శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Mahabubabad - May 11, 2020 , 02:27:41

పేకాటరాయుళ్లపైకొరడా..

పేకాటరాయుళ్లపైకొరడా..

  • లాక్‌డౌన్‌ సమయంలో జోరుగా శిబిరాలు
  • రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని కేసులు నమోదు

వరంగల్‌ క్రైం: లాక్‌డౌన్‌ సమయంలో పేకాటరాయుళ్లపై పోలీసులు కొరడా ఝళిపించారు. వరంగల్‌ అర్బన్‌ పరిధిలో పేకాట స్థావరాలపై దాడులు జరిపి ఇప్పటి వరకు సుమారు రూ. 5 లక్షలపైగా నగదును సీజ్‌ చేశారు. 60 కేసులు నమోదు చేసి, 300కు పైగా వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసుల రికార్డులు పేర్కొంటున్నాయి. వాహనాలు, సెల్‌ఫోన్లను సైతం సీజ్‌ చేశారు. కాజీపేట పరిధిలో రూ. 1,38,538 నగదును సీజ్‌ చేసి 16 కేసులు నమోదు చేసి 107 మందిని అరెస్ట్‌ చేశారు. హన్మకొండ పరిధిలో రూ. 1,39,590 నగదును సీజ్‌ చేసి, 14 కేసులు నమోదు చేసి 73 మందిని అరెస్ట్‌ చేశారు. వరంగల్‌ పరిధిలో రూ. 1,25,580 నగదును సీజ్‌ చేసి, 67 మందిని అరెస్ట్‌ చేశారు. అలాగే, మామునూరు పరిధిలో రూ. 1,05,900 నగదును సీజ్‌ చేసి తొమ్మిది కేసులు నమోదు చేసి 59 మందిని అరెస్ట్‌ చేశారు.

రూరల్‌ జిల్లాల పరిధిలో..

పరకాల/నర్సంపేట: లాక్‌డౌన్‌ సమయంలో పరకాల సబ్‌ డివిజన్‌ పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో 84 మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. 20 బైక్‌లను సీజ్‌ చేయడంతోపాటు రూ. 59 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పరకాల ఏసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. అలాగే, నర్సంపేట డివిజన్‌లోని ఆరు మండలాల్లో మొత్తం 62 మందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 37780 నగదు, 15 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

జనగామ జిల్లాలో..

జనగామ, నమస్తే తెలంగాణ:  నెల రోజుల వ్యవధిలో  జిల్లావ్యాప్తంగా 185 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్‌ చేశారు. 25 కేసులు నమోదు చేశారు. వీరి నుంచి రూ. 1,71,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్‌ పశ్చిమ జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

జయశంకర్‌ జిల్లాలో..

భూపాలపల్లి : శనివారం వరకు జిల్లాలో వేర్వేరు చోట్ల దాడులు నిర్వహించి 19 కేసులు నమోదు చేసి 122 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.54,630 నగదు, ఎనిమిది సెల్‌ఫోన్లు, ఐదు ద్వి చక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్‌ ఎస్పీ వీ శ్రీనివాసులు తెలిపారు. 

మానుకోట జిల్లాలో..

మహబూబాబాద్‌: జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పేకాటరాయుళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. పెట్రోలింగ్‌ వాహనాల్లో తిరుగుతూ పేకాట స్థావరా లపై దాడులు నిర్వహిస్తూ వారి వద్ద ఉన్న సొత్తును స్వాధీనం చేసుకుని, 194 మందిపై కేసులు నమోదు చేశారు. 25 మందిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ. 1,17,651 స్వాధీనం చేసుకుని 17 ద్విచక్రవాహనాలను సీజ్‌ చేశారు. 

ములుగు జిల్లాలో..

ములుగు, నమస్తే తెలంగాణ: జిల్లావ్యాప్తంగా పోలీసులు పేకాడుతున్న 43 మంది పట్టుకుని కేసులు నమోదు చేశారు. రూ. 71,780 నగదును స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను సీజ్‌ చేశారు.


logo