e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home సాహిత్యం కవిమర్శకుడు

కవిమర్శకుడు

పాండిత్యానికి, సృజనశక్తికి పొత్తు కుదరదంటారు. పండితుడు ఎన్నటికీ కవి కాలేడంటారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మకమైన డాక్టర్‌ దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని స్వీకరించిన ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఈ అభిప్రాయాన్ని పరాస్తం చేశారు. తెలుగు, సంస్కృత భాషా సాహిత్యాల్లో లోతైన పాండిత్యాన్ని సముపార్జించడమే గాక ఉభయ భాషా సాహిత్యాల్లో కావ్యగతమైన ప్రయోగమర్మాలను, విశేషాంశాలను గురించి వ్యాఖ్యానించగలిగిన ప్రజ్ఞ ఒకవైపు, కలకాలం నిలిచిపోయేవిధంగా రసరమ్య కవిత్వం, విమర్శ చేసిన శక్తి ఆయన సొంతం.

ఉమ్మడి పాలమూరు జిల్లా నాటి కొల్లాపూర్‌ తాలుకాలోని కాళూరులో 1945, ఏప్రిల్‌ 7న రైతు కుటుంబంలో జన్మించిన శివారెడ్డి బాల్యదశలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయారు. కృషినే నమ్ముకొని ఎదిగారు. ఆయనకు సాహిత్య సృజన, వ్యాసాంగానికి అనుకూలమైన వాతావరణం ఎప్పుడూ లేదు. ఎంఏ తెలుగు (1971)లో పూర్తిచేసి ఓయూ తెలుగుశాఖలో అధ్యాపకునిగా చేరినప్పటికీ కుదురుగా సాహిత్య జీవనం సాగలేదు. ఎంఏ పూర్తి కాగానే ‘సురవరం ప్రతాపరెడ్డి జీవి తం, సాహిత్యం’పై రాసిన గ్రంథానికి నాటి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

- Advertisement -

కవితా సృజన ఆరంభంలో దాశరథి, సినారె, జాషువా, తిలక్‌, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి వంటి మహా మహులకంటే గొప్ప కవిత్వం రాసేంతవాడినా అన్న భావన అడ్డుగా నిలిచింది. అయితే మంచి కవిత్వం, విమర్శ చేయాలన్న మథనం మాత్రం ఆయనలో కొనసాగింది. ఆ మథనంలోంచి పుట్టిన ‘పూలకారు’ (1983) కవిత్వం,‘రసరేఖలు ’ (2000),‘తిక్కన రసభారతి’ విమర్శా గ్రంథాలు, ‘ముసలమ్మ మరణం’ వ్యాఖ్య, ‘భావదీపాలు’(ఆకాశవాణి భావన ప్రసంగాల సంపుటి), ‘ఆంధ్ర మహాభారతంలో రసపోషణం’ పరిశోధన గ్రంథం మొదలైనవి గణనీయమైనవి.

ఏదిరాసినా అలంకారికత, అనుభూతి, ఆహ్లాదాన్ని పంచిపెట్టే హృదయం గమమైన అభివ్యక్తి నైపుణ్యం ఉండాలకున్నారు శివారెడ్డి.భారతీయాలంకారికులు చెప్పినట్లు రసం గురించి ప్రపంచంలో మరెవరూ చెప్పలేదు. ఆ అభిప్రాయం తన అధ్యయనంలో బలపడటంతో శివారెడ్డి పీహెచ్‌డీలో మహాభారతంలోని ‘రసపోషణం’అంశాన్ని ఎన్నుకున్నారు. సాధికారిక విశ్లేషణతో, భారతంలోని విరాటోద్యోగ పర్వాల్లోని నవరసపోషణను సోదాహరణంగా విశ్లేషించి భాషాపరంగా ఆద్యం తం శిల్పంలా చెక్కి సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించారు. ‘జటిల విషయాన్ని రసగుళికగా మార్చారు’ అని తన గురువు, పరిశోధన పర్యవేక్షకులు సినారె చేత ప్రశంసలందుకున్నారు. ఈ గ్రంథాన్ని తెలంగాణ సారస్వత పరిషత్తు ఇటీవల పునర్ముద్రించింది.

1983లో 42 పద్య, వచ న కవితా ఖండికలతో ఎల్లూ రి వెలువరించిన ‘పూలకారు’ ఆధునిక తెలుగు కవితా పర్యావరణానికి పూలకారు ను కొనితెచ్చిందనే చెప్పాలి. కవిత్వం లలితకళల్లో శ్రేష్ఠమైన కళ అని పెద్దలు చెప్పిన మాటలను రుజువు చేసే రసనిర్భరమైన, అనుభూతి ప్రధానమైన, సౌందర్యతత్వ ప్రధానమైన కవితలు ‘పూలకారు’ లో ఉన్నాయి. ‘వేదన ఒక పరిశోధన/ అశ్రువు అది అమృతబిందువు/ విషాద నిశీథంలో కఠోర హృదయం కరిగి సేలయేరవుతుంది/ అందుకే సౌఖ్య శాపానికి గురికావద్దు/ భోగభాగ్యాలకు బలికావద్దు’ (అమృతసీమ) ఉదాహరణకు ఒకటి మాత్రమే.

ఆయన విమర్శాగంథం ‘రసరేఖలు’ ఉత్తమ విమర్శగా పేరొందింది. ప్రాచీన సాహిత్యమైనా, ఆధునిక సాహిత్యమైనా వస్త్వాశ్రయమై ఉండాలన్న నియమం చాటుతుంది. ‘కవులు విమర్శవైపు చూడ టం లేదు. విమర్శకులు కవి త్వం రాయడం లేదు. దానివల్ల అసమగ్రత రూపుకడుతున్నద’ని శివారెడ్డి అంటారు. సాహిత్య విమర్శలో వస్తువును గురించిన వివరాలే తప్ప ఛందో అలంకార ప్రయోగ విశ్లేషణ, సందేశం గురించి చెప్పడం లేదని ఆయన అభిప్రాయం. ఎక్కువ చదువుతుంటారు ‘నేను చదువుకోనప్పుడు రాశాను’ అని ఒక మిత్రుడన్నమాటను రచనలు ఎక్కు వ చేయకపోవడానికి అన్వయించుకుంటా రు. ‘సురవరం ప్రతాపరెడ్డి జీవితం, సాహిత్యం’ అనే పేరుతో 1973లో వెలువరించిన ప్రామాణిక గ్రంథం (ఇటీవల సురవరం 125 వ జయంతి సందర్భంగా పునర్ముద్రించారు) ఎల్లూరి శివారెడ్డి పరిశ్రమకు, పరిశోధనా పటిమకు పెట్టింది పేరు.
(శివారెడ్డికి రాష్ట్రప్రభుత్వం ‘దాశరథి పురస్కారం’ ప్రకటించిన సందర్భంగా..)

డాక్టర్‌ జుర్రు చెన్నయ్య
94400 49323

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana