శనివారం 06 జూన్ 2020
Mahabubabad - May 21, 2020 , 00:21:54

వర్షాకాల ప్రణాళిక గ్రామాలకు సురక్ష

వర్షాకాల ప్రణాళిక గ్రామాలకు సురక్ష

 •  పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
 •  సీజనల్‌ వ్యాధులు రాకుండా చర్యలు
 •  వారంలో ఒక్క రోజు డ్రై డే 
 •  కసరత్తు ప్రారంభించిన పంచాయతీ అధికారులు

హన్మకొండ : కొవిడ్‌-19 నివారణ, వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేయనున్నారు. వ్యాధుల భరతం పట్టేందుకు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. మురుగుకాల్వలు శుభ్రం చేయడం, మురుగునీరు నిల్వ ఉండకుండా, దోమల నివారణ, తాగునీటి క్లోరినేషన్‌, వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్‌ అధికా రులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనులు నిర్వహణపై మండల స్థాయి అధికారులు జీపీలకు సర్క్యులర్‌ జారీ చేశారు.

అంటువ్యాధులు రాకుండా..

కొవిడ్‌-19తో పాటు వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్య పనులు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి సూచించారు. అవసరమైన బ్లీచింగ్‌ పౌడర్‌, సున్నం, లిక్విడ్‌ క్లోరిన్‌, సోడియం హైపోక్లోరైట్‌, బైటెక్స్‌, ఇతర ద్రావకాలు కొనుగోలు చేసేలా మండల పంచాయతీ అధికారులు అన్ని గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. 

గ్రామాల్లో పనులు ఇలా..

 •  గ్రామాల్లో మురుగుకాల్వలు తీసి, సిల్ట్‌ను తరలించాలి. మురుగునీరు వెళ్లేలా చూడాలి. వర్షపు నీరు రోడ్లు, పల్లపు ప్రాంతాల్లో నిల్వ లేకుండా చెరువులు, కుంటల్లోకి పంపించాలి. 
 •  రోడ్లపై గుంతలను పూడ్చేయాలి. పల్లపు ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు తవ్వించాలి. గ్రామ పరిసరాల్లో బోర్లను రీచార్జ్‌ చేయాలి. 
 •  మురుగునీరు నిలిచి దోమలు వృద్ధి చెందకుండా చూడాలి. మురుగునీటిలో ఆయిల్‌ బాల్స్‌, బైటెక్స్‌, రసాయనాలు చల్లాలి. కృష్ణ తులసి, పుదీన, సిట్రోనెల్లా గ్రాస్‌, లెమన్‌ గ్రాస్‌ పెంచుకునేలా చూడాలి. వారంలో ఒక రోజు డ్రైడేగా పాటించాలి. ఆ రోజు జీపీ సిబ్బంది ఇంటింటికీ తిరిగి ప్రయోజనాలను వివరించాలి. 
 • ఇంటిలో తొట్లు, కుండీలు, పగిలిన కుండలు, పాత టైర్లు, ప్లాస్టిక్‌ బాటిళ్లు, ఖాళీ కొబ్బరి బోండాలు, ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలి. 
 •  తాగు నీటిని అందించే ట్యాంకులను శుభ్రం చేయాలి. అందులో బ్లీచింగ్‌ పౌడర్‌తో క్లోరినేషన్‌ చేయాలి. తాగునీరు సరఫరా చేసే పైప్‌లైన్ల లీకేజీలు గుర్తించాలి. 15రోజులకోసారి ఓహెచ్‌ఆర్‌ను శు భ్రం చేయాలి. నల్లా నీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలి.
 •  తడి, పొడి చెత్తను వేరు చేసేలాఅవగాహన కల్పించాలి. చెత్తను వేర్వేరుగా సేకరించి, డంపింగ్‌ యార్డులకు తరలించాలి. 
 •  నివాస ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాల్లో పిచ్చి చెట్లు, పొదలు పెరుగకుండా చర్యలు తీసుకోవాలి. 
 •  జన సమూహం ఉండే చోట వారంలో రెండు రోజులు సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేయించాలి. 
 •  వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి. 

వ్యాధుల నివారణకు చర్యలు

కొవిడ్‌-19, వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు పరిశుభ్రంగా మారాయి. పారిశుధ్యం విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వారంలో ఒక రోజు డ్రైడేగా పాటించేలా చూడాలి. సీజనల్‌ వ్యాధులు రాకుండా ముందుగా ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. దీనికి సంబంధించి ఇప్పటికే మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు సర్క్యులర్‌ జారీ చేశాం.  

-మహుముది, జిల్లా పంచాయతీ అధికారి logo