తెలుగు పలుకుపడి తళతళలు


Mon,July 8, 2019 12:46 AM

కవిత్రయ యుగం ముగిసింది. ఆశ్రమ జీవితం నుంచి నగర జీవితంలోనికి తెలుగు సరస్వతి ప్రవేశించింది. పలుకు మారింది. విలాసం మారింది. కొత్త వసంతం వచ్చింది. కాళిదాసు, భారవి, శ్రీహర్షుడు మొదలైన వారు తెలుగు వేషాలలో సాహిత్యరంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ సందర్భంలో అతిలోక మోహనమైన శైలి గాంభీర్యంతో ఒక కవి ప్రవేశించాడు. ఆయన పేరు శ్రీనాథుడు. సకల శాస్ర్తాలు, ప్రాకృతాది భాషలు నేర్చినవాడు. ఆయన రాక సాహిత్యరంగంలో ఒక పెద్ద కుదుపు కలిగించింది.
sri-nadha
-శబ్ద సంకటనాలు, వక్రోక్తి సంప్రదాయంలోని అనేక నూతనాంశాలు శ్రీనాథుని యుగంలోనే కావ్యరంగంలో ప్రవేశించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యుగంలో తెలుగు సరస్వతి బాల్య యౌవన దశా పరిణామ సంధిత్రామ నేత్ర యుగళ శోభ పయోధిగా భాసిల్లింది.

శ్రీనాథుని తాతగారు కమలనాభామాత్యులు. ఆయన సముద్రతీరంలోని క్రాల్ పట్టణానికి అధిపతి. అది ఒక అగ్రహారం అయి వుంటుంది. ఈయన కాకతీయ సార్వభౌముడి చేత సత్కరింపబడ్డాడు. శ్రీనాథునికి, ఈయనకు రెండు తరాల భేదము అనుకుంటే..ఈయనను సత్కరించిన ప్రభువు ప్రతాపరుద్రుడై ఉంటాడు. శ్రీనాథుని సాహిత్య పరంపర మొత్తం కాకతీయ మూలాలలోనిదే. ఆయన రచించిన పద్మపురాణం ఇప్పుడు లభించడంలేదు. దాని స్వరూప స్వభావాలను మనం విశ్లేషించలేము. శ్రీనాథ కవి ఆనాడు తెలుగుదేశంలో అడుగడుగున సంచరించాడు. తెలుగువారి వేషభాషలు, సంతోష విషాదాలు ఆయనకు చిరపరిచితం. తెలుగుజాతి స్వభావంలో ఉన్న రజోగుణం ఆయన వ్యక్తిత్వంలో, కవిత్వంలో మూర్తీభవించి ఉంటాయి. భారత పద్యంలోని నడక, శ్రీనాథుని ఆవేశాన్ని, ఉద్వేగాన్ని, సంగీతాన్ని కలుపుకొని ఒక కొత్త రూపాన్ని సంతరించుకున్నది. శ్రీనాథుని సీసపద్యం ఒక సంగీతం పాడినట్లుగా కొనసాగుతుంది. ఈ సంగీతాన్ని రామరాజభూషణుడు శిఖరానికి ఎక్కించాడు. శ్రీనాథుని కవిత్వ వ్యక్తిత్వమంతా మూడు విధాలుగా వింగడించుకోవచ్చు. తొలిభాగం ఆయన శాస్త్ర పాండిత్యాన్ని, పద్యవిద్యా నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. శ్రీనాథుడు అనువదించిన నైషధం తెలుగువాళ్లకు శృంగారనైషధమైంది. ఆయన అనువదించిన కాశీఖండం, భీమఖండం ఆయన పౌరాణిక విజ్ఞానానికి వేదవేదాంగవేత్తకు అద్దం పడుతున్నాయి. ముఖ్యంగా భీమఖండంలో ఆయన వర్ణించిన నగరాలు, పల్లెలు, క్షేత్రాలు, కొండలు అన్ని ఆయనకు తెలుగుప్రాంతం మీద గల ఎల్లల్లేని అభిమానాన్ని వ్యక్తంచేస్తాయి.

దీనిలో కాశీ విశ్వనాథుడు, వేదవ్యాసుని నిందించే సమయంలో ఆయన వాడిన భాష ఈనాటికీ తెలుగువారు పల్లెటూళ్లల్లో తిట్టుకొనే స్థాయిలోనే ఉన్నట్లు మనం గమనించవచ్చు. శ్రీనాథుని ఈ రెండు గ్రంథాల్లో కనిపడే దేవతలు, మహర్షులు, మనుష్యులు అందరు కూడా తెలుగువాళ్లలాగానే ప్రవర్తిస్తారు, సంభాషిస్తారు. ఈ లక్షణం వల్ల శ్రీనాథుని కవిత్వం ఎంత పాండిత్యం ఉన్నదైనా జనులకు దగ్గరగా వచ్చింది. ఒక తరం కింద శ్రీనాథుని పద్యాలు నూరు, నూటయాభై రానివారు ఎక్కడా ఉండేవారు కాదు. ఆంధ్ర శబ్ద చింతామణి చెప్పిన విధంగా స్వస్థాన వేషభాషాభిమతాస్సంత: రస ప్రలుబ్ధ ధియ: అన్న మాటకు సాక్షాత్కార రూపంగా శ్రీనాథుని పద్యాలు మనకు కానవస్తాయి. శ్రీనాథునిలో రజోగుణ ప్రాచుర్యం ఎక్కువ. నూనూగు మీసాల నూత్న యౌవనమున శాలివాహన సప్తశతి నుడివితి అని తన యౌవనంలోనే ప్రాకృతంలోని అతి మధురమైన కవిత్వానికి పొంగిపోయి దానిన తెలుగు చేసినట్లు చెప్పుకొన్నారు. సప్తశతి లలిత శృంగారానికి తేనెపట్టువంటి కావ్యం. అలంకారికులు దాన్ని ఎన్నో సందర్భాలలో ఉత్తమ కవితకు ఉదాహరణగా పేర్కొన్నారు. కానీ తెలుగువారి దురదృష్టం వల్ల అది కూడా అలభ్యంగానే ఉండిపోయింది. మరొక పార్శంలో ఆయన నాలుకమీద పద్యము తెలుగు పలుకుపడిలో తళతళలాడుతూ ప్రకాశించేది. అంతటి సిద్ధకవి పలికినప్పడల్లా మధురమైన పద్యం బహిర్గతమయ్యేది. నిత్యజీవనంలో ఎంత నిష్ఠాగరిష్ఠుడైనా, లోక వ్యవహారంలో ఆయన చాటువులు మేరమీరిన అశ్లీలతను పలుకడంలో జంకలేదు. ఈ సందర్భంలో ఆయన జాతరలను చూచినప్పుడు తాను సందర్శించిన అం శాన్ని తెలియజేసేవాడు.

ఈ బాహిరమైన వ్యక్తిత్వం ఆయన అంతః చైతన్యాన్ని ఎంతవరకు స్పృశించేదో చెప్పలేము కానీ గోష్ఠిలోని మిత్రుల, పోషకుల, అభిమానుల ఒత్తిడివల్ల చెప్పినవే ఈ చాటువులు అయి ఉండవచ్చు. శ్రీనాథుని కవిత్వంలో అధిక లోకప్రియములైనవి ఈ చాటువులే. వేటూరి ప్రభాకరశాస్త్రి గారు వీటిని సేకరించి తొలుత ప్రకటించారు. ఆయన వినుకొండ వల్లభరాయని క్రీడాభిరామం శ్రీనాథుని రచనయేనని విశ్వసించారు. మరొక అంశం ఏమిటంటే శ్రీనాథుని దేశి కావ్య రచన. అది పల్నాటి వీర చరిత్ర. కాకతీయుల నాటికే పల్నాటి వీరగాథలు ఓరుగల్లులో ప్రదర్శింపబడుతుండేవి. ఆ ప్రదర్శనను శ్రీనాథుడు సందర్శించి కావ్యాన్ని రాయడానికి ఉద్యుక్తుడైనాడు. నైషధంలో చింతామణి మంత్రోపాసనకు సంబంధించిన ఎన్నో విషయాలు గర్భితములై ఉన్నాయి. దానిలోని సరస్వతిని వర్ణించిన గద్యము కూడా అధ్యయనము చేయదగినదే. అట్లాగే శివరాత్రి మాహాత్మ్యంలో కొన్ని నిగూఢ సాధనాలు చెప్పబడ్డాయని కొందరు సాధకులు భావిస్తున్నారు. మొత్తం మీద శ్రీనాథుని యుగంలో శ్రీనాథుడు కాక బమ్మె ర పోతన, తాళ్లపాక అన్నమాచార్యులు వంద సంవత్సరాల చక్రంలో ప్రవర్తించారు. ఈ ముగ్గురు మూడు మార్గాల వారు. సంకీర్తనాచార్యుడైన అన్నమయ్యకు ముందే సింహగిరి వచనములు రాసిన కృష్ణమాచార్యులు ఉండేవారు. కృష్ణమాచార్యుల వచనాలు గద్యరూపంలోనే లభిస్తున్నాయి. ఈ ప్రక్రియ మూలము బసవేశ్వరుడు మొదలైన వారు.

కన్నడ భాషలో రచించిన వచనము వలె తాళ్లపాక అన్నమయ్య కుమారుడు పెద తిరుమలాచార్యుడు వేంకటేశ్వర వచనము రచించాడు. వీటిని చదువటానికి రాగతాళములు నిర్దేశించబడ్డాయి. అన్నమయ్య కీర్తనలు గేయ ఛందస్సుకు సంబంధించినవి. వచనములు కూడా పాడదగినవే కాని ఆ పాడిన సంప్రదాయం మనది కాకపోవడంతో ప్రచారంలోకి రాలేదు. తెలుగు సరస్వతి శ్రీనాథుని యుగంలో యౌవనాన్ని పొందిందని చెప్పుకొన్నాం. శబ్ద సంకటనాలు, వక్రోక్తి సంప్రదాయంలోని అనేక నూతనాంశాలు శ్రీనాథుని యుగంలోనే కావ్యరంగంలో ప్రవేశించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యుగంలో తెలుగు సరస్వతి బాల్య యౌవన దశా పరిణామ సంధిత్రామ నేత్ర యుగళ శోభ పయోధిగా భాసిల్లింది.
- కోవెల సుప్రసన్నాచార్య

159
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles