సోమవారం 08 మార్చి 2021
Mahabubabad - Feb 11, 2020 , 03:21:53

నిఘా నీడలో మేడారం హుండీలు

నిఘా నీడలో మేడారం హుండీలు

(వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే :తెలంగాణ): మేడారం మహాజాతర హుండీల లెక్కింపును ఈనెల 12 నుంచి హన్మకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో చేపట్టనున్నారు. హుండీ లెక్కింపు కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో ఈనెల 12 నుంచి వారం పది రోజులపాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య లెక్కించనున్నట్లు మేడారం జాతర ఈవో కమ్మ రాజేంద్రం ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. రెవెన్యూ, పోలీసు, దేవాదాయ శాఖల సంయుక్తంగా ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మేడారం నుంచి ప్రత్యేక వాహనాల్లో హుండీలను సోమవారం రాత్రి హన్మకొండకు తరలించారు. హుండీ లెక్కింపు కోసం దేవాదాయ శాఖ పరిధిలోని వరంగల్‌ జోన్‌, హైదరాబాద్‌ జోన్ల నుంచే కాకుండా హుండీ లెక్కింపులో అనుభవం కలిగిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల్ని సైతం వినియోగిస్తున్నామని రాజేంద్రం వెల్లడించారు. ములుగు జిల్లా తాడ్వాయి తహసీల్దార్‌ శ్రీనివాస్‌ సహ దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషన్ల పర్యవేక్షణ ఉంటుందని, వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని భద్రతా సిబ్బంది లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేదాకా ఏర్పాట్లు చేశారు. 

హుండీ లెక్కలివీ..

జాతర సమయంలోనే కాకుండా జాతర ప్రారంభానికి ముందు నుంచి గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హుండీలన్నింటినీ లెక్కిస్తారు. మొత్తం 494 హుండీలను లెక్కించేందుకు 350 నుంచి 400 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. సమ్మక్క, సారలమ్మ హుండీలు 404 (202 హుండీల చొప్పున), అదేవిధంగా గోవిందరాజులు, పగిడిద్దరాజు హుండీలు 50 (25 చొప్పున) ఇవే కాకుండా ఒడి బియ్యానికి రెండు ప్రత్యేకమైన హుండీలు, మరో 38 క్లాత్‌ హుండీలను గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ హుండీల ఆదాయాన్ని ఏ రోజుకారోజు బ్యాంక్‌లో జమ చేసేందుకు సంబంధిత బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హుండీ లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు మేడారం ఈవో రాజేంద్రం పేర్కొన్నారు. 

VIDEOS

తాజావార్తలు


logo