శనివారం 06 జూన్ 2020
Mahabubabad - May 21, 2020 , 00:21:54

ఎండ ప్రచండం

ఎండ ప్రచండం

 • నిప్పులు కురిపిస్తున్న సూర్యుడు
 • 40 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు
 • వడగాలులు, ఉక్కపోతతో అల్లాడుతున్న జనం
 • 8 గంటల నుంచే భానుడి భగభగలు

జనగామ/నయీంనగర్‌ : భానుడు  నిప్పులు కురిపిస్తున్నాడు. మండే ఎండలకు వేడి గాలులు తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈనెల చివరి వారంలో రోహిణికార్తె ప్రవేశం చేయనుండడంతో ఉష్ణోగ్రతలు మరింత  పెరిగి నిప్పుల కుంపటిని తలపించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఎండలు అధికంగా ఉండటం ద్వారా చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది.

మార్చి నుంచే మంట..                                         

ఈ ఏడాది మార్చి రెండో వారం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నా.. లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లకు పరిమితం కావడంతో వారు పెద్దగా ఇబ్బంది పడలేదు. కానీ, సోమవారం నుంచి లాక్‌డౌన్‌లో సడలింపు ఇచ్చినా ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్నారు. రోజు రోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఇళ్లలోనే ఉంటున్నారు. దీంతో రోడ్లపై కర్ఫ్యూ వాతావ రణం  కనిపిస్తున్నది. ప్రజలు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు పండ్ల రసాలు, ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏసీలు, కూలర్లకు విపరీతంగా గిరాకీ పెరిగింది.  

మండుతున్న నల్లనేల

భూపాలపల్లి : పారిశ్రామిక, సింగరేణి ప్రాంతమైన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చిరు వ్యాపారులు, ఉపాధి హామీ, తునికాకు, వ్యవసాయ కూలీలు ప్రధానంగా ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కేటీకే ఓసీపీ-2 ప్రాజెక్టులో విధులు నిర్వహించే సింగరేణి పర్మినెంట్‌, కాంట్రాక్టు కార్మికులు ఎండ వేడిమికి తట్టుకోలేకపోతున్నారు. సింగరేణి సంస్థ కూడా వేసవి ఉపశమన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓసీపీలో పని చేసే కార్మికులకు బుధవారం నుంచి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నది. 

మానుకోటలో..43 డిగ్రీలు

మహబూబాబాద్‌ టౌన్‌ : మహబూబాబాద్‌ పట్టణం లో బుధవారం అత్యధికంగా 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేడి నుంచి ఉపశమనానికి జనం నిమ్మరసాలు, కొబ్బరిబోండాలు, శీతలపానీయాలు తాగుతున్నారు.  

వడదెబ్బ తగలకుండా..

 •  ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలు నడిపే సమయంలో తలకు, ముక్కు, చెవులకు వేడి గాలి తగలకుండా నిండుగా స్కార్ఫ్‌, కర్చీఫ్‌ కట్టుకోవాలి. కళ్లకు చలువ కళ్లద్దాలు పెట్టుకోవాలి.  రైతులు సాధ్యమైనంత మేర ఉదయం పూటనే పొలం పనులకు వెళ్తే మంచిది.  
 •  వేసవిలో అతిసారం,  డీ హైడ్రేషన్‌, కామెర్లు, చర్మవ్యాధులు, జలు బు, దగ్గు, వైరల్‌ జ్వరాలు, చికెన్‌ఫాక్స్‌ తదతర వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
 •  సాధారణంగా రోజుకు నాలుగు లీటర్ల నీటిని తాగాలి. కానీ, వేసవిలో ఆరు నుంచి ఏడు లీటర్ల నీరు తాగాలి.  
 •  చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు ఎండలో తిరగకుండా చూసుకోవాలి. ద్రవ పదార్థాలు, పోషకాహారం తీసుకోవాలి.
 •  ఉపాధి తదితర పనులకెళ్లే కూలీలు అవకామున్నంత వరకు నీడ ప్రదేశంలో పని చేస్తే మంచిది. ఎండలో పనిచేయాల్సి వస్తే తరచూ నీడలోకి వచ్చి సేద తీరాలి.
 •  వేసవిలో దుస్తుల ఎంపిక ఎంతో కీలకం.  ముదురు రంగు, నల్లని వస్త్రాలు ధరిస్తే ఎండతీవ్రత నేరుగా శరీరానికి తగులుతుంది. ఎండ నుంచి రక్షణ కోసం తెల్లని దుస్తులు ఎంపిక చేసుకోవాలి.  
 •  వేసవిలో కచ్చితంగా మిత ఆహారమే తీసుకోవాలి. వీలైనంత వరకు నూనె వస్తువులు తగ్గించాలి. వేపుళ్ళ జోలికి వెళ్లకూడదు. రాత్రి పడుకునే ముందు పాలు తాగాలి.


logo