కాలం కరచాలనం చేయకముందే
చెమట నాగలి మట్టిలోకి దిగుతుంది దైవదూతలా
ఇరువాళ్ళు దున్నేసరికి స్నానం చేస్తాయి బట్టలు
ఎదురుచూపుల కండ్లు కాయలు కాయకముందే
మబ్బులు పలకరించి మర్యాద చూపితే
భూమి నీళ్లతో కడుపు నింపుకొంటది
విత్తనాలు ముగ్గులోకి దిగుతాయి మొలకెత్తడానికి
కలుపు పీకలను చెమట కత్తిరించకపోతే
చినుకులతో పండేది చీదరే
చినుకులు, చెమటలు కలిసి కాపురం చేస్తే
కడుపులు నింపే పంట లెక్కలకందదు..!
గట్టు మీద కూసొని గుడ్లురిమితే, కునికిపాట్లుపడితే
శ్రమ నీళ్లు కండ్లల్లో ఊరవు
అనుభూతి మనసు ముకుడులో దేవదు
పప్పులో ఉప్పులాగానైనా
కష్టానికి కనీసం చేయందించాలి
చెమట మర్మం తెలుసుకొని మసలాలి
వారితో ముచ్చట్లు కలుపుకొని సద్దితింటే
అనుభవాలు చేదుకోవచ్చు!
కడుపులో సల్ల కదలకుండా ఉంటే
అక్షరాలు కాళ్లు సాపుకోవడం కష్టమే
ఆలోచనలు మత్తులో జోగడం
కలం కాళ్లు చేతులు కట్టేయడమే!
జీవుల చెమట వాసన ఆవిరవకముందే
కండ్లు పసిగట్టాలి మూలాల్లోకి వెళ్లి
నాలుక రుచి చూడాలి దూడను నాకే తల్లి ఆవులా
కూలీల చేతుల్లో కొడవళ్ళుగా మారితేనే
హృద్యమైన పద్యాల పంట కోయగలిగేది!
అనుభవాల చెమట బానిసగా మారితే
అక్షర వీరత్వాన్ని తప్పుదోవ పట్టిస్తుంది
సౌందర్యాల లోగిలిలో సొంగ కారుస్తుంది
నిండైన మేకప్‌తో మారుతుంది వేశ్యలా..!
మద్యం మంచినీళ్లలా తాగి
సెంట్ స్ప్రే చేసుకునే శరీరాలకు
ముక్కు మూసుకునేంత కంపు చెమట
మట్టంటితే మసంటినట్లు తలిస్తే
మనిషితనం పెచ్చులూడి మరకలు ఏర్పడినట్లే
చెమటతో తడిసిన నేలలో జీవిస్తేనే
శ్వాసాడే జీవితాలను ప్రసాదించేది..!
కొమురవెల్లి అంజయ్య
98480 05676