తొలిపొద్దయి ఉదయించే సూరీడతడు
కాలుతున్న కడుపుల్లో.. బుక్కెడు బువ్వయి
ఆకలినితీర్చే అన్నదాత అతడు
స్వేదపు చుక్కలను నీటిదారలుగా పారించి
పుడమితల్లి ఎదపై మెతుకుపూలను పూయిస్తాడు!
కాలం కనికరించకపోయినా
పెట్టుబడి కొండంత పేరుకుపోయినా
కారం బువ్వతో కడుపునింపుకొని
విశ్వానికి పంచభక్ష పరమాన్నాలను అందిస్తాడు!
ఊరిపోలిమేరలన్ని పచ్చగాఉన్నాయంటే
ఈ కర్షకుడి పనితనమే
తూములు కాలువల్లో పారుతున్న జలం
రైతన్న నాటిన విత్తును ముద్దాడాలని
పోటీపడి పరుగులుతీస్తున్నది
పంటపొలాల్లో ఉదకమంతా మొదట తాకేది
సేద్యగాడి పాదాలనే..
జొన్నకంకుల చుట్టూ తిరుగుతున్న పిచ్చుకలన్నీ
ముచ్చటించేది పంటకాపు గురించే
పురుడుపోసుకుంటున్న వరిపైరులన్ని
తలచుకునేది క్షేత్రజీవుడినే
పాలపొంగుళ్ల పూస్తున్న పత్తి అంతా
మదినిండా నింపుకొనేది వ్యవసాయదారుడినే
చీడపీడలన్నీ తొలిచేది ఏ కాయనో పండునో కాదు
నేద్యకాడి హృదయాన్నే..!
అవి అన్నం పెట్టే చేతులు
ఆ హస్తాలకిపుడు సంకెళ్లు బిగిస్తున్నారు
కొత్తచట్టాలను తీసుకొచ్చి
సేద్యగాడి మెడకు ఉరితాళ్లను పేనుతున్నారు
కాయ కష్టాన్ని నమ్ముకున్న రైతన్నకు
అభయ హస్తాలై కన్నీరు తుడుద్దాం
రైతన్నకు అండదండై నిలుద్దాం..!
అశోక్ గోనె
9441317361