సోమవారం 28 సెప్టెంబర్ 2020
Mahabubabad - Aug 08, 2020 , 02:41:02

జ‌ల చెలిమె

జ‌ల చెలిమె

కేసముద్రంటౌన్‌ :వ్యవసాయాన్ని పండుగ చేసి రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఇం దులో భాగంగానే వాగులపై చెక్‌డ్యాంలు నిర్మించి వృథాగా పోతున్న వర్షపు నీటిని ఒడిసి పట్టి పంట పొ లాలకు మళ్లిస్తున్నది. కేసముద్రం మండలంలోని వెంకటగిరి, కాట్రపల్లి, అర్పనపల్లి, ఉప్పరపల్లి గ్రా మాల మధ్య వట్టివాగుపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెక్‌ డ్యాం నిర్మించి రైతుల ఏళ్లనాటి కలను సాకారం చేసింది. గతంలో వట్టివాగు నుంచి వర్షపు నీరు వృథా గా వెళ్లేది. కండ్ల ముందు నుంచే నీరు వెళ్తున్నా పంటలకు మళ్లించలేని పరిస్థితి నెలకొంది. ఆనకట్ట లేకపోవడంతో రెం డు, మూడు నెలలు మాత్రమే వాగులో నీరు ఉండేది. దీంతో భూగర్భ జలాలు అడుగంటేవి. చేసేదేమీ లేక రైతులు వానకాలంలో మాత్రమే పంట పం డించుకునేవారు. రైతులు గత పాలకులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో ఇప్పు డు ఆ పరిస్థితి పోయింది. ప్రభుత్వమే రైతుల అవసరాలను గుర్తించి వాగులపై చెక్‌ డ్యాంలు, ఇంకుడు గుంత లు, నీటి తొట్లు నిర్మిస్తూ నీటి వృథాను అరికడుతున్నది. 

మండలంలోని కాట్రపల్లి, వెంకటగిరి, ఉప్పరపల్లి, అర్పనపల్లి, పెనుగొండ గ్రామాల మధ్య ఉన్న వట్టివాగుపై సుమారుగా రూ.9.50 కోట్ల వ్యయంతో నాలుగు చెక్‌డ్యాంల నిర్మాణానికి ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ నిధులు మంజూరు చేయించారు. నాలుగు చెక్‌ డ్యాంల నిర్మాణం పూర్తయితే వర్షపు నీరు నిలిచి భూగ ర్భ జలాలు పెరిగి రైతులు రెండు పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కాట్రపల్లి, వెంకటగిరి గ్రామాల మధ్య రూ.1.92 కోట్లతో నిర్మించిన చెక్‌ డ్యాం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇటీవ ల కురిసిన వర్షాలకు జలకళను సంతరించుకొని ఇప్పుడది జల చెలిమెలా మారింది. దాదాపు ఆరు నెలలపా టు నీరు నిల్వ ఉండి రెండు పంటలూ పండనున్నాయి. దీంతో ఆ ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రెండు పంటలు పండిస్తాం..

వానకాలంలో మా వ్యవసాయ భూమి పక్కన ఉన్న వాగు నుంచి వర్షపు నీరు వృథాగా పోయేది. ఈ ఏడాది ప్రభుత్వం చెక్‌ డ్యాం నిర్మించడంతో చాలాదూరం వరకు నీళ్లు నిలిచాయి.ఇంతకు ముందు వర్షం వచ్చినప్పుడు మాత్రమే వాగులో నీరు ఉండేది. తరువాత ఎండిపోయేది. ఇప్పుడు వాగులో నీరు నిలిచి భూగర్భజలాలు పెరిగాయి. రెండు పంటలు పండించుకుంటాం. భూక్య జ్యోతి, వెంకటగిరి రైతు

 చెక్‌డ్యాంతో రైతులకు మేలు 

వట్టివాగుపై చెక్‌ డ్యాం నిర్మించడంతో రైతులకు మేలు కలుగుతుంది. నీరు నిల్వ ఉండడంతో రైతులు రెండు పంటలు పండించుకునే అవకాశం ఉంది. భూగర్భ జలాలు పెరిగి సాగు, తాగు నీటి ఇబ్బందులు ఉండవు. ఇప్పటికే గ్రామంలో సుమారు రూ.60 లక్షలతో సీసీ రోడ్లు, సైడ్‌ కాల్వలు నిర్మించాను. ప్రభుత్వం సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నా. - మాదారపు సత్యనారాయణరావు , సర్పంచ్‌ వెంకటగిరి


logo