ఆప్తవచనం


Mon,July 15, 2019 01:39 AM

APTHA-VACHANAM
ప్రయాణం ఎక్కడో మొదలు పెడతాం
పాట ఏ తోటలోనో ప్రారంభమవుతుంది
తారీఖులు గుర్తుండవు-
తన్లాట ఒక్కటే
వడ్రంగి పిట్ట తొలుస్తున్న
చెట్టు గుండె చప్పుడై ప్రతిధ్వనిస్తుంది!
జారిపోయిన క్షణాలు
జరిగిపోయిన మనుషులు
వదిలిన జ్ఞాపకాలు తగిలిన గాయాలు
మెలిపెడుతున్న నొప్పుల కుప్పల్లోంచి
కొత్త కలల్ని ఏరుకుంటూ
దొరికిన వాటిని దోసిట పట్టుకొని
ఎక్కడో పోగొట్టుకుంటం
ఇంకెక్కడో వెదుకుతుంటం
పోగొట్టుకోవడానికి వెదకటానికి మధ్యన
పొంతన లేని స్థలంలో
అర్థం కాని వాక్యమై తరచూ
ప్రశ్నార్థకంలా నిలబడుతాం!
కనిపించని యుద్ధంలో
అందరమూ క్షతగాత్రులమవుతాం
అందిన సుఖంలో తేడా ఉండవచ్చు
పొందిన దుఃఖం మాత్రం ఒక్కటే!
ఒకరి కంటి కొసల్లోంచి రాలిన
అశ్రుబిందువును మరొకరు
బాష్ప నయనాలతో పలుకరించినప్పుడే
బంధాలు బలీయం!
దారెంట ఏం వదులుతాం?
రెండు బిందువుల మధ్య
నడక సాగిన కాలంలో
గుప్పెడు నవ్వులను
వెన్నెల పువ్వులను
లోకానికి కానుకలుగా
ఇవ్వాలనే గదా!
నీకైనా నాకైనా
సూత్రం ఒక్కటే-
పరస్పర ఊరడింపులోనే
బతుకు-
పరిమళభరితమవుతుంది!
- డాక్టర్ వి.శంకర్

126
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles