సోమవారం 25 మే 2020
Mahabubabad - May 23, 2020 , 03:26:03

రైతు సంక్షేమమే ధ్యేయం

రైతు సంక్షేమమే ధ్యేయం

 వెయ్యి ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తాం

 ప్రతి మండల కేంద్రంలో గోదాం ఏర్పాటు 

విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

హన్వాడ-మహబూబ్‌నగర్‌ మధ్యలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సానుకూలంగా ఉన్నారని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ వెంకట్రావుతో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంతోపాటు అన్ని మండల కేంద్రాల్లో 10 నుంచి 20 ఎకరాల్లో గోదాంలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులు పండించిన పంటలను గోదాముల్లో నిల్వ చేసుకొని ధర ఉన్నప్పుడు విక్రయించుకోవచ్చని అన్నారు. నూతన వ్యవసాయ విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం నిర్ణయం మంచిదన్న విషయం ప్రతి గుండెకు తెలుసని ఆయనన్నారు. వ్యవసాయ, సాగునీటి రంగానికి పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వంపై రాజకీయ లబ్ధి కోసం కొందరు ఆరోపణలు చేయడం సరికాద న్నారు. అనంతరం కోటకదిర సింగిల్‌విండో కార్యాలయంలో ఎరువుల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా  రైతులకు ఎరువులను పంపిణీ చేశారు. 

 - మహబూబ్‌నగర్‌

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌-హన్వాడ మధ్యలో 1000 ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో కలెక్టర్‌ వెంకట్రావుతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాగు చేసిన పంటలను ఆధునీకరించి మార్కెటింగ్‌ చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులు పండించిన పంటలను నిల్వ ఉంచేందుకు ప్రతి నియోజకవర్గంతోపాటు ప్రతి మండలంలో 10 నుంచి 20 ఎకరాల్లో గోదాంలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇక్కడ పంటను నిల్వ ఉంచడం వల్ల మద్దతు ధర వచ్చిన సమయంలోనే విక్రయించే వీలు ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ విధానానికి శ్రీకారం చుట్టడంతో మరో ఆరు నెలల్లో ఫలితాలు ఎలా ఉంటాయో మీరే చూస్తారన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం మంచిదని ప్రతి గుండెకు తెలుసని ఆయనన్నారు. ఏ సమయంలో ఎలాంటి పంటలు వేస్తే మంచి దిగుబడి వస్తుందో రైతులకు వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారని ఆయనన్నారు. రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని, కానీ కొందరు రాజకీయ లబ్ధికోసం లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఈనెల 26న మహబూబ్‌నగర్‌లో, 27న నారాయణపేట జిల్లాలో నూతన వ్యవసాయ విధానంపై రైతు సమన్వయ సమితి సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయించినా.. వా రికి ఎవరైనా సహకరించినా పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని మంత్రి హెచ్చరించారు. జిన్నింగ్‌ మిల్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అనంతరం కోటకదిర పీఏసీసీఎస్‌లో రైతులకు ఎరువులను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు సీతారామారావు, మోహన్‌లాల్‌, ఆర్డీవో శ్రీనివాసులు పాల్గొన్నారు. 


logo