e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 23, 2021
Home సాహిత్యం పమ్మి శాసనం

పమ్మి శాసనం

పమ్మి శాసనం

శ.సం.1156=క్రీ.శ.1234 శ్రీమన్మహామండలేశ్వర కాకతీయ గణంరుద్ర దేవమహారాజుల పరిపాలనా కాలంలో పమ్మిలో ప్రసన్న వల్లభుని తిరుప్రతిష్ఠ దేవన ప్రగడ చేయించినాడు. ఆ సమయంలో విరియాల నాగసానమ్మ ఆమల్రాజు, ముమ్మడిరాజులతో కలిసి రేంబర్తినుండి పమ్మికి వచ్చి దేవన ప్రగడను దేవుని కైంకర్యములకు నెలసరి అయ్యే ఖర్చును అడిగి తెలుసుకున్నది. 

దేవుని అంగరంగ భోగాలకు, మండపం వేయించడానికి, తిరువగౌడు పెట్టించి, అఖండ దీపము, మొదలైనవి రక్తాక్షి సంవత్సరం మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు పెట్టిన వృత్తులకు, సమస్తమైన వృత్తులు నడుపుటకు గంధసిరిలో 1, వల్లభి వద్ద 1, కొండపల్లిలో 1, నాచేపల్లిలో 1, పండేరంగంబల్లిలో 4 మొత్తం 20 వృత్తులు సమర్పించినారు. చలివేంద్రం కొరకు కొండపల్లి పొలం, చిఱుమఱ్ఱి పండ, ఈగుంబల్లి, ముప్పడికుంటలో, మాధవకుంట, పాలిమావిండితోట, బీరుమువారి కుంటల ను ఇప్పించినారు. ఇంకా పూతోట సనికెదేవయ భక్తుడు ప్రతిరోజు పూజకు 50 చేమంతి పూవులనిచ్చేట్లు ఏర్పాటు చేసెను. అఖండ దీపారాధన పెట్టించెను. దీప కంబానికి మోదాల కుర్మ మలెబోయిన కుంటను, రుదురన్న ప్రగడ ఎఱ్ఱింజెరువును ఇచ్చినట్లు తెలుస్తుంది. 

- Advertisement -

ఇదంతా రాజులు నిర్ణయించిన క్రమంగా చెప్పబడింది.ఈ క్రమాన్ని తప్పినవారు వెలివేయబడతారు. బ్రహ్మహత్యాది దోషాన పడతారని, కోతి కడుపున పుడతారని శాపోక్తులు ఉన్నాయి. 

శాసనం మూడవ పక్క దేవునికి అంగభోగాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. దేవర తాంబూలానికి పోకలు నిత్యం రెండు చొప్పున 4,770, ఆకులు 4,720, ఉపహారానికి పప్పు, పెసలు, చాతుర్మాస్య, ఏకాదశులకు సంబంధించి జాగరం బియ్యం, నూలు, బ్రాహ్మణ దక్షిణకు ఆఱపుట వార్ద బియ్యం, తిరుపణ్యాలకు (నైవేద్యాలకు) పెట్టే వేఱు వడ్లు, శ్రీ జయంతికి ఇప్పపూవు, నువ్వులు, చింతపండు, నెయ్యి, తరి పెసలు, పిండి కొమ్ములు, చందనం, మధ్యాహ్నం అభ్యంగనానికి పిండి వంటకు నెయ్యికి గాగం బియ్యం, పెసలు వంటివి మాసోత్సవాలు చేయించడానికి సమర్పించబడినవి. ఇంకా దేవర ఉపకరణాలు రెండు, పిడి వంట 1, చాపగలంతలు 2, కంచు కరటతులు 2, జయగంట 1, దేవనప్పకినిచ్చిన గంట 1, పెద్ద పళ్లెం 1, పిన్నపరెడ్డి ఇచ్చిన పెద్ద పళ్ళెం 1, ప్రాంతం పళ్లెం 1, శాసనం చివర ముడుంబ నరసింహాచార్యుల పేరు పేర్కొనబడినది. బహుశః ఈయన దేవస్థాన అధికారి కావచ్చు.

ఈ శాసనంలో అనేక విశేష అంశాలున్నాయి. శాసనం వేయించిన సమయంలో గణపతిదేవుడు రాజ్యపాలన చేస్తున్నాడు. ఈ శాసనంలో గణం రుద్ర(దే)వ మహారాజులుగా పేర్కొనబడ్డాడు. విరియాల నాగసానమ్మ శ్రీమన్మహా సామంతగా పేర్కొనబడింది. కాకతీయుల కాలంలో స్త్రీలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకున్నారు. రాజ్య వ్యవహారాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్వహించడంలో, రాజకీయ, సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక వ్యవస్థలో తమ స్థానం సుస్థిరపరచుకున్నారు. కామసాని, ఎఱకసాని, మైలమ, కుందమాంబ, రుద్రమదేవి.. ఇట్లా ఎందరో తమ దాతృత్వంతో ప్రజలకు అనేక సౌకర్యాలను కల్పించారు.

– డాక్టర్‌ భిన్నూరి మనోహరి

9347971177

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పమ్మి శాసనం
పమ్మి శాసనం
పమ్మి శాసనం

ట్రెండింగ్‌

Advertisement