శుక్రవారం 05 జూన్ 2020
Mahabubabad - Feb 22, 2020 , 03:14:42

వీరన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు

వీరన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు

కురవి, ఫిబ్రవరి 21: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి సన్నిధి శివనామస్మరణతో మార్మోగింది. పరమశివుడి మానసపుత్రుడైన వీరభద్రస్వామిని భక్తులు మనసారా కొలిచారు. రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాల నుంచి ఆలయానికి వచ్చిన భక్తులతో ఆలయం పోటెత్తింది. మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ పలు పర్యాయాలు ఉన్నతాధికారులతో చేసిన సమీక్షల ఫలితంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సాఫీగా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సూచనల మేరకు ట్రైనీ ఐపీఎస్‌ యోగేశ్‌ గౌతమ్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సాధారణ, ప్రత్యేక దర్శనం, అభిషేకాల దర్శణాలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అలాగే వీవీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో సాధారణ భక్తులకు ఇబ్బందులు కలుగలేదు. ఈ సంవత్సరం ఆలయంలోపల నుంచే స్వయంభూ భద్రకాళీ అమ్మవారి ఆలయానికి భక్తులు వెళ్లేలా క్యూలైన్లు ఏర్పాటు చేయడం గమనార్హం. ఆలయం మొత్తం చలువపందిర్లు వేయిం చారు. సత్యసాయి సేవాసమితి మహబూబాబాద్‌ జిల్లా ఆధ్వర్యంలో భక్తులకు నిరంతరంగా తాగునీటిని అంద జేశారు.


ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ పర్యవేక్షించారు. ఎటుచూసినా పంచాక్షరీ నామజపం.. ఓం..నమశ్శివాయ మంత్రంతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. శివసత్తుల పూనకాలు, అమ్మవారికి బోనాలతో వచ్చిన భక్తులతో కళకళలాడింది. వీరన్న సన్నిధిలో సంతానం లేని మహిళలు తలంటూ స్నానం చేసి ధ్వజస్తంభం వద్ద పానసరాలు పట్టారు. జాతరలో రకరకాల దుకాణాలు వెలిశాయి. గ్రామపంచాయతీ సిబ్బంది దుకాణాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లుచేయడంతో ఆకర్షించేలా కనిపించాయి. వీటికి తోడు రహదారులు వెడల్పుగా చేయడంతో రాకపోకలు సులువ య్యాయి. జాతకాలు చెప్పే కోయలు...పచ్చబోట్లు వేసే వారు జాతరలో ప్రత్యేక దుకాణాలను ఏర్పాటుచేశారు. 


గ్రామసేవకు బైలెల్లిన బలిహరణ స్వామి

కల్యాణ బ్రహ్మోత్సవానికి ముందుగా మహాశివరాత్రి పర్వదినాన ఆలయంలో పూజారులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయ 3:30 గంటలకే ప్రాతఃకాల పూజ నిర్వహించారు. గణపతిపూజ, బలిహరణ, నిత్యోపాసన హోమం నిర్వహించారు. బలిహరణ స్వామి గ్రామసేవకు బయలుదేరి వెల్లారు. సాయంత్రం 6గంటలకు ఎదుర్కోలు కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఆలయం నుంచి బయలుదేరిన అమ్మవారి సేవ, స్వామివారి సేవ రెండు వేర్వేరుగా గ్రామంలోని గడి మైసమ్మ ఉన్న యాదవుల వాడలో ఎదుర్కోలు కార్యక్రమం జరిగింది. స్వామివారి శావకు, అమ్మవారి శావకు భక్తులు చిన్న కాగడాలతో స్వాగతం పలికారు. స్వామివారివైపు కొందరు, అమ్మవారివైపున కొందరు కట్నకానుకలు మాట్లాడుకునే దృశ్యం భక్తులను ఆకట్టుకుంది. 


స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు

భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని జిల్లాలోని ప్రముఖులు దర్శించుకున్నారు. కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు.  ట్రైనీ ఐపీఎస్‌ యోగేశ్‌ గౌతమ్‌ స్వామివారిని దర్శించుకుని, బందోబస్తు దగ్గరుంచి చూసుకున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ స్వామివారిని దర్శించుకుని, ఆశీర్వచనం తీసుకున్నారు. డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ ఆలయానికి విచ్చేసి స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. మానుకోట ఎంపీ మాలోత్‌ కవితభద్రునాయక్‌ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ గుడిపూడి నవీన్‌రావు 48వేల రూపాయల విలువైన వెండి కిరీటాన్ని స్వామివారికి బహూకరించారు. 


మరిపెడ ఎంపీపీ గుగులోత్‌ అరుణ రాంబాబు స్వామివారిని దర్శించుకుని బంగారు మీసాలు, అమ్మవారికి బంగారు ముక్కుపుడకను సమర్పించారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు సూర్యనారాయణ, శ్రీనివాస్‌రావు, ఛత్రునాయక్‌, రంగాచారితో పాటు ఆర్డీవో కొమురయ్య స్వామివారిని దర్శించుకున్నారు. ఇల్లెందు మెజిస్ట్రేట్‌ ఎస్‌కే మీరా కాసిం సాబ్‌ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. చిన్నగూడూరు జెడ్పీటీసీ, కురవి జెడ్పీటీసీ మూల సునీత మురళీధర్‌రెడ్డి, బండి వెంకట్‌రెడ్డి స్వామివారి సేవలో తరించారు. జాతరలో మానుకోట ఎంపీ మాలోత్‌ కవిత భద్రునాయక్‌, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్వవతిరాథోడ్‌ గాజులు కొనుకున్నారు. మిఠాయిలను తీసుకున్నారు. డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ మిఠాయిలు, బొమ్మలు కొనుగోలు చేశాడు. 


పోలీసుల సేవలు బేష్‌

జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలన్న ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాలు జాతరలో ఫలించాయి. ట్రైనీ ఐపీఎస్‌ యోగేశ్‌గౌతమ్‌ జాతర బందోబస్తులో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు డీఎస్పీ నరేష్‌కుమార్‌, రూరల్‌ సీఐ వెంకటరత్నం, మరిపెడ సీఐ కరుణాకర్‌, కురవి ఎస్సై శంకర్‌రావు జాతరను పరిశీలించారు. భక్తులకు మహబూబాబాద్‌కు చెందిన శ్రీలక్ష్మీ గణపతి సేవాట్రస్టు సభ్యులు సేవందించారు. ప్రైవేట్‌ వాహనాలను రాకుండా నాలుగు పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటుచేశారు. ఖమ్మం నుంచి వచ్చే వాహనాలను ఎస్సారెస్పీ కాల్వ రోడ్డు ద్వారా మళ్లించారు. 


ఆర్టీసీ సేవలు...

శ్రీ వీరభద్రస్వామి కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు మహబూబాబాద్‌ ఆర్టీసీ డీపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసారు. సూర్యాపేట, ఖమ్మం, మరిపెడ నుంచి రోజు వచ్చే బస్సులతో పాటు అదనంగా బస్సులను నడిపారు. అంతేకాకుండా చార్జి 10రూపాయలు ఉంచడంతో భక్తులు బస్సులవైపు మొగ్గుచూపారు. తాత్కాలిక బస్టాండ్‌ వద్ద డిపో మేనేజర్‌ మహేశ్‌ పర్యవేక్షించారు. 1098 చైల్డ్‌లైన్‌ వారు తప్పిపోయిన పిల్లల ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటుచేశారు. 


logo