ఆదివారం 05 జూలై 2020
Mahabubabad - Jul 01, 2020 , 03:02:32

పల్లెపల్లెనా ప్రకృతి వనం

పల్లెపల్లెనా ప్రకృతి వనం

జిల్లాను చుట్టేస్తున్న యంత్రాంగం

ఊరూరా గ్రీన్‌ పార్కులు, చిట్టడవుల ఏర్పాటుకుకసరత్తు

461 గ్రామాలు, 4 మున్సిపాలిటీల్లో  స్థలాల పరిశీలన

మరిపెడ, జూన్‌ 30 : మహబూబాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న 461జీపీలు, 4 మున్సిపాలిటీల్లో పల్లె పకృతి, పట్టణ చిట్టడవుల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. పక్కా ప్లానింగ్‌తో అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకోసం సోమవారం నుంచే స్థలాల పరిశీలనను ప్రారంభించారు. ఆరో విడుత హరితహారాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ సూచించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో మొక్కలకు నీరందించేందుకు సిబ్బంది ఇబ్బంది పడేవారు. కానీ, ప్రభుత్వం ఇటీవల ప్రతి జీపీకి ట్రాక్టర్‌ సమకూర్చడంతో ఈసారి మొక్క ల సంరక్షణ సులువు కానుంది. హరితహారాన్ని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ కురవి మండల పర్యటన సందర్భంగా అధికారులను హెచ్చరించారు. 

పల్లెల్లో  గ్రీన్‌ పార్కులు, ప్రకృతి వనాలు

పల్లెల్లో గ్రీన్‌ పార్కులు, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ఆయా మండలాల ప్రత్యేక అధికారులు ప్రత్యేక కార్యాచరణతో వెళ్తున్నారు.  గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలతో పాటు రోడ్ల వెంట, కాల్వలు, చెరువు కట్టలపై మొక్కలను పెంచనున్నారు. ఈసారి పండ్ల మొక్కలతో పాటు రైతుకు ఆదాయం తెచ్చే టేకు, మామిడి మొక్కలనూ ఉచితంగా అందిస్తున్నారు. కోతుల అకలి తీర్చడానికి సీమతంగేడు, అల్లనేరడి మొక్కలను నాటనున్నారు. అదే విధంగా దోమల నివారణకు కృష్ణ తులసి తదితర మొక్కలను నాటేలా కార్యచరణ రూపొందించారు. 

పట్టణాల్లో  చిట్టడవులకు ప్లాన్‌

మహబూబాబాద్‌, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్‌ మున్సిపాలిటీల్లో పట్టణ చిట్టడవుల కోసం స్థలాలను గుర్తించారు. అ స్థలాల్లో మొక్కలను నాటనున్నారు. ఇప్పటికే పట్టణాల్లో గ్రీన్‌ పార్కుల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని అధికారులు కోరుతున్నారు. 


logo