ఆదివారం 09 ఆగస్టు 2020
Mahabubabad - Jul 05, 2020 , 02:48:18

నలుగురిని మింగిన చెరువు

నలుగురిని మింగిన చెరువు

  • ఒకరిని కాపాడబోయి మరో ముగ్గురి మునక
  • పాణాలు తీసిన ఈత సరదా
  • కన్నీటి సంద్రమైన బోడతండా

మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ/మహబూబాబాద్‌  రూరల్‌: అయ్యో బిడ్డలారా.. ఎంతపని చేశారూ.. మేము ఎవరికోసం బతకాలి.. పొద్దున్నే ఎవరి ముఖం చూడాలి.. చుట్టాలకు ఏమని చెప్పాలి.. అంటూ ఆ తల్లిదండ్రుల రోదనలు బోడతండాను కన్నీళ్లు పెట్టించాయి. ఒకే గ్రామానికి చెందిన నలుగురు బాలురు చనిపోవడంతో ఆ తండా కన్నీటి సంద్రమైంది. బడి ఉంటే బతికేటోళ్లు బిడ్డా.. కరోనా పాడుగాను ఎంత పని చేసిందని తండావాసులు కన్నీరుమున్నీరయ్యారు. సరదాగా ఈతకు వెళ్లి విగతజీవులైన పిల్లలను చూసిన ప్రతి ఒక్కరి హృదయం చెలించిపోయింది. పిల్లల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, తండావాసుల రోదనలు ఆకాశాన్నంటాయి. ఇలాంటి కష్టం పగోడికి కూడా రావద్దంటూ తండావాసులు కంటతడి పెట్టారు. వివరాల్లోకి వెళితే..

మహబూబాబాద్‌ మండలం శనిగపురం గ్రామ పంచాయతీ పరిధిలోని బోడతండాకు చెందిన బోడ లాల్‌సింగ్‌, జ్యోతి దంపతుల ప్రథమ పుత్రుడు బోడ దినేశ్‌(12) ఆరో తరగతి చదువుతున్నాడు. బోడ హరి, నీలా దంపతుల చిన్నకుమారుడు జగన్‌(10) నాలుగో తరగతి చదువుతున్నాడు. ఇస్లావత్‌ నందు, లక్ష్మి దంపతుల ప్రథమ పుత్రుడు లోకేశ్‌(13) ఏడో తరగతి, ఇస్లావత్‌ రాకేశ్‌, మంగమ్మ దంపతుల చిన్నకుమారుడు రాకేశ్‌(9) నాలుగో తరగతి చదువుతున్నాడు. కరోనా వైరస్‌ కారణంగా పాఠశాలలు బంద్‌ ఉండడంతో ఇంటి వద్ద ఉంటున్న ఈ విద్యార్థులు శనివారం మధ్యాహ్నం వరకు క్యారంబోర్డు ఆడుకున్నారు. అనంతరం భోజనం చేశారు. తర్వాత గ్రామ కూడలిలోకి చేరి మాట్లాడుకున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బోడతండా సమీపంలో ఉన్న తుమ్మల చెరువులో ఈతకు వెళ్లారు. గతంలో ఇదే చెరువులో పెద్దవాళ్లు చేపలు పట్టడానికి, ఈత కొట్టడానికి వెళ్లినప్పుడు వారితోపాటు ఈ పిల్లలూ వెళ్లేవారు. ఈ క్రమంలో ఈ నలుగురు కలిసి చెరువు వద్దకు వెళ్లారు. దుస్తులు ఒడ్డున వేసి నలుగురు చెరువులోకి దిగారు. చెరువు చివరన ఈత కొడుతున్నారు. ఇందులో లోకేశ్‌ చెరువు లోపలికి వెళ్లాడు. అంతలోనే మునుగుతూ తేలుతూ ఉండడంతో మిగిలిన ముగ్గురు పిల్లలు అతడిని కాపాడానికి వెళ్లారు.

ఇలా ఒకరి వెనుక ఒకరు వెళ్లి నలుగురు విద్యార్థులు మునిగిపోయారు. వ్యవసాయ పనులకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన లోకేశ్‌ తల్లి లక్ష్మి బాబు ఇంటి వద్ద కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారిని వాకబు చేసింది. ఎవరూ తెలియదని చెప్పడంతో అనుమానం వచ్చిన ఆమె చెరువు వైపు వెళ్లింది. అక్కడే సమీపంలో మేకలను మేపుతున్న ఒకతడిని నా కొడుకు వచ్చాడా అని అడిగింది. చెరువు వైపు వెళ్లగా చూశానని చెప్పాడు. దీంతో వెంటనే చెరువు వద్దకు వెళ్లగా బయట దుస్తులు కనిపించాయి. కానీ, కుమారుడు కనిపించకపోవడంతో ఆమె రోదించింది. దీంతో తండావాసులు పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు చేరుకున్నారు. ఇందులో ఈత వచ్చిన వారు చెరువులోకి వెళ్లి నలుగురు బాలుర మృతదేహాలను బయటకు తీశారు. దీంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఒకే తండాకు చెందిన నలుగురు విద్యార్థులు మృతి చెందడంతో కంటతడి పెట్టారు. బడి ఉంటే బతికెటోళ్లు బిడ్డలారా.. అంటూ తండావాసులు రోదించిన తీరు కలచివేసింది. ఇందులో ఇస్లావత్‌ లోకేశ్‌, ఇస్లావత్‌ రాకేశ్‌ సొంత అన్నదమ్ముల కుమారులు.

పెద్దలు లేనప్పుడు వెళ్లి..

నిత్యం ఆ చెరువు వద్దకు కొంతమంది పెద్దవాళ్లు చేపలు పట్టడానికి, మరికొంతమంది ఈత కొట్టడానికి వెళ్లేవాళ్లు. అప్పుడప్పుడు పెద్దవాళ్లతో ఈ నలుగురు పిల్లలు వెళ్లేవారు. శనివారం ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో ఈ నలుగురు కలిసి చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ కూడా పెద్దవారెవ్వరూ లేకపోవడంతో పిల్లలు సరదాగా ఈత కొడుదామని ఒడ్డున దుస్తులు వేసి చెరువులోకి దిగారు. ఒకరు మునిగిపోతుండగా అతడిని కాపాడడానికి చేసిన ప్రయత్నంలో మిగతా ముగ్గురు మునిగిపోయారు. ఈత వచ్చినా బిడ్డలు బతికెటోళ్లు.. బడి ఉన్నా బతికేటోళ్లు.. అంటూ తండావాసులు కన్నీటిపర్యంతమయ్యారు. పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబాబాద్‌ రూరల్‌ సీఐ వెంటకరత్నం తెలిపారు.


logo