e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home ఎడిట్‌ పేజీ ద్రావిడ భాషల తల్లివేరు హరప్పా!

ద్రావిడ భాషల తల్లివేరు హరప్పా!

హరప్పా, మొహెంజేదారోల్లో విలసిల్లిన సింధూ నాగరికతకు దక్షిణ భారతదేశానికి సంబంధం ఉందా..? సింధూ ప్రజలు మాట్లాడిన భాషనే దక్షిణాది భాషలకు తల్లి వేరా..? అవుననే అంటున్నారు పురావస్తు పరిశోధకురాలు బహతా అన్సుమాలి ముఖోపాధ్యాయ్‌.

దాదాపు 200 ఏండ్లుగా మిస్టరీగా ఉన్న సింధూనాగరికత లిపిలోంచి ఒక పదాన్ని పరిశోధించి ఆమె కొత్త ప్రతిపాదన చేశారు. తద్వారా మన పూర్వీకులకు సంబంధించిన జీవనాన్ని తెలుసుకోవటానికి ఒక మార్గం వేశారు.

- Advertisement -

సింధూ నాగరికతలో జీవించిన ప్రజ లు ఏ భాషలో మాట్లాడుకునేవారన్న విషయంపై పు రావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు కొన్నేండ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. 19వ శతాబ్దంలో వెలుగులోకి వచ్చిన ఈ కాంస్య నాగరికత గురించి ఈ విషయంలో ఇప్పటి వరకూ స్పష్టత లేదు. కార ణం.. సింధూ లిపిని ఇప్పటివరకూ ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. ప్రఖ్యాత సైన్స్‌ జర్నల్‌ ‘నేచర్‌’లో ప్రచురితమైన ఓ పరిశోధన వ్యాసం ఈ చీకటిపై కొంత వెలుగును ప్రసరింపజేసింది.

సింధూ నాగరికతకు దాని సమకాలీనమైన సుదూర ప్రాంతాల్లోని ఇతర నాగరికతలకు మధ్య జరిగిన సాంస్కృతిక వినిమయం నుంచి కొన్ని సూక్ష్మ ఆధారాలను తీసుకొని ఈ వ్యాస రచయిత బహతా అన్సుమాలి ముఖోపాధ్యాయ్‌ కొత్త ప్రతిపాదన చేశారు. సింధూ ప్రజలు మాట్లాడిన భాష ప్రొటో-ద్రవిడియన్‌ కావచ్చని ఆమె చెబుతున్నారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న దక్షిణాది భాషలకు మూలంగా ఉన్న భాష ను ప్రొటో-ద్రవిడియన్‌ అని పిలుస్తారు. సింధూ నాగరికత తాలూకు ప్రజలు కేవలం వాయవ్య భారతంలోనేగాక.. ఉత్తరాదిలో పలుచోట్ల నివసించారని, అనంతరకాలం లో వారు దక్షిణాదికి వలస వచ్చారన్న ప్రతిపాదన కూడా అన్సుమాలి చేస్తున్నారు.

ఈ ప్రతిపాదనకు ఎలా వచ్చారు?
సింధూ ప్రజలకు పర్షియన్‌ గల్ఫ్‌, మెసొపొటేమియా ప్రజలకు మధ్య విస్తారంగా నడిచిన వ్యాపార కార్యకలా పాలపై అన్సుమాలి దృష్టి పెట్టారు. సింధూ మూలాలున్న పదాలేమైనా అక్కడి ప్రాచీన గ్రంథాల్లో దొరుకుతాయా అని పరిశోధించారు. దీంట్లో ఉన్న తార్కికత (లాజిక్‌) ఏమిటంటే, స్థానికంగా తయారుకాని ఒక వస్తువును దిగుమతి చేసుకొని వాడుతున్నప్పుడు దానిని విదేశీ పేరుతోనే పిల్చుకుంటారు అన్నది ప్రాతిపదిక. ఉదాహరణకు.. సెల్‌ఫోన్‌/మొబైల్‌ఫోన్‌ విదేశాల్లో తయారై (తొలిరోజుల్లో) మన దగ్గరికి వచ్చిన వస్తువు కాబట్టి.. దానికి సెల్‌ఫోన్‌/మొబైల్‌ఫోన్‌ అనే పదమే మనదేశంలోనూ స్థిరపడింది. ఈ కోణంలో జరిపిన పరిశోధనలో.. ప్రాచీన మెసొపొటేమియా ప్రజలు మాట్లాడిన ‘అక్కడయన్‌’ భాషలో పీరు, పీరి అన్న రెండు పదాలు అన్సుమాలి దృష్టిని ఆకర్షించాయి. ఏనుగు, ఏనుగుకు సంబంధించినవాటిని సూచించటానికి ఈ పదాలను వారు ఉపయోగించేవారు. ఏనుగుదంతంతో చేసే కళాకృతులను ప్రాచీన పర్షియన్‌ భాషలో పీరస్‌ అని పిలిచేవారు. పలు ద్రవిడ భాషల్లో ఏనుగు, ఏనుగుకు సంబంధించిన వాటిని ‘పీలు, పెల్లా, పల్లా, పల్లవ, పిల్లువం, పీల్లూరు’ అనే పదాలతో పిలుస్తారు. క్రీస్తుపూర్వం 3,000-2,000 మధ్య మెసెపొటేమియా ప్రాంతానికి చేరిన ఏనుగు దంతాల కళాకృతులు సింధూ నుంచి వచ్చినవనేనని పలు పురావస్తు ఆధారాలు తెలియజేస్తున్నాయి.

మరోవైపు, భాషాశాస్త్రం ప్రకారం- పదాల పరిణామాన్ని చూసినప్పుడు.. పిరు, పిలు వంటి పదాలు ద్రవిడ భాషల్లో దంతాలు అనే వాటిని సూచించటానికి ఉపయోగించిన ‘పల్‌, పెల్లా, పల్లు, పలు’ వంటి పదాలతో సంబంధం కలిగి ఉన్నాయని తేలింది. ఇప్పటికీ తెలుగులో దంతాలను పళ్లు అనే పిలుస్తున్న విషయం తెలిసిందే. అంటే ‘అక్కడయన్‌’ భాషలో ఏనుగు దంతాలకు ఉపయోగించిన పదాలు సింధూ నాగరికతవేనని దీనిద్వారా తెలుస్తున్నది.

అయితే, ద్రావిడ భాషల్లో ‘ల’ అనే అక్షరం ‘అక్కడయన్‌’లో ‘ర’ అనే అక్షరంగా మారటానికి కారణాన్ని తెలియజేస్తూ.. మెసొపొటేమియా, సింధూ మధ్య వ్యాపార సంధానకర్తలుగా అప్పట్లో పర్షియన్లు వ్యవహరించే వారని, వారి వల్ల ఆ ఉచ్ఛారణ మారిపోయి ఉంటుందని అన్సుమాలి వివరించారు. అలాగే, సంస్కృతంలో ఉన్న ‘దంతిన్‌’ అనే పదం ఇండో-ఆర్యన్‌, ఇండో-ఇరానియన్‌ పదమైన ‘దంత’ పదానికి మూలంగా నిలుస్తున్నదని ఆమె పేర్కొన్నారు. ఈ విధంగా సింధు నాగరికత ప్రజలు ప్రొటో-ద్రవిడియన్‌ భాషను మాట్లాడి ఉంటారని అన్సుమాలి ప్రతిపాదించారు.

సింధు నాగరికతకు, దక్షిణ భారతదేశానికి ఉన్న సన్నిహిత సంబంధాలపై గతంలోనూ అధ్యయనాలు వెలువడ్డాయి. హెల్సెంకీ యూనివర్సిటీ పరిశోధకుడు ఆస్కో పార్పోలా.. సింధూ భాషలో వాడిన సంకేతాలను, ఆధునిక దక్షిణభారత భాషల్లోని పదాలను పోల్చుతూ 2010లో ఒక వ్యాసం రాశారు. 2019లో ప్రఖ్యాత జర్నల్‌ ‘సైన్స్‌’లో ఒక పరిశోధన వ్యాసం ప్రచురితమైంది. డీఎన్‌ఏ ఆధారంగా ఈ పరిశోధన జరిపారు. ప్రొటో-ద్రవిడియన్‌ భాషలు వాయవ్య భారతం నుంచి దక్షిణ భారతానికి క్రమంగా విస్తరించాయని దీంట్లో పేర్కొన్నారు. 2018లో వచ్చిన ‘ఎర్లీ ఇండియన్స్‌’ పుస్తకంలో రచయిత టోని జోసెఫ్‌.. క్రీస్తుపూర్వం 1900లో హరప్పా నాగరికత క్షీణించటానికి పూర్వమే ఆ ప్రాంతాల ప్రజలు దక్షిణాదికి తరలివచ్చారని తెలిపారు.

సింధూ ప్రజలు మాట్లాడిన అనేక భాషల్లో ప్రొటో-ద్రవిడియన్‌ ఒకటి కావచ్చని అన్సుమాలి అంటారు. అయితే, ద్రవిడియన్‌ భాషలు ప్రస్తుతం ప్రధానంగా దక్షిణాదికే పరిమితం అయినప్పటికీ.. భారతదేశంలో పలుప్రాంతాల్లో ఇప్పటికీ ఉనికిలో ఉన్నాయని ఆమె తెలిపారు. ఈశాన్యంలోని కురక్స్‌, మాల్టో; మధ్య భారతంలోని కొలామి, నాయ్‌కి, పార్సి, ఒల్లారి, గడబ; వాయువ్య భారతంలోని బ్రహుయ్‌ తదితర భాషలన్నీ ద్రావిడ భాషా కుటుంబానికి చెందినవేనని తెలిపారు. అంటే ద్రవిడ భాష మాట్లాడేవాళ్లు సింధూతోపాటు ఆ కాలంలోనే ఉత్తరాది అంతటా విస్తరించి ఉండవచ్చని పేర్కొన్నారు.

-కె.వి.రవికుమార్‌
91827 77044

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement