శుక్రవారం 05 జూన్ 2020
Mahabubabad - Feb 19, 2020 , 03:47:59

పట్టణాలు అద్దంలా మెరవాలె

పట్టణాలు అద్దంలా మెరవాలె

మహబూబాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపు రేఖలను మార్చిన ప్రభుత్వం తాజాగా ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పట్టణాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌, జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, అదనపు కలెక్టర్‌ ఎం వెంకటేశ్వర్లు, మహబూబాబాద్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్‌, రెడ్యానాయక్‌తో పాటు మహబూబాబాద్‌, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్‌ మున్సిపాలిటీలకు చెందిన చైర్మన్లు, కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. 

నాలుగు మున్సిపాలిటీల్లో..

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న 82 వార్డుల్లో ఇక పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా రోడ్లు, డైనేజీల మరమ్మతులు, పార్కులు, జంక్షన్ల సుందరీకరణ, చెత్తను తొలగించడం, కూరగాయల మార్కెట్లు, మాంసం, చేపల మార్కెట్లకు స్థలాలు గుర్తించి నిర్మాణాలు చేపట్టడం, పట్టణాల్లో సులభ్‌ కాంప్లెక్స్‌ల కోసం స్థలాలు గుర్తించి, నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం మున్సిపాలిటీల వారీగా నిధులు కేటాయించనున్నది. పట్టణ ప్రగతికి సంబంధించిన విధివిధానాలు ఇప్పటికే రూపొందించారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 10 రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.  

మెరుగుపడనున్న మౌలిక వసతులు

పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంగళవారం సీఎం కేసీఆర్‌ సమక్షంలో జరిగిన సమావేశంలో పట్టణాభివృద్ధిపై దిశా నిర్దేశం చేశారు. ఇందులో ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేస్తూ.. పట్టణాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. పల్లెప్రగతి కార్యక్రమం తరహాలోనే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లా మున్సిపాలిటీని మినహాయిస్తే మిగతా తొర్రూరు, మరిపెడ, డోర్నకల్‌ మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడిన విషయం తెలిసిందే. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడ వచ్చిన నిధులను కాస్త ఎక్కువగా వెచ్చించి మౌలి క వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 82 వార్డుల్లో ప్రణాళికలు..

జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 82 వార్డులు ఉన్నాయి. ఇందులో మహబూబాబాద్‌-36వార్డులు, తొర్రూరు-16వార్డులు, మరిపెడ-15వార్డులు, డోర్నకల్‌-15 వార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో మౌలిక వసతులు కల్పించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు వార్డుల వారీగా ప్రణాళికలు సైతం తయారు చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల వారీగా నిధులను విడుదల చేయనున్నది. వచ్చిన నిధులతో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను సుందరంగా తీర్చిదిద్దేలా కృషి చేయనున్నారు. పల్లె ప్రగతి మాదిరిగానే పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ మున్సిపల్‌శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. పట్టణాల్లో వార్డుల వారీగా చెత్తను సేకరిస్తున్నప్పటికీ, ఇంటికి రెండు బుట్టలు పంపిణీ చేసేలా ప్రణాళిక తయా రు చేశారు. జిల్లాలోని 82 వార్డులను అద్దలా మెరిసేలా చేసేందుకు  ప్రణాళికలు సిద్ధం చేశారు.

 పరుగులు పెట్టనున్న పట్టణ అభివృద్ధి..

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు ప్రభు త్వం ఇప్పటికే పుష్కలంగా నిధులు కేటాయించింది. ఇందులో మహబూబాబాద్‌ మున్సిపాలిటీకి రూ.60 కోట్లు, తొర్రూరుకు రూ.40 కోట్లు, మరిపెడకు రూ.20, డోర్నకల్‌లో రూ. 20కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇక ఈ నెలలో చేపట్టే పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణాల్లో చెత్తను తొలగించడం, ముళ్ల కంచెలను తొలగించడం, అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపట్టడం, రోడ్లకు, డ్రెనేజీలకు మరమ్మతులు, పట్టణాల్లో ప్రతి ఇంటికీ తడిపొడి చెత్త బుట్టలను పంపిణీ  చేయనున్నారు. ప్రతి వార్డులో చెత్తను సేకరించడానికి ఆటోలు, రిక్షాలు, ట్రాక్టర్లను ఏర్పాటు చేయడం, పట్టణాల్లో పార్కింగ్‌ సమస్య లేకుండా చూడటం, పార్కులు, జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు.  కొత్త మార్కెట్ల నిర్మాణాల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తారు. 

 నేడు పట్టణ ప్రగతిపై సమీక్ష 

ఈ నెల 24 నుంచి చేపట్ట నున్న పట్టణ ప్రగతి కార్యక్రమంపై బుధవారం మంత్రి సత్యవతి రాథోడ్‌ అధ్యక్షతన సమీక్ష సమావేశం అధికారులు నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని నందనా గార్డెన్స్‌లో ఉదయం 11 గంటలకు పల్లె ప్రగతిపై సమ్మేళనం నిర్వహిస్తారు. పట్టణ ప్రగతిపై సమీక్ష నిర్వహించి వార్డుల వారీగా కమిటీలను ఖరారు చేయనున్నారు. ఈ కమిటీలు పట్టణ ప్రగతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనను న్నాయి.


logo