శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Mahabubabad - Jul 13, 2020 , 01:45:24

జాగిలానికి కన్నీటి వీడ్కోలు

జాగిలానికి కన్నీటి వీడ్కోలు

  • మానుకోటలో అనారోగ్యంతో మృతి
  • పోలీస్‌ లాంఛనాలతో అంత్యక్రియలు

మహబూబాబాద్‌ రూరల్‌: తమతో సమానంగా సేవలు అందిస్తూ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఉన్న జాగిలం(లియో) మృతితో పోలీసులు కన్నీటిపర్యంతమయ్యారు. పోలీస్‌ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటారు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్‌ జిల్లాగా ఏర్పడినప్పటి నుంచి పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో మొత్తం నాలుగు జాగిలాలతో సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. అందులో ఒకటైన లియో రెండు రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుండగా మానుకోటలోని వెటర్నిటీ హాస్పిటల్‌లో వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు జాగిలం మృతి చెందింది.

మానుకోట జిల్లాగా ఏర్పడినప్పటి నుంచి లియో ఎన్నో పోలీస్‌ బందోబస్తులకు, వీఐపీ సమావేశాలకు కల్వర్టు తనిఖీల వంటి విధులను సమర్థవంతంగా నిర్వర్తించిందని పోలీసులు గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు  పోలీస్‌మర్యాదలతో జాగిలానికి వీడ్కోలు పలకాలని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సిబ్బందిని ఆదేశించారు. దీంతో సిబ్బంది పోలీస్‌ లాంఛనాలతో కార్యాలయం పక్కనే ఉన్న ప్రదేశంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. నాలుగేళ్ల నుంచి తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఉన్న లియో మృతితో ఏఆర్‌ డీఎస్పీ రేలా జనార్దన్‌రెడ్డి, హెడ్‌ క్వార్టర్స్‌ పోలీస్‌ సిబ్బంది కంటతడి పెట్టారు. లియో ఆత్మకు శాంతి చేకూరాలని ఎస్పీ తన సంతాపాన్ని ప్రకటించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ నర్సయ్య, డాగ్‌ స్కాడ్‌ హోల్డర్‌ శ్రీకాంత్‌, సిబ్బంది మురళీకృష్ణ, రెడ్డి పాల్గొన్నారు.


logo