సకల కళా వల్లభుడు కమల్ హాసన్ ప్రత్యేక టాలెంట్ గురించి చెప్పనక్కర్లేదు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సత్తా చాటారు. ఇప్పుడు ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ దూసుకుపోతుంది. నటిగానే కాకుండా మల్టీ టాలెంట్‌తో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది.
శృతి హాసన్ నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన కథానాయికగా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ప్రభాస్ సరసన సలార్ అనే చిత్రంలో నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ పోషిస్తుంది శృతి. ఇక తమిళం, హిందీ భాషలలోను పలు ప్రాజెక్టులు చేస్తున్న శృతి త్వరలో మెగా ఫోన్ పట్టనున్నట్టు తెలుస్తుంది. కొన్నాళ్లుగా స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇది పూర్తి కాగానే దర్శకురాలిగా తొలి చిత్రాన్ని తెరకెక్కిస్తుందని అంటున్నారు.