బుధవారం 23 సెప్టెంబర్ 2020
Mahabubabad - Aug 06, 2020 , 04:08:09

ఉపాధ్యాయులు డిజిటల్‌ పాఠాలపై దృష్టి సారించాలి

ఉపాధ్యాయులు డిజిటల్‌ పాఠాలపై దృష్టి సారించాలి

మహబూబాబాద్‌  రూరల్‌  ఆగష్టు 5 : కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈవిద్యా సంవత్సరానికి విద్యార్థుల బోధనలో నష్టం జరకుండా డిజిటల్‌ బోధనపైన ఉపాధ్యాయులు దృష్టి సారించాలని జిల్లా విద్యా శాఖ అధికారి సోమ శేఖర్‌ శర్మ అన్నారు. బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్‌ వెబ్‌నార్‌ ద్వారా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా ఉపాధ్యాయులతో పాఠాలను తయారు చేసి అప్‌లోడ్‌ చేయనున్నట్లు తెలిపారు. ఈ పాఠాలను విద్యార్థులు చూసేలాగా ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకోవాలన్నారు. ప్రతి పాఠశాలలో తరగతుల వారీగా వాట్సప్‌ గ్రూప్‌ను తయారు చేసి, విద్యార్థులకు పలు అంశాలపై వచ్చే  సమస్యలను నేరుగా గానీ, వాట్సప్‌ ద్వారాగానీ నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంపొందించే బాధ్యత ఉపాధ్యాయులపైన ఉందన్నారు. వీలైతే గ్రామాల్లోని ఎస్‌ఎంసీ చైర్మన్ల, సర్పంచులతో కలిసి  విలేజ్‌ లెర్నింగ్‌ సెంటర్‌ను ఉపాధ్యాయులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పేపర్‌, పెన్సిల్‌ అనే కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థుల నైపుణ్యాలను వివిధ పద్ధతుల్లో పెంపొందించాలన్నారు. ప్రతి కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుడు తన పరిధిలోని పాఠశాలను నిరంతరం పర్యవేక్షణ చేసి విద్యా నైపుణ్యాలను పెంచాలన్నారు. విద్యార్థులకు అభ్యసనపై  నష్టం జరకుండా ఉపాధ్యాయులు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్‌ మాస్టర్లు మైస శ్రీనివాసులు, వివేకా నంద, అప్పారావు, లక్ష్మీనారాయణ, మందుల శ్రీరాములు, ముఖేశ్‌ పాల్గొన్నారు.


logo