e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home సాహిత్యం 32రోజులు..మెట్లు.. కథలు..

32రోజులు..మెట్లు.. కథలు..

  • 22 తెలంగాణ సాహిత్య ప్రస్థానం

రైతు చెలకలో దొరికిన సింహాసనాన్ని తెచ్చి మంచి రోజు చూసి ఆ సింహాసనాన్ని అధిష్ఠించబోతాడు భోజరాజు. ఆ సింహాసనానికి 32 మెట్లు.. ఒక్కో మెట్టు మీద ఒక బొమ్మ ఉంటుంది. భోజరాజు సింహాసనం మెట్లు ఎక్కుతుండగా మెట్టుమీది బొమ్మ.. ‘నీకు విక్రమాదిత్యుని సాహస, ఔదార్య గుణాలు ఉంటేనే ఈ సింహాసనం ఎక్క’మని అంటుంది. ఇలా 32 రోజులు ఆ బొమ్మలు విక్రమార్కుని గుణాలను గురించి 32 కథలు చెప్తాయి. 32 రోజులు గడిచిపోతాయి. అందుకే ఈ గ్రంథానికి ‘సింహాసన ద్వాత్రింశిక’ అని పేరు.

కొఱవి గోపరాజు సరళమైన, ధారాళమైన శైలిలో కథాకథన నైపుణ్యంతో ఈ కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో సమకాలీనమైన సామాజిక విషయాలెన్నో వర్ణించబడినాయి. శకునాలు, స్వప్నఫలాలు, చౌర్య కళలు, జూదం, చదరంగం, జ్యోతిష్యం, గ్రహ శాంతులు, ఇంద్రజాలం, సురతంత్రం, చేపల్లోని రకాలు, సాముల్లో ఉండే భేదాలు, పట్టుబట్టల్లో రకాలు, పక్షుల వేటవిధానం, రత్న పరీక్ష వంటి విషయాలెన్నింటి గురించో గోపరాజు చర్చించాడు. దాంతో ఈ కావ్యం ఒక విజ్ఞానకోశంగా ఉంది. గోపరాజుకు వివిధ విషయాల్లో ఉన్న ప్రవేశాన్ని చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంది.
గోపరాజు తన కావ్యం ‘అనువాదం’ అని చెప్పాడు. కాని సంస్కృతంలో వివిధ ప్రాంతాల్లో వివిధ ‘సింహాసన ద్వాత్రింశిక’ కథలు ప్రచారంలో ఉన్నాయి. అతడు దేన్ని అనుసరించాడో, ఎంతవరకు అనుసరించాడో నిర్దిష్టంగా చెప్పలేం. కానీ దీనిలో అనేక విషయాల పరిచయం అతని స్వంతమే అని చెప్పాలె. ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ రాసేటప్పుడు ఈ కావ్యం తనకు ఎంతగానో
ఉపయోగపడిందని చెప్తూ సురవరం ప్రతాపరెడ్డి ప్రశంసించారు.

- Advertisement -

మడికి సింగన క్రీ.శ. 1400-1450 ప్రాంతం వాడు. తిక్కన సోమయాజికి కొడుకు కొమ్మన. అతని కూతరు కట్టాంబిక. కట్టాంబిక కుమారుడు మడికి సింగన. కాకతీయ వంశం అంతరించిన తర్వాత ముస్లింల దాడులను ఎదుర్కోవడానికి ముసునూరి ప్రోలయనాయకుడు, ప్రోలయ వేమారెడ్డి, రేచర్ల సింగమ నాయుడు ముగ్గురూ ఏకమైనారు. ఆ తర్వాత సింగమనాయుడు రాచకొండ ప్రాంతాన్ని, ప్రోలయ వేమారెడ్డి కొండవీటి ప్రాంతాన్ని, ప్రోలయ నాయకుడు ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ ప్రాంతాలను పరిపాలించారు.

ప్రోలయ నాయకుని మరణానంతరం అతని పినతండ్రి కొడుకు కాపయ ఉత్తరాంధ్ర నాయకుడుగా ఉన్నాడు. ఉత్తర తెలంగాణలో యుద్ధాలు చేసి కొన్ని ప్రాంతాలను ఆక్రమించాడు. ఉత్తరాంధ్రలోని రాజమహేంద్రవరానికి తన పినతండ్రి కొడుకు అనపోతనాయున్ని రాజప్రతినిధిగా నియమించాడు.
ఇతని దగ్గరనే సింగన తండ్రి అయ్యలామాత్యుడు మంత్రిగా ఉన్నాడు. కాపయ బంధుప్రీతి ఉన్నవాడు. కరీంనగర్‌ మండలంలోని రామగిరి దుర్గాన్ని జయించిన తర్వాత కాపయ తన మేనకోడలి భర్త ముప్పభూపాలుడిని ఆ దుర్గానికి అధిపతిని చేశాడు. రామగిరి అబేధ్యమైన దుర్గం. 1356లో అనపోతనాయుడు మరణించిన తర్వాత అయ్యలార్యుడు తెలంగాణకు వచ్చాడు. అతడి కొడుకు మడికి సింగన ముప్పభూపాలుని ఆస్థానంలో కవిగా ఉన్నాడు. ఆ విధంగా మడికి సింగన తెలంగాణ కవి అయ్యాడు.

మడికి సింగన ప్రతిభ గల కవి. సంస్కృత భాగవతంలోని దశమ స్కంధాన్ని అనువదించాడు. ఇది పోతన భాగవతం కన్నా పూర్వం రచింపబడింది. ‘శ్రీ కృష్ణుని లీలలు’ భక్తి కథలు ఉన్న ఉత్తమ రచన అది. దాన్ని సింగన తెలంగాణలో ఎక్కువగా ప్రచలితమైన ద్విపద ఛందస్సులో రచించాడు. అతని శైలి భక్తి రసోచితంగా అంత్యప్రాసలతో లలిత మధురంగా నడిచింది. సింగన మరో రచన ‘పద్మపురాణోత్తర ఖండం’. ఇది 11 ఆశ్వాసాల కావ్యం. దీనిలో రామాయణం, భాగవతం కథలు ఎక్కువగా ఉన్నాయి. పై రెండు రచనలను సింగన ముప్ప భూపాలుని మంత్రి వెలిగందల కందనామాత్యునికి క్రీ.శ.1440 ప్రాంతంలో అంకితంగా ఇచ్చాడు.

సింగన ‘వాశిష్ఠ రామాయణం’ను రచించాడు. దీనికి ‘యోగ వాశిష్ఠం’ అని కూడా పేరు. దీనిలో శ్రీరామునికి వశిష్ఠుడు ఉపదేశించిన వేదాంతం ఉన్నది. కొన్ని ఉపాఖ్యానాలు కూడా ఉన్నాయి. ఈ కావ్యం సంగ్రహ రూపంగా నడిచింది. దీన్ని ఈ కవి అహోబిల నరసింహస్వామికి అంకితమిచ్చాడు. సింగన మరో రచన ‘సకల నీతి సమ్మతం’. ఇది తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి సంకలన గ్రంథం.

కామందకం, పంచతంత్రం, నీతిసారం, నీతి తారావళి, బద్దెన నీతి, భారతం.. మొదలైన 17 గ్రంథాలనుంచి నీతి, రాజనీతి బోధకమైన పద్యాలను సేకరించి సింగన ఈ సంకలన గ్రంథాన్ని కూర్చాడు. సింగన తాను రచించిన 39 నీతి, రాజనీతి పద్యాలను, కృతిభర్త కందనామాత్యుడు రచించిన నీతి తారావళిలోని పద్యాలను ఈ సంకలనంలో చేర్చాడు. అవి ఐదు ఆశ్వాసాలు కానీ, మూడు ఆశ్వాసాలు మాత్రమే లభిస్తున్నాయి. దీన్ని కవి కేశవస్వామికి అంకితంగా ఇచ్చాడు. ఈ పుస్తకం కాగితం మీద రాసిన రాతప్రతి వనపర్తి రాజావారి పుస్తక భాండాగారంలో మానవల్లి రామకృష్ణ కవికి దొరికింది. దాన్ని సంస్కరించి వనపర్తి రాజావారి ముద్రణాలయంలోనే ప్రచురించారు.

ముదిగంటి సుజాతారెడ్డి
99634 31606

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana