తెలంగాణ సాహిత్యం ఏ పడగ కింద లేదు..


Mon,July 22, 2019 12:20 AM

ఈ మధ్య ప్రభుత్వ వ్యతిరేక కవులు అని చెప్పుకోవడం ఫ్యాషనైపోయింది. కొందరు ఆరోపిస్తున్నట్టుగా కవులెవ్వరూ ప్రభుత్వానికి జీ హుజూర్ అనటం లేదు. తెలంగాణ కవులు ప్రభుత్వం పడగ పైన్నే ఉన్నారు కానీ, పడగ నీడ కింద లేరు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కాకముందు తెలంగాణకు అన్నిరంగాల్లో అన్యాయం జరుగుతుండే గనుక అందరం భేషరతుగా అప్పటి ప్రభుత్వాలను విమర్శించినం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. మనం ఆశించిన స్థాయిలో లేకపోవచ్చేమో కానీ, అభివృద్ధి జరుగుతుందనేది వాస్తవం. కవులూ, రచయితలూ జరుగుతున్న అభివృద్ధిని గుర్తించాల్సిన చారిత్రక సంద ర్భం ఇది. కాళేశ్వరం మీద నీటి కవితలు రాసిన కవులు ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ సైతం కవితలు రాసిన్రు. సాహిత్య పేజీలు తిరగేస్తే ఈ నిజం కన్పిస్తది. తెలంగాణ మన చేతికి వచ్చే సరికే పూర్తిగా శిథిలమైపోయింది. కనుక కవులకు ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వుండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న కవులు కూడా చెరబండరాజు లాంటి నికార్సయిన కవులేం కాదు. వారు ఉద్యోగాల్లో వున్నప్పుడు పదోన్నతుల కోసం, ఉద్యోగ విరమణ తర్వాత ప్రభుత్వం ఇచ్చే పదవుల కోసం ప్రభుత్వంచుట్టూ తిరిగిన వారే.

అక్కడా పని కాకుంటే జూన్ రెండుకు ముందు అవార్డు కోసం ప్రగతి భవన్ చుట్టూ చక్కర్లు కొట్టీ కొట్టీ పని కాక విసిగిపోయిన కవులే కదా ప్రభుత్వ వ్యతిరేక రాగమెత్తుకున్నది! చిత్రమేందంటే ప్రభుత్వ వ్యతిరేక కవులుగా చెప్పుకునే వారు, వారు మాత్రం ఉన్నత స్థానాల్లో వుండాలె. వారి పిల్లలు కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువు కోవాలె. వాళ్ళు డాలర్ల వేటకు విదేశాలకు పోవాలె. మాలాంటి కవులు చింపిరి జుట్టుతో, చిరిగిన అంగీతో ప్రభుత్వ వ్యతిరేక కవితలు రాస్తూ సాహిత్య సభల్లో గొంతు చించుకోవాలా!? నిజానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలు ఏమేరకు లబ్ధి పొందుతున్నారనే అంశాల ప్రాతిపదికన మాత్రమే కవులు కానీ, రచయితలు కానీ ప్రభుత్వాన్ని విమర్శించటం లేదా పొగడటం చేయాలి. అలా కాకుండా పనులు కాకపోతే ప్రభుత్వాన్ని తిట్టడం, అనుకూలంగా వుంటే ప్రభుత్వానికి బాకా ఊదటం రచయితలు చేయాల్సిన పని కాదు. కాళోజీ కేంద్ర ప్రభుత్వ పురస్కారం తీసుకుంటే లేని తప్పు తెలంగాణ కవులు తెలంగాణ సాహిత్య అకాడమీ చేస్తున్న చిన్నపాటి సన్మానం పొందితే తప్పవుతుందా? దాన్ని పడుపు కూడు అనడం నిజంగా మనల్ని మనం అవమానించుకోవడమే.

దేశవ్యాప్తంగా మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా అవార్డు వాపసీ పిలుపు వచ్చినప్పుడు మన ప్రభుత్వ వ్యతిరేక తెలుగు కవులు ఎక్కడున్నరు? వర్తమానంలో వరవరరావు మీద ప్రధాని నరేంద్రమోదీ హత్యా ప్రయత్న నేరం మోపబడి గత తొమ్మిది నెలలుగా జైల్లో మగ్గుతుంటే ప్రభుత్వ వ్యతిరేక కవులుగా భుజాలు చరుచుకునే వారు ఏం చేస్తున్నట్టు? బీజేపీ బలపడేందుకు కారణం మీరంటే మీరని కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీలు ఒకరిమీద ఒకరు నింద వేసుకుంటున్న దీన స్థితిని మనం ప్రత్యక్షంగా చూస్తూ రచయితలుగా ఏం రాస్తున్నామనేది ముఖ్యం. ప్రజాస్వామిక తెలంగాణ కావాలని, అది త్వరలోనే రావాలని అందరికీ ఉంటుంది. కానీ మన దేశం మొత్తం పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉండి అది చాలదన్నట్టు మతతత్వ పార్టీ గుప్పిట్లో అధికారం కేం ద్రీకృతమైన తర్వాత భారతదేశంలో ఒక రాష్ట్రమైన తెలంగాణలో మాత్రమే మనం ఏదో కోరుకుంటే అదెలా సాధ్యమవుతది? ఇప్పుడు దేశవ్యాప్తంగా కవులను, కళాకారులను, రచయితలను సంఘటిత పరి చే లౌకిక ప్రజాతంత్ర ఉద్యమావశ్యకత మన ప్రధాన లక్ష్యంగా మనం కొనసాగాలి. లేకపోతే చరిత్రలో మన పేజీని మనమే నిశబ్దంగా చింపుకున్న వారిగా అదృశ్యమైపోతం.
- ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్, 98490 82693
(ఈ మధ్య ఓ పత్రికలో తెలంగాణ కవులను విమర్శిస్తూ వచ్చిన వ్యాసానికి స్పందన)

108
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles