శుక్రవారం 05 జూన్ 2020
Mahabubabad - Feb 08, 2020 , 03:14:02

దేశ ప్రజలకు తల్లుల దీవెనలుండాలి

దేశ ప్రజలకు తల్లుల దీవెనలుండాలి

ములుగు జిల్లా ప్రతినిధి-నమస్తేతెలంగాణ, మేడారం బృందం: మేడారం సమ్మక్క సారలమ్మ దీవెనలు దేశంలోని ప్రతిఒక్కరికీ అందాలని  రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్నారు. శుక్రవారం మేడారం సమ్మక్క సారలమ్మను రాష్ట్ర గవర్నర్‌ తమిళీసై సౌందర్‌రాజన్‌, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, సీఎం కేసీఆర్‌ దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఉదయం పది గంటలకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ హైదరాబాద్‌ నుంచి ప్ర త్యేక హెలీకాప్టర్‌లో మేడారం చేరుకున్నా రు. మేడారం చేరుకున్న గవర్నర్లకు రాష్ట్ర మంత్రులు సత్యవతిరాథోడ్‌, ఎర్రబెల్లి ద యాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ప్రజా ప్రతినిధులు గవర్నర్లకు ఘన స్వాగ తం పలికారు. అనంతరం ఆలయ మర్యాదలతో గద్దెల వద్దకు తీసుకువెళ్లగా, వారు తల్లులకు పట్టువస్ర్తాలు, నిలువెత్తు బంగారం సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ (55 కిలోలు), గవర్నర్‌ తమిళీసై (89 కిలోలు) తమెత్తు బంగారాన్ని (బెల్లం) తల్లులకు సమర్పించుకున్నారు. అనంతరం గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయ మాట్లాడుతూ మేడారం జాతర ప్రకృతితో మమేకమై ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని తల్లులను కోరుకున్నట్లు వెల్లడించారు. అనంతరం గవర్నర్లకు దేవాదాయ శాఖ అధికారులు ప్రసాదం, జ్ఞాపికలను  అందజేశారు. 

జాతరలో వసతులపై సీఎం కేసీఆర్‌ ఆరా..

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధికెక్కిన మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రూ.75కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులపై సీఎం కేసీఆర్‌ ఆరా తీశారు. నిధుల వినియోగంపై స్థానిక ఎమ్మెల్యే సీతక్క, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ బడే నాగజ్యోతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో  భోజనం చేసి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, నోడల్‌ అధికారి వీపీ గౌతమ్‌, ఓఎస్‌డీ కృష్ణఆదిత్య, మేడారం పునరుద్ధ్దరణ కమిటీ చైర్మన్‌ ఆలం రామ్మూర్తి, ఐటీడీఏ పీవో కొండిబా జడ్‌, ఆలయ ఈవో రాజేంద్రన్‌తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.  


logo