గురువారం 04 జూన్ 2020
Mahabubabad - Mar 10, 2020 , 03:22:21

మిగిలింది 17 రోజులే..!

మిగిలింది 17 రోజులే..!

మహబూబాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:బీఎస్‌(భారత్‌ స్టేజ్‌)-4 వాహనాలను కొనుగోలు చేసిన వాహనదారులు హడలెత్తిపోతున్నారు. వీటి రిజిస్ట్రేషన్‌ ఈనెల 31వరకు ఉండడమే ప్రధాన కారణం. ఇప్పటికే బీఎస్‌-4 తయారీ బంద్‌ కావడంతో పాటు ఇప్పటికే షోరూముల్లో ఉన్న వాహనాలను త్వరితగతిన విక్రయిస్తున్నారు. అంతే కాకుండా విక్రయించిన ప్రతి వాహనాన్ని ఈనెల 31లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని షోరూమ్‌ నిర్వాహకులు వాహనదారులకు సూచిస్తున్నారు. లేదంటే ఇక అట్టి వాహనం తుక్కు కిందే లెక్క అన్న మాట. ఏప్రిల్‌ 1నుంచి బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్‌ను శాశ్వతంగా నిలిపివేయనున్నారు. బీఎస్‌-4 వాహనాల ద్వారా శబ్దంతో పాటు పొల్యూషన్‌ ఎక్కువగా ఉందన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వీటి తయారీని ఆయా కంపెనీలు నిలిపివేశాయి. వీటిస్థానంలో బీఎస్‌-6 వాహనాలు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి. వీటి అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ వాహనాల వల్ల శబ్దంతో పాటు పొల్యూషన్‌ కూడా బాగా తగ్గింది. షోరూంల నిర్వాహకులు ఇప్పటికే బీఎస్‌-4 వాహనాలను శరవేగంగా అమ్మకాలు జరుపుతున్నారు. ఇప్పటికే దాదాపుగా బీఎస్‌-4 వాహనాలు ఖాళీ అవుతున్నప్పటికీ అక్కడక్కడ ఉన్న షోరూంల్లో కొన్ని వాహనాలు ఉన్నాయి. వీటిని కూడా త్వరగా విక్రయించాలని షో రూం నిర్వాహకులు తమ సిబ్బందికి ఆదేశించారు. జిల్లాలో మహబూబాబాద్‌, కేసముద్రం, మరిపెడ, తొర్రూరు, డోర్నకల్‌, బయ్యారం, గార్ల, గూడూరు, కొత్తగూడ, దంతాలపల్లి మండలాల్లో మొత్తం కలిపి 30 షోరూములున్నాయి. వీటిల్లో నిత్యం వందలాది వాహనాలను విక్రయిస్తున్నారు. వీటి పరిధిలో బీఎస్‌-4 విక్రయించిన మొత్తం వాహనాల్లో ఇంకా 2,856 వాహనాలకు రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదని ఆర్టీఏ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ వాహనాలన్నింటినీ ఈనెల 31లోపు రిజిస్ట్రేషన్‌ చేయాలి. ఈ నెలలో 14న రెండో శనివారం, 15, 22, 29 ఆదివారాలు కాగా, 25న ఉగాది పండుగ సెలవులు ఉన్నాయి. దీంతో వాహనాదారులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి మిగిలింది 17 రోజులు మాత్రమే. సగటున రోజుకు 168 వాహనాలను రవాణా శాఖ అధికారులు రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా బీఎస్‌-4 కలిగిన టూ వీలర్‌, త్రీ వీలర్‌, ఫోర్‌ వీలర్‌ వాహనాలను అధికారులు రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. 

ఈ నెల 31 వరకు గడువు

కొత్తగా కొనుగోలు చేసిన బీఎస్‌-4 వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఈనెల 31తో ముగియనుంది. గడువులోగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోకుంటే ఇక అంతే సంగతులు. ఆ వాహనాలు తుక్కుకిందనే లెక్కగా అధికారులు పరిగణించనున్నారు. వాటికి రవాణాశాఖ అధికారులు జీవితంలో రిజిస్ట్రేషన్‌ చేయరు. కొత్తగా వాహనం కొని రిజిస్ట్రేషన్‌ చేయించుకోని వారు వెంటనే రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని షో రూం నిర్వాహకులు, అధికారులు సూచిస్తున్నారు. ఏప్రిల్‌1 నుంచి బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేస్తున్నట్లు జిల్లా రవాణాశాఖ అధికారి భద్రునాయక్‌ తెలిపారు. అదే విధంగా షోరూం నిర్వాహకులు సైతం వాహనదారులకు సమాచారం అందిస్తున్నారు. ఈ నెల 31లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని వాహనదారులకు ఫోన్‌ ద్వారా సందేశం అందిస్తున్నారు. ఫోన్లకు స్పందించని వాహనదారుల ఇంటికి స్పీడ్‌ పోస్టు ద్వారా సమాచారం అందిస్తున్నారు. బీఎస్‌-4 వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేయడానికి ఇంకా 17 రోజులే మిగిలి ఉండడంతో వాహనదారులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ఆరాటపడుతున్నారు. 

రవాణాశాఖలో పని వేళలు పెంపు

వాహనాల రిజిస్ట్రేషన్‌ కోసం రవాణాశాఖలో పనివేళలను సైతం అధికారులు పెంచారు. గతంలో ఉదయం 10:30గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కౌంటర్లు పని చేసేవి. బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్‌ ఈనెల 31తో ముగుస్తున్నందున వాహనదారుల సౌకర్యార్థ్ధం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5గంటల వరకు కౌంటర్ల సమయం పెంచారు. దీంతో వాహనాదారులకు వెసులుబాటు కల్పించినట్లయింది. కౌంటర్ల సమయం పొడిగించడం వల్ల రోజుకు వందకుపైగా వాహనాల రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. 17రోజుల పనిదినాల్లో జిల్లాలో ఉన్న వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేసేందుకు రవాణాశాఖ అధికారులు ఎంతో కృషి చేస్తున్నారు. వాహనదారులు కౌంటర్‌లో ఫీజు చెల్లించిన తర్వాత వాహనదారులు ఫొటో దిగి, సంతకం చేయాల్సి ఉంటుంది. అనంతరం వాహనాన్ని మోటారు వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీ చేసి ఓకే చేస్తారు. 

వాహనదారులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందిస్తున్నాం

బత్తిని కిశోర్‌ కుమార్‌ గౌడ్‌, హోండా షోరూం మేనేజర్‌

షోరూములో బీఎస్‌-4 వాహనాలను కొనుగోలు చేసి, ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్‌ చేయించుకోని వారికి మేము ఫోన్‌ చేసి సమాచారం అందిస్తున్నాం. ఈనెల 31లోపు వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కోరుతున్నాం. షోరూం బయట, లోపల బ్యానర్లు ఏర్పాటు చేశాం. ఫోన్‌ తీయని వాహనదారులకు మా వద్ద ఉన్న చిరునామా ప్రకారం స్పీడ్‌పోస్టు ద్వారా సమాచారం అందిస్తున్నాం. ఫేస్‌బుక్‌, వాట్సప్‌ ద్వారా వాహనదారులకు సమాచారం చేరవేస్తున్నాం. ఇప్పటికీ వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేయని వారికి రోజు ఫోన్లు చేస్తున్నాం. 

31లోపు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి.. భద్రునాయక్‌, జిల్లా రవాణా శాఖ అధికారి

బీఎస్‌-4 వాహనాలన్నింటికీ ఈనె ల 31లోపు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. ఏప్రిల్‌ 1నుంచి బీఎస్‌-4 వా హనాల రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిలిపివేస్తున్నాం. రిజిస్ట్రేషన్‌కు స్లాట్‌ పరిమితి సంఖ్యను ఎత్తివేశాం. రోజుకు ఎన్నయి నా బుక్‌ చేసుకోవచ్చు. కార్యాలయం కౌంటర్లను పెంచాం. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5గంటల వరకు మా సిబ్బంది పని చేస్తున్నారు. వాహనదారులు గమనించి సకాలంలో వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. కార్యాలయ పని వేళల్లో వచ్చి రవాణాశాఖ సిబ్బందికి సహకరించాలి. 


logo