్‌, జనగామ జిల్లా కడగుట్ట తండాకు చెందిన ధరావత్‌ మొగిలి, మహారాష్ట్ర సోలాపుర్‌ తాలూకా భార్సీకు చెందిన అక్బర్‌మూలాని, మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల గ్రామానికి చెందిన మిట్టకోళ్ల సుజాత, అమర్‌సింగ్‌ తండాకు చెందిన ధరావత్‌ అశోక్‌, బాదవత్‌ సుమన్‌ గ్రామాల్లో  రేష న్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి అక్రమంగా వ్యాపా రం నిర్వహిస్తున్నారు. వీరు బొమ్మకల్లు శివారులో అక్రమంగా తరలిస్తున్న, నిల్వ చేసిన రూ.1.18లక్షల విలువైన 46 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని శనివారం తెల్లవారుజామున పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. అలాగే, బియ్యం తరలించడానికి వినియోగించిన డీసీఎం, బోలేరో, ఒక ద్విచక్ర వాహనాన్ని సీజ్‌ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్‌ సప్లయ్‌ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. కాగా, మండల సరిహద్దులు ఇతర జిల్లాల సరిహద్దులుగా ఉండడంతో ఇలాంటి అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ మేరకు అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచినట్లు చెప్పారు. ప్రస్తుతం పట్టుబడిన వారిలో ఇంతకు ముందు పీడీఎస్‌ బియ్యం కేసుల్లో నిందితులై ఉంటే వారిపై పీడీయాక్టు నమోదు చేస్తామని తెలిపారు. కాగా, పీడీఎస్‌ బియ్యన్ని, నిందితులను పట్టుకున్న ఎస్సై జితేందర్‌, హెడ్‌కానిస్టేబుల్‌ సుభాష్‌, కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌, మహేశ్‌, రవికుమార్‌, రాంనారాయణకు క్యాష్‌ రివార్డును అందించి డీఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్సై కుమారస్వామి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


logo