గురువారం 01 అక్టోబర్ 2020
Mahabubabad - Aug 06, 2020 , 04:05:08

రైతువేదిక, శ్మశానవాటికల పనులు వేగవంతం చేయాలి

రైతువేదిక, శ్మశానవాటికల పనులు వేగవంతం చేయాలి

దంతాలపల్లి/మరిపెడ, ఆగస్టు5: గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న రైతువేదికలు, శ్మశానవాటికల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలో పర్యటించి రైతువేదికలు, శ్మశానవాటికలు, డంపింగ్‌ యార్డులు, నర్సరీ పనులను కేత్రస్థాయిలో పరిశీలించారు. శ్మశానవాటిక నిర్మాణ పనులను ఈనెల చివరి వరకు పూర్తిచేయాలన్నారు. రైతువేదిక స్థలాని పరిశీలించి వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పల్లెపకృతి వనంలో నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి మండలంలో కరోనా పాజిటివ్‌ కేసుల వివరాలను డాక్టర్‌ వేదకిరణ్‌ను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో ఈశ్వరయ్య, జడ్పీ వైస్‌చైర్మన్‌ నూకల వెంకటేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్‌ విజయలక్ష్మి, ఎంపీడీవో గోవిందరావు, రైతుబంధు కోఆర్డినేటర్‌ వలాద్రి మల్లారెడ్డి, సర్పంచ్‌ దర్శనాల సుష్మిత, పీఆర్‌ ఈఈ సురేశ్‌, డీఈ విద్యాసాగర్‌, ఏఈ నర్సింగ్‌నాయక్‌, రైతుబంధు జిల్లాకార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు డి.వేణు, ఎంపీటీసీ యాకన్న, మండల ప్రత్యేకాధికారి సంధ్య, వివిధ శాఖల సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిపెడ పట్టణ పకృతి వనం వెల్‌ డన్‌!

మరిపెడ పట్టణ పకృతి వనంపై కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ప్రశంసల వర్షం కురపించారు. కలెక్టర్‌ మరిపెడ మున్సిపల్‌ కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీ వద్ద గ్రీన్‌ పార్క్‌ స్థలంలో ఏర్పాటు చేసిన పట్టణ పకృతి వనాన్ని చూసి మురిసి పోయారు. ఇక్కడికే పట్టణ ప్రజలు వన భోజనాలకు వచ్చేలా ఏర్పాట్లు ఉండాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సింధూర కుమారిని, కమిషనర్‌ సత్యనారాయణరెడ్డిని ఆదేశించారు. దీంట్లో బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ పట్టణ పకృతి వనం జిల్లాకే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అంతకు ముందు మున్సిపల్‌ పరిధిలోని మియావాకిని చూశారు. మొక్కలు ఎదుగుదలను పరిశీలించారు. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ నిధుల ద్వారా జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై అడిగి తెలుసుకున్నారు. అబ్బాయిపాలెంను సందర్శించారు. రైతు వేదిక భవన నిర్మాణ పనులను చూశారు. త్వరగతిన పూర్తి చేయాలన్నారు. కలెక్టర్‌ వెంట ఎంపీపీ అరుణరాంబాబు, రెవెన్యూ, మున్సిపల్‌ సిబ్బంది, అబ్బాయిపాలెం సర్పంచ్‌ జినుక మణి ఉన్నారు.


logo