హ్యూస్టన్ : అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను చంపేస్తామని బెదిరించిన ఫ్లోరిడాకు చెందిన 39 ఏళ్ల నర్సును శనివారం పోలీసులు అరెస్టు చేశారు. కమలా హారిస్ గతేడాది నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో 13-18 తేదీల మధ్య కమలా హారిస్‌ను చంపుతానని, శారీరకంగా దాడి చేస్తానని ఫ్లోరిడాకు చెందిన నర్సు నివియానె పెటిట్ ఫెల్ప్స్ పలుసార్లు బెదిరింపులకు పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదవగా.. యూఎస్ సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు అనంతరం ఫెల్ప్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 2001 నుంచి జాక్సన్ హెల్త్ సిస్టమ్‌లో పని చేస్తోంది.
జైలులో ఉన్న తన భర్తకు ఫెల్ప్స్ ‘జేపే’ (ఖైదీలతో మాట్లాడేందుకు కుటుంబ సభ్యులకు అనుమతించే కంప్యూటర్ అప్లికేషన్) ద్వారా పలు వీడియోలు పంపింది. అధ్యక్షుడు జో బైడెన్, కమలా హారిస్ తదితరులపై విద్వేష వ్యాఖ్యలు చేసినట్లు సీక్రెట్ సర్వీసెస్ అధికారులు గుర్తించారు. అలాగే మరో వీడియోలో.. ‘నేను తుపాకీ శ్రేణిలోకి వెళ్లబోతున్నా. దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. నువ్వు చనిపోబోతున్నావ్. రాసిపెట్టుకో. నేటి నుంచి సరిగ్గా 50 రోజులు’ అని హెచ్చరించింది. దర్యాప్తు అధికారులు ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఓ ఫొటోలో ఫెల్ప్స్ షూటింగ్ రేంజ్లో తుపాకీ పట్టుకుని నవ్వుతూ కనిపించింది. ఫిబ్రవరిలోనే ఆమె ఆయుధ లైసెన్స్ సైతం తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి..