మంగళవారం 11 ఆగస్టు 2020
Mahabubabad - Jul 02, 2020 , 01:27:02

డాక్టర్ల సేవలు ప్రశంసనీయం

డాక్టర్ల సేవలు ప్రశంసనీయం

వైద్యుల దినోత్సవంలో కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్య

పోచమ్మమైదాన్‌, జూలై 01 : కరోనా నేపథ్యంలో వైద్యులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్య, పలువురు వైద్యులు అన్నారు. వరంగల్‌ ఐఎంఏ హాల్‌లో బుధవారం రాత్రి నేషనల్‌ డాక్టర్స్‌ డే నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ డాక్టర్లు పేదలకు అంకితభావంతో సేవలందిస్తూ, వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తున్నారని అన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో ప్రాణాలను లెక్కచేయకుండా సేవలందించారని కొనియాడారు. ఆన్‌లైన్‌లో మాట్లాడిన వారిలో డాక్టర్లు కస్తూరి ప్రమీల, రాజ్‌సిద్ధార్థ, జ్యోతీంద్రనాథ్‌, జనార్దన్‌, సతీశ్‌, సంధ్యారాణి, సత్యనారాయణ ఉన్నారు. అలాగే, ఐఎంఏ హాల్‌లో జరిగిన  ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ కొత్తగట్టు శ్రీనివాస్‌, సెక్రటరీ డాక్టర్‌ బైరి లక్ష్మీనారాయణ, డాక్టర్‌ పీ విజయ్‌చందర్‌రెడ్డి, డాక్టర్‌ అశోక్‌రెడ్డి పాల్గొని పేద ప్రజలకు అంకితభావంతో వైద్యసేవలు అందిస్తామని, ప్రజలకు సకాలంలో జాగ్రత్తలు, సలహాలు అందజేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ వైద్యసేవలందించిన ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ లలితాదేవి, డాక్టర్‌ కృష్ణారావు, డాక్టర్‌ చంద్రశేఖర్‌, డాక్టర్‌ శ్రీరాంరెడ్డి, డాక్టర్‌ బచ్చు రాధాకృష్ణ, డాక్టర్‌ జ్యోతి, డాక్టర్‌ శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు.

 లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో..

కొవిడ్‌ -19 సందర్భంగా పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించిన వైద్యులకు వినూత్న లయన్స్‌ క్లబ్‌ బాధ్యులు బుధవారం సన్మానించారు. వరంగల్‌ ములుగు రోడ్డు సమీపంలో జరిగిన సమావేశంలో డాక్టర్‌ కంటెం లక్ష్మీనారాయణ, డాక్టర్‌ కే మమతను సత్కరించారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షురాలు శోభారాణి, సెక్రటరీ ఎం చంద్రశేఖర్‌, ట్రెజరర్‌ జయ, చార్టర్‌ ప్రెసిడెంట్‌ బీ సులోచన, సభ్యులు పాల్గొన్నారు.

హన్మకొండ రెడ్‌క్రాస్‌ సొసైటీలో..

హన్మకొండ : హన్మకొండ సుబేదారిలోని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ ఆవరణలో  బుధవారం డాక్టర్స్‌ డే నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బిదాన్‌చంద్రరాయ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ డాక్టర్‌ పీ విజయ్‌చందర్‌రెడ్డి మాట్లాడుతూ డాక్టర్‌ బిదాన్‌చంద్రరాయ్‌ స్మారకార్థం ప్రతి సంవత్సరం జూలై ఒకటిన వైద్యుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నర్సింగ్‌ శిక్షణ కోసం మహిళలకు ఆయన ఒక సంస్థను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. విద్య, వైద్య రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు 1944లో గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేశారని తెలిపారు. దేవుడు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మను ఇస్తారని అన్నారు. అనంతరం సొసైటీ చైర్మన్‌ విజయ్‌చందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ కే సుధాకర్‌రెడ్డి, సభ్యురాలు టీ విజయలక్ష్మి, మెడికల్‌ ఆఫీసర్లు కే రాంకిషన్‌, పీ భూపేష్‌చందర్‌ను రెడ్‌క్రాస్‌ పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ ట్రెజరర్‌ ఎం నాగయ్య, రాష్ట్ర ఎంసీ మెంబర్‌ ఈవీ శ్రీనివాస్‌రావు, జిల్లా సభ్యులు పొట్లపల్లి శ్రీనివాసరావు, చెన్నమనేని జయశ్రీ, శాశ్వత సభ్యులు రావుల ధనుంజయ, కొత్తపల్లి శ్రీనివాస్‌, చిన్న తదితరులు పాల్గొన్నారు.


logo