అగ్నిధార ‘దాశరథి’


Mon,July 22, 2019 12:21 AM

వాస్తవానికి దాశరథి ఆకారంలో వామనుడు, పరాక్రమంలో త్రివిక్రముడు. నిత్యనూతన ప్రగతిశీలి. నైజాం కర్కశపాలనలో కఠోరజీవితాన్ని కన్నది, విన్నది కాదు. స్వయంగా అనుభవించినవాడు. ఆ అనుభవాలకు పదునైనటువంటి అక్షరరూపం కల్పించినవాడు. రెండు పదుల వయస్సు నిండకముందే నైజాం జైళ్లలో నానాబాధలు పడ్డవాడు. ఆ బాధ ల నుండి పుట్టిన అగ్నియే ఆయన కవిత్వం. అందులోదే అగ్నిధార. క్రౌంచపక్షి దురవస్థ చూసి వాల్మీకి కవి గళం విప్పారింది. తెలంగాణ ప్రజల దురవస్థ చూసి, అనుభవించి దాశరథిలో అంతర్నిహితమైన అగ్ని లావాను పోలిన కవితాస్రవంతిగావిజృంభించి అగ్నిధార రూపం దాల్చింది.

భారత స్వాతంత్య్రోద్యమంలో తెలంగాణ ఉద్యమం సముజ్వలమైన అమరగాథ. ఆ ఉద్యమానికి మూడు పార్శాలున్నది ప్రప్రథమంగా వక్కాణించదగినది. బ్రిటిష్‌వలస పాలనకు చరమగీతం పాడిన ప్రజోద్యమాల వరుసలో జాతీయ విముక్తి పోరాటంగా ప్రత్యేకించి స్వదేశీ సంస్థానాలలో సాగి న ప్రజా పోరాటంగా దానికున్న ప్రాధాన్యం అనితరమైనది. వ్యవసాయాధార భారత సమాజంలో కీలకమైన భూ సమస్యను జాతీయ ఎజెండాలోకి ఎక్కించిన వీరోచిత పోరాటం అది రెండో పార్శ్వం. చారిత్రకంగా, సాంస్కృతికంగా ఒక్కటైన తెలుగు ప్రజలు పరాయి దాస్యంలో ముక్కచెక్కలైన పరిస్థితికి అంతం పలికి భాషాప్రయుక్త ప్రాతిపదికపై రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణకు భూమిక సిద్ధింపచేసిన ప్రజాతంత్ర పోరాటమన్నది మరో ముఖ్యమైన మూడవ పార్శ్వం. తెలంగాణ ఉద్యమ కావ్యాల్లోకెల్లా అగ్రగణ్యమైనది దాశరథి అగ్నిధార. తెలంగాణ కాకతీయుల కదన పాండితికి నెలవే కాదు-ఒకప్పుడు మనుజేశ్వరాధముల నదఃకరించిన పోతనకవి పురిటిగడ్డ. ఆ వారసత్వం పుణికి పుచ్చుకున్న దాశరథి నిజాం నవాబు పదఘట్టనలో నలిగి నవిసి యమయాతన లకు గురైనది తెలంగాణ. జన్మజన్మాల బూజుగా కృద్ధ కవులచే శప్తుడైన నిజాం, ఆయన తొత్తులైన దేశముఖుల చేతిలో అలవికాని అష్టకష్టాల పాలయింది. దున్నుకోటానికి బారెడు భూమిలేక మాతృభాషలో చదువుకునే వీలులేక కనీస జీవన ప్రమాణాలకు నోచుకోని తెలుగు ప్రజల చింతల కాపురంగా సొక్కిపోయింది.

ఆ దారుణంపట్ల ఆగ్రహోదగ్రులైన తెలుగు ప్రజలు ప్రళయరుద్రులై, వీరభద్రులై ఒక్కుమ్మడిగా విజృంభించారు. కవులు ఆ పోరాటాన్ని పరిపరి విధాల కీర్తించారు. నిజాం ముష్కరపాలనపై నిప్పులు వర్షించారు. అగ్నిధారలు స్రవించాయి. రుద్రవీణలు గర్జించాయి. వీర తెలంగాణ స్ఫూర్తితో మహాంధ్రోద్యమాన్ని ఆకాంక్షిస్తూ ప్రఖ్యాతులూ, అజ్ఞాతులూ అయిన కవులెందరెందరో పాటలని తూటాలుగా, ఈటెలుగా, బరిసెలుగా, వడిసెలుగా, వజ్రాయుధాల్లా మలిచి నిజాం రాక్షస రాజ్యంపై పరిక్రమించారు. ఆ పోరాట కాలంలో ఉత్తమ సాహిత్యం, ఉన్నతమైన అభిరుచులతో వివిధ కళారూపాలు సమరశీల ప్రజల విప్లవ కథన కాహళులుగా రూపుదిద్దుకున్నాయి.భూసమస్యపై, సాంస్కృతిక పరిరక్షణ సమస్యపై జరిగినటువంటి ఆ పోరాటం కవులను ఉత్తేజపరిచింది. అందులో దాశరథి ప్రేక్షకుడిగా కాకుండా స్వయంగా పాల్గొన్నారు. వాస్తవానికి అగ్నిధార తెలంగాణ ప్రజల పీడిత మనోభావాలకు ప్రతీక. దాశరథి చెప్పినట్టు అది నిజాం నవాబు పాలనను తుదముట్టించడమే కాకుండా తెలంగాణలో వున్నభూస్వామ్య, బానిస వ్యవస్థను రద్దుచేసి తెలుగువారందరూ ఒక్కటి కావటానికి తోడ్పడింది. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న దాశరథి మూడుకోట్ల నొక్కటే ముడి బిగించి మహాంధ్రోదయాన్ని ఆకాంక్షిస్తారు. అది అగ్నిధారలో ఆసాం తం కనబడుతుంది. వాస్తవానికి అగ్నిధార ఆయన కారాగారవాస క్లేశాలు. అజ్ఞాతవాస అవస్థల నుండి జ్వలించినటువంటి కావ్యమది. అగ్నిధార తొలి ప్రచురణకు పీఠికరాస్తూ దేవులపల్లి రామానుజరావుగారు చెప్పినట్టు.. ఆ ఉద్యమం లో భాగస్వామి అయినటువంటి దాశరథి అక్కడి ప్రజలు మట్టి నుండి మాణిక్యాలై, ప్రజల మనుషులై సృష్టించిన చరిత్రకు భాష్యకారుడిగా నిలిచాడన్నారు.

దాశరథి చెప్పినట్టు పీడిత ప్రజావాణికి మైకు అమర్చినటు వంటి ఉత్తమ కావ్యం అగ్నిధార.అలాగే రైతుకు తన భూమి మీద హక్కును గురించి తెలంగాణము రైతుదే. ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని అగ్నిధారలో గర్జించాడు. అంతేకాకుండా అనేక విధాలుగా ఆ ఉద్యమంలో తమతోపాటు తాదాత్మ్యం పొంది నటువంటి వీరకేసరులను స్మరిస్తూ అగ్నిధారను తన సహజైలువాసి వట్టికోట ఆళ్వార్ స్వామికి అంకితమిచ్చాడు. దాశరథి పోరాట ప్రజల ఆస్థానకవిగా వున్నప్పుడు రాసి న మూడు కావ్యాలలో కూడా తెలంగాణా పోరాట ప్రజాశ్రేణుల యొక్క మనోభావాలను ప్రతిధ్వనిస్తాయి. అగ్నిధార మొదటిది. రుద్రవీణ రెండవది. దాని పర్యవసానంగా వచ్చి న మహాంధ్రోదయం మూడవది. దాశరథి యొక్క యింకొక వైశిష్ట్యం ఏమిటంటే.. అగ్నిధార, ప్రజల మనిషి నవల రాసినటువంటి తన నిజామాబాద్ జైలు సహవాసి వట్టికోట ఆళ్వార్ స్వామికి అంకితమిస్తే, రుద్రవీణను తెలంగాణకు అంకితమిచ్చాడు. అలాగే మహాంద్రోదయాన్ని సురవరం ప్రతాపరెడ్డికి అంకితమిచ్చాడు. దాశరథి తెలుగు, సంస్కృతం, పారశీ, ఆంగ్లం బాగా చదువుకున్నవాడు. ఇటు ఛందోబద్ధమైన కవితల లోనూ, అటు వచన ప్రక్రియలలోనూ, గేయాలలోనూ ప్రసిద్ధి చెందినవాడు. ప్రతి ప్రక్రియను కూడా హృదయగతమైనటువంటి భావోద్వేగంతో నిక్షిప్తం చేసినవాడు. దాశరథి ఆనాటి చరిత్ర కు అద్దం పట్టినటువంటి కవి. తెలంగాణ ఉద్యమ ప్రేరణతో అనేక కావ్యాలు వచ్చాయి. అనేక నవలలు వచ్చాయి. ఉదాహరణకు ఆరుద్ర త్వమేవాహం, కుందుర్తి తెలంగాణ, అలాగే బొల్లిముంత మృత్యుంజయులు.. యిలా వచ్చినటువంటి అన్ని సాహితీ ప్రక్రియలు, రూపాలు, కావ్యాల్లోకెల్లా అగ్నిధార ఉత్తమమైనది.

ఆనాడు తెలంగాణ ప్రజల క్రోధాగ్నికి ఎలా దాశరథి స్పందించాడో ఒక విషయం చెప్తే అర్థమవుతుంది. ఆయన.. నా గీతావళి ఎంతదూరము ప్రయాణంబగునో అందాక ఈ భూగోళమ్మున అగ్గి పెట్టెదను నిప్పుల్ పోసి, హేమంత భామా గంధర్వ వివాహమాడెదను. జూమసుష్ట గోళమ్ముపై ప్రాణాకాశనవారుణోష్ట జలధారల్ చల్లి చల్లార్చెదనన్నాడు,
వీనియ తీగపై పదును పెట్టిన నా కరవాల
ధారతో గానము ఆలపించెద స్వకంఠము
నుత్తరణంబు నొనర్చి స్వర్గానకు భూమినుండి
రసగంగను చిమ్మెద. పీడిత ప్రజావాణికి మైకు
అమర్చి అభవాదులకున్ వినిపింప చేసెదన్..అన్నాడు.
చాలా గొప్ప భావోద్వేగ భరితమైనటువంటి కావ్యమది. అంతేకాదు తెలంగాణ అంటే దాశరథి పరవశించిపోతాడు. ఎంత ఇదిగా అంటే..
కాకతీయుల కంచుగంట మ్రోగిననాడు
కరకు రాజులకు తత్తరలు పుట్టె
వీర రుద్రమదేవి విక్రమించిననాడు
తెలుగు జెండాలు నర్తించే మింట
కాపయ్య నాయకుండేపుసూపిననాడు
పర రాజులకు గుండె-పట్టుకొనియె
చాళుక్య పశ్చిమ రాజ పాలనమ్మున
కళ్యాణ ఘంటలు గణ గణ మనె

నాడు, నేడు తెలంగాణా మోడలేదు
శత్రువుల దొంగదాడికి
శ్రావణాభ్రజలద గంభీర గరాట్టహాసమదర
నా తెలంగాణా పోవుచున్నది నవపథాన.. అన్నటువంటి దాశరథి అనేక విషయాలలో ఆదర్శమైనటువంటి ప్రజాకవిగా నిలబడ్డాడు. వాస్తవానికి దాశరథి ఆకారంలో వామనుడు, పరాక్రమం లో త్రివిక్రముడు. నిత్యనూతన ప్రగతిశీలి. నైజాం కర్కశపాలనలో కఠోర జీవితాన్ని కన్నది, విన్నది కాదు. స్వయంగా అనుభవించిన వాడు. ఆ అనుభవాలకు పదునైనటువంటి అక్షరరూపం కల్పించినవాడు. రెండు పదుల వయస్సు నిం డకముందే నైజాం జైళ్లలో నానా బాధలు పడ్డవాడు. ఆ బాధ ల నుండి పుట్టిన అగ్నియే ఆయన కవిత్వం. అందులోదే అగ్నిధార. క్రౌంచపక్షి దురవస్థ చూసి వాల్మీకి కవి గళం విప్పారింది. తెలంగాణ ప్రజల దురవస్థ చూసి, అనుభవించి దాశరథిలో అంతర్నిహితమైన అగ్ని లావాను పోలిన కవితాస్రవంతిగావిజృంభించి అగ్నిధార రూపం దాల్చింది. పద్యం, గేయం,వచనం, కవిత్వం లాంటి అన్ని రూపాలలోనూ ఆయన సిద్ధహస్తుడు.

మీదుమిక్కిలి పారశీ కవి గాలిబ్ గజళ్లను అనువదించి తెలుగువారికి ఆ రససిద్దిని పంచిపెట్టినవాడు. నా తెలంగా ణా కోటిరత్నాలవీణ అన్న దాశరథి అక్కడితో ఆగిపోలేదు. సోషలిస్ట్ వ్యవస్థపట్ల మమకారం, విశ్వశాంతి.. యిలా ఆయ న భావనాస్రవంతి విశ్వజీవన శ్రేయోదాయకమైనటువంటి త్రివిక్రమాకృతిలో, కవిత్వం రూపంలో దర్శనమిస్తుంది. కనుకనే దాశరథి నిత్యనూతనుడు. సాహిత్య సనాతనుడు, ప్రగతిశీలి. బహుగ్రంథ రచయితగా పెక్కు సత్కారాలు అం దుకున్నాడు.ఆంధ్రకవితా ప్రపంచంలో పోరాట ప్రజల ఆస్థానకవిగా తొలిదశలో జాజ్వల్యమానంగా వెలుగొందినవాడు. తరువాత ఆయన సినిమా గేయాలు, ఆస్థానకవిగా ఆయన పరిస్థితి తెలిసిందే. తెలుగువారు యింకా ఎంతో కవితా సృష్టి ని ఆయన్నుంచి ఆశిస్తూ వుండగా 60 ఏండ్లకే అమరుడైన అగ్నిధార సృజనశీలి దాశరథి.
- సి.రాఘవాచారి
(శత వసంత సాహితీ మంజీరాలు అన్న గ్రంథంలో దాశరథి అగ్నిధార పై సి.రాఘవాచారి రాసిన వ్యాసం సంక్షిప్తంగా..) (నేడు.. దాశరథి 95వ జయంతి..)

124
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles