మహాకవి మెచ్చిన మహాస్వప్న


Mon,July 1, 2019 12:30 AM

mahaswa
ఒకనాటి యువతరానికి శ్రీశ్రీ అభిమాన కవి. కానీ శ్రీశ్రీకే అభిమాన కవి మహాస్వప్న. ఈ సంగతిని శ్రీశ్రీ తన ఆత్మకథ అనంతంలో రాశాడు. మహాస్వప్న మీద ప్రేమతో రెండు కవితలను ఆంగ్లంలోకి తర్జుమా చేశాడు. ఆయన రాసిన వచన కవితను చదివి కలవరించి, పలవరించి వచన కవిత అంటే ఇట్లా ఉండాలని కితాబిచ్చాడు.

చిన్న వయస్సులోనే గొప్ప సాహితీ అభినివేశంతో కలిగిన మహాస్వప్న రాత్రి కవితాసంకలనం చేసి నాటి యువ కవులనేక మంది రచనలను అందులో చేర్చాడు. ఈ సంకలనం కూడా తెలంగాణ ఆధునిక కవితా పరంపరంలో వెలువడిందని చెప్పవచ్చు. సురవరం, కాళోజీ, దాశరథి, సినారె, మాదిరాజు రంగారావు, సుప్రసన్న, పేర్వారం, కవిరాజమూర్తితో ప్రారంభమైన ఆధునిక తెలంగాణ కవిత డాడాయిజం, సర్రియలిజం, ఫార్మలిజం వంటి కవితా ఉద్యమాలను చవి చూసింది. కవిరాజమూర్తి వెలువరించిన మహైక, మానవుడే నా సంగీతం, సినారె జలపాతం అందులో భాగమే. ఈ పరంపరలో ఈ రాత్రి సంకలనానికి చాలా ప్రాముఖ్యం ఉన్నది. ఒకరకంగా చెప్పాలంటే దిగంబర కవితా ఉద్యమానికి పూర్వరంగమది. అంతేకాదు వరవరరావు, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, చెరబండరాజు, నెల్లుట్ల మురళీధర్‌రావు వంటి యువకవులకు చోటిచ్చిన సంకలనమది. దీనికి ఎడిటర్ శివాజీ నాయుడు. మహాస్వప్నకు బంధువు. అప్పటికి మహాస్వప్న కమ్మిశెట్టి వెంకటేశ్వరరావుగానే ఉన్నాడు. ఆయ న తొలి కవితా సంకలనం మంచు జడులు- అగ్నిశిఖలు. అటు తర్వాత మరికొన్ని రచనలు చేశారు. మహాస్వప్న తన సమకాలీన కవులందరి కవితలతో కూర్పుచేసిన సంకలనమి ది.

రెండవ ప్రపంచయుద్ధం ముగిసింది. చైనా విప్లవోద్యమం విజయవంతమైంది. ఆఫ్రికా దేశాల్లో వలస వ్యతిరేక ఉద్యమాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ సాయుధ పోరాటయోధుల యాది తడి పచ్చిగానే ఉన్నది. నాటి విప్లవాల యుగాల అనంతర కాలంలో మన దేశంలో కించిత్తు నిరాశ నిస్పృహ వ్యాపించిన కాలం. నవభారతంలో స్వాతంత్య్రంనాటి కలలు కల్లలై యువత నీరసించిన కాలం. అభ్యుదయ సాహిత్యోద్యమం అడుగంటిపోయింది. మానవత రెండుకళ్లు మూసుకుపోయినప్పుడు కాలం వాయులీనం మీద కమానై, చరిత్ర నిద్రా సముద్రం మీద తుపానై రాత్రి ఉదయించే రవిలా వచ్చాడు ఒక బక్కపలచనివాడు. నిండా 20 ఏండ్లు నిండని యువకుడు. 1962లో ఈ భాగ్యనగరం నడిరోడ్డు మీద అడుగుపెట్టి నాగరికత రోడ్డు మీద నగ్నంగా నిలబడ్డాడు. ఆ కవి పేరు మహాస్వప్న. అసలు పేరు కమ్మిశెట్టి వెంకటేశ్వర్‌రావు. జిల్లా ప్రకాశం, ఊరు లింగసముద్రం.


అప్పటికే నాటి పరిస్థితులకు తగ్గట్టుగా ఆధునిక కవిత్వం రాస్తున్న నిఖిలేశ్వర్, వరవరరావు, చెరబండరాజు, జ్వాలాముఖిలు ప్రసిద్ధిగాంచారు. అంతకుముందే నిఖిలేశ్వర్ కవిత కోపోద్రిక్త యువతరం వెలువడింది. ఇంతేకాకుండా నాటి తెలుగుప్రాంతాన్నే గాక మొత్తం దేశంలో సంచలనం సృష్టించిన కవితా ఉద్యమం దిగంబర కవితా రచన.అంత్య ప్రాస లతో అణగారిపోయి నిస్సారంగా మారిన తెలుగు కవితకు అంత్యక్రియలు చేసిన కవితా ఉద్యమం అది. 1966లో ప్రారంభమై మూడు కవితా సంపుటాలు వెలువడ్డాయి. ఈ ఉద్యమానికి కూడా అంతర్జాతీయ నేపథ్యం ఉన్నది. ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలో బీట్ జనరేషన్, బ్రిటన్‌లో ఆంగ్రీయంగ్ మెన్ కవితా ఉద్యమాలు మొదలయ్యాయి. మనదేశంలో బెంగాళీలో భూకీ పీడి, హిందీలో, మరాఠీలో కవిత్వోద్యమాలు తలెత్తాయి. దిగంబర కవిత ప్రభావంతో వెలువడిన కన్నడ కవిత బండాయి. దిగంబర కవులు కేవలం ఆరుగురే. అందరిలో చిన్నవా డు మహాస్వప్న. మిగిలిన వారిలో నిఖిలేశ్వర్ (కె.యాదవరెడ్డి), జ్వాలాముఖి (రాఘవాచారి), నగ్నముని (మానేపల్లి కేశవరావు), చెరబండరాజు (బద్దం భాస్కర్‌రెడ్డి), బైరవయ్య (మన్‌మోహన్ సహాయ్)లు ఉన్నారు. వీరిలో అతి తక్కువ రాసిన మహాస్వప్న అబ్బురపరిచే అభివ్యక్తితో, అపురూపమై న శైలితో ఆత్మనిండా నిజాయితీతో నవ ప్రపంచ వీధుల్లోకి నగ్నంగా వెళ్లాలనుకున్నాడు. మొత్తానికి 16వ తేదీన మహాభి నిష్ర్కమణం చేశాడు. మొదట తన యువ స్వప్నాన్ని వాస్త వం చేద్దామనుకునే సరికి ప్రతీపశక్తుల దాడితో ఈ భాగ్యనగరిని విడిచి వెళ్లాడు.

ఇప్పుడు కవి యోధులకు కొన్ని కన్నీటి చుక్కలు మిగిల్చి ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయాడు. ఒకనాటి యువతరానికి శ్రీశ్రీ అభిమాన కవి. కానీ శ్రీశ్రీకే అభిమాన కవి మహాస్వప్న. ఈ సంగతిని శ్రీశ్రీ తన ఆత్మకథ అనంతంలో రాశాడు. మహాస్వప్నమీద ప్రేమతో రెండు కవితలను ఆంగ్లంలోకి తర్జుమా చేశాడు. ఆయన రాసిన వచన కవితను చదివి వచన కవిత అంటే ఇట్లా ఉం డాలని కితాబిచ్చాడు. అప్పటికే దిగంబర కవులు మూడవ సంఫుటి వెలువడింది. తిరిగి నాలుగవ సంపుటికి సమాయాత్తమవుతున్న కాలం. అంటే 1970ల కంటే ముందు రోజు లు. ఏడు కవితలతో ఏడు దశాబ్దాలుగా చర్చలోకి వస్తున్న కవి గొప్ప కవితా పిపాసి మహాస్వప్న. అందరూ శ్రీశ్రీని చూడటానికి మద్రాసు వెళితే, ఆయన మాత్రం మహాస్వప్న వెతుక్కుంటూ ఈ భాగ్యనగరిలో అడుగుపెట్టాడు. మహాస్వప్న ఒక చిరునామా లేని వ్యక్తి అన్న విష యం తెలుసుకొని, చివరికి దిగంబర కవులలో ఒకరిని ఆరా తీసి మహాస్వప్నను బేగంబజార్ లాడ్జీలో పట్టుకున్నాడు. అది కవిగా శ్రీశ్రీ గొప్పతనం. జీవితాంతం తెలుగు భాషను అక్షరాలను ప్రేమించిన శ్రీశ్రీ దిక్కులు పిక్కటిల్లే ధిక్కార స్వరంతో కవితా రచన చేసిన మహాస్వప్నను శ్రీశ్రీ కలవడం లో ఆశ్చర్యం లేదు. నాటి నుంచి వారిద్దరి మధ్య దోస్తానా కుదిరింది. దీనితో తెలుగు పాఠకులకు గొప్ప పుస్తకం మిగిలింది. దానిపేరు రెక్కవిప్పిన రెవల్యూషన్. 1968లో ప్రపంచాన్ని కుదిపేసిన మే-68 విద్యార్థుల తిరుగుబాటును చిత్రిస్తూ వెలువడిన రచన ఇది. కరీంనగర్ నుంచి ప్రచురితమైంది. ఖైరతాబాద్ కల్లు కాంపౌండ్‌లో రికామీగా కూర్చుని శ్రీశ్రీ చెబుతుంటే మహాస్వప్న తెలుగులో రాశాడు.

అంతేకాదు మొత్తం దిగంబర కవులలో ముగ్గురు తెలంగాణ కవు లు. మరో ముగ్గురు ఆంధ్రలో పుట్టి హైదరాబాద్‌లో ఉద్యో గ రీత్యా స్థిరపడ్డవారు. వర్తమాన సందర్భంలో వారి కవితా రచనను తెలంగాణ కోణంలోంచి చూస్తే చాలా తేడాలు కనిపిస్తాయి. తెలంగాణ సాయుధపోరాట నేపథ్యంతో వచ్చినందువల్ల కావచ్చు చెరబండరాజు, నిఖిలేశ్వర్, జ్వాలాముఖిల కవిత చాలా భిన్నంగా ఉన్నది. ఆంధ్రకు చెందిన ముగ్గురు కవులలో మహాస్వప్న అప్పటి సోషలిస్ట్ పార్టీ పెట్టిన పోరా టం పత్రికలో పనిచేస్తున్నాడు. దీనివల్ల కావచ్చు ఆయన కవిత ఉత్తమ ప్రమాణాలతో ఉన్నది. మిగిలిన ఇద్దరు. నగ్నముని, బైరవయ్య. వీరిలో నగ్నమునిలో గొప్ప అభివ్యక్తి ఉన్నప్పటికీ జుగుప్స కలిగించే, ఆడవాళ్లను కించపరిచే ప్రతీకలు ఉండటం వల్ల స్త్రీవాదుల విమర్శకు గురైంది. బైరవయ్యలో కూడా స్వల్పంగా ఉన్నాయి. వీళ్లు పూర్తిగా కోస్తా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. పైగా ఆధునిక రాజకీయ చైతన్యం లేనివారు. ఈ సంకలనం ప్రత్యేకత ఏమిటంటే జ్వాలాముఖి గొప్ప వచన కవితలు రాశాడు. ఆ స్థాయిలో ఇప్పటికీ తెలుగు వచన కావ్యాలు వెలువడలేదు. హైదరాబా ద్ నగరం నుంచి ఉద్భవించిన గొప్ప కవితా ఉద్యమం దిగం బర కవిత్వం. ఈ కవిత్వానికి తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్నది. దేశంలో అనేక భాషల్లోకి తర్జుమా జరిగింది. ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్లోకి వెళ్లిన గొప్ప కవిత ఇది. ఇంతేకాదు తెలంగాణ 1969 ఉద్యమానికి ఈ ఉద్యమం ప్రచారంలో పెట్టిన తిరుగుబాటు భావాలే కారణం అంటారు. చిన్న వయస్సులో గొప్ప సాహిత్య కృషిచేసిన మహాస్వప్నకు నివాళి.

- సామిడి జగన్‌రెడ్డి, 8500632551

288
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles