సోమవారం 25 జనవరి 2021
Mahabubabad - Jul 30, 2020 , 01:18:06

రైతు కష్టం తెలిసిన ‘నూకల’

రైతు కష్టం తెలిసిన ‘నూకల’

  • n మానుకోట ప్రాంతంలో చిన్న తరహా ప్రాజెక్ట్‌లకు నాడే బీజం!
  • n చిల్లంచర్ల అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి కాడెడ్ల గుర్తుపై ఎమ్మెల్యేగా గెలుపు
  • n మరిపెడతో రాంచంద్రారెడ్డికి విడదీయలేని బంధం  

మరిపెడ : మానుకోట ప్రాంతంలో చిన్న తరహా ప్రాజెక్టులకు నూకల రాంచంద్రారెడ్డితోనే బీజం పడింది. అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ దేశ వ్యాప్తంగా అనేక ప్రాజెక్టులకు రూప కల్పన చేస్తుండగా 1964లోనే చిల్లంచర్ల నియోజకవర్గంలోని (పూర్వపు మహబూబాబాద్‌ డివిజన్‌) ఆకేరు నదిపై ఓ భారీ ప్రాజెక్టు నిర్మించి ఈ ప్రాంత రైతులకు దీర్ఘకాలికంగా సాగునీటి ఇబ్బందుల్లేకుండా చూడాలని తలిచారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు కూడా ఇచ్చింది. ఉగ్గంపల్లి వద్ద ఈ ప్రాజెక్టు కట్టాలని నిర్ణయించగా అనేక గ్రామాలు ముంపునకు గురవుతున్న విషయాన్ని అధికారులు నూకల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాభిమానం, ఆదర్శ భావజాలం కలిగిన నేతగా ఆయనకు పల్లెల్లో మంచి గుర్తింపు ఉండేది. ఎట్టి పరిస్థితిల్లోనూ గ్రామాలు ముంపునకు గురికావద్దని భావించి ఇదే నియోజకవర్గంలోని ఆకేరు, మున్నేరు, పాలేరు నదులపై ఐదు చోట్ల చిన్న తరహా ప్రాజెక్టులు కట్టి రైతులకు సాగునీరందించాలని నూకల వ్వ్యూహ రచన చేశారు. ఆ క్రమంలోనే ఆకేరు నదిపై ఉగ్గంపల్లి, కొమ్ములవంచ వద్ద, పాలేరు నదిపై తానంచర్ల వద్ద, మున్నేరు నదిపై నడివాడ, అమ్మపాలెం వద్ద  ప్రాజెక్ట్‌లను ప్రతిపాదించి నిర్మించారు. అప్పట్లోనే ఈ ఐదు ప్రాజెక్ట్‌ల ద్వారా సుమారు 50వేల ఎకరాలకు సాగునీరందేలా ఇంజినీర్లు ప్రణాళికలు తయారు చేశారు. నూకల కృషితో గడ్డు కాలంలోనూ ఈ ప్రాంత రైతులకు సాగు నీటి ఇబ్బందులు లేకుండా పోయాయి.  


మరిపెడతో విడదీయలేని బంధం 

నూకల రాచంద్రారెడ్డికి మరిపెడతో విడదీయలేని బంధం ఉంది. మాజీ ఎంపీ, రాష్ట్ర పారిశ్రామిక వేత్త ఆర్‌ఎస్‌కు స్వయానా బావ. ఆర్‌ఎస్‌ తండ్రి దామోదర్‌రెడ్డి తన కుమార్తెను నూకల రాంచంద్రారెడ్డికి ఇచ్చి  వివాహం చేశారు. దాంతో మరిపెడ ప్రాంతానికి నూకల సుపరిచితుడయ్యారు. సొంతూరు జామండ్లపల్లి అయినా నూకల ఎక్కువ మరిపెడ ప్రాంత ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. ఇప్పటి మానుకోట, డోర్నకల్‌ అసెంబ్లీ సెగ్మెంట్లను కలిసి అప్పుడు మరిపెడ మండలం చిల్లంచర్ల అసెంబ్లీ సెగ్మెంట్‌గా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ నుంచి కాడెడ్ల గుర్తుపై నూకల రాంచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి అనతి కాలంలోనే మంత్రి అయ్యారు. వరంగల్‌ పూర్వ జిల్లాలో మరిపెడ, మహబూబాబాద్‌ను సమితులుగా ఏర్పాటు చేసి వాటికి సొంత భవనాలను ఆయన హయాంలోనే నిర్మించారు. ఇప్పటికీ అవి చెక్కు చెదరలేదు. మహబూబాబాద్‌, మరిపెడలో ప్రభుత్వ వైద్యశాలలను సైతం ఏర్పాటు చేయించారు. 

ఊరూరా ‘నూకలోళ్ల’ నిషానీ

మానుకోట ప్రాంతంలో నూకలోళ్లకు గుర్తుగా ఊరూరా ఏదో ఒక నిషానీ పెట్టుకున్నారు. నూకలోళ్ల గుట్ట, నూకలోళ్ల బావి, నూకలోళ్ల వీధి ఇలా ఇప్పటికీ ఆయా ఊళ్లల్లో కనిపిస్తాయి. చిన్నగూడూరులో సుమారు 20ఎకరాలతో నూకలోళ్ల గుట్ట ఉంది. ఇప్పుడు అక్కడ ముస్లింలు పవిత్ర రంజాన్‌ ప్రార్థనలు జరుపుకొంటున్నారు.

ఉగ్గంపల్లి ఆనకట్టతో ఎంతో మేలు


ఉగ్గంపల్లి ఆనకట్టతో రైతులకు ఎంతో మేలు కలుగుతున్నది. అప్పట్లో కరెంట్‌ లేదు. రైతులం మోట బావులపై ఆధారపడి వ్యవసాయం చేసెటోళ్లం. బావుల నిండా నీళ్లుండేవి. మండు టెండల్లో సుతం ఆకేరు ఎండేది కాదు. చేపలకు ఎన్నడూ కొదువ లేదు. ఏ తండ్రి కట్టిండో కని అది మాకు వరంలెక్క మారింది. చిన్నగూడూరు-ఉగ్గంపల్లి దగ్గర ఆకేరు నదిపై కట్టిన ఆనకట్టతో చిన్నగూడూరు, ఉగ్గంపల్లి, విస్సంపల్లి, ఉల్లేపల్లి, బీచ్‌రాజ్‌పల్లి, పీఎస్‌గూడెం రైతులకు చాలా మేలు కలిగింది. -

ఆంగోతు సేట్యా, దూమ్డాతండా, ఉగ్గంపల్లి 



logo