కాలు కదపలేను
గడప దాటలేను
వాకిలి కేసి చూస్తూ నిలబడతాను
ఎప్పటికైనా ప్రపంచంలోకి వస్తానా
చౌరస్తాను పలకరించి ఎన్నాళ్ళయిందో
‘దో మే ఏక్ ఎమ్టీ’
ఇరానీ చాయ్ రుచి చూసి
ఎంత కాలమైందో
ఉదయపు మెలకువ నుంచి
రాత్రి కునుకు దాకా
కాలం ప్రవాహంలా హరించుకుపోతున్నది
ఏం చేస్తున్నావ్ అంటారెవరో
నలుగురు గొప్ప కవుల్నీ
నాలుగు మంచి కవితలనీ చదువుతున్నా
నాలో ఎగిసే భావాలకు
ఆకారాలను దిద్దుతున్నా
అంతకన్నా చేసే ఘనకార్యమేమున్నది
అయినా ఏమి చేస్తే ఏమున్నది
ఎప్పటికైనా బయటకు వస్తానా
మనుషులలో కలుస్తానా
మనసు విప్పకుండా
ఎదుటివాడి
మనసు తెలుసుకోకపోతే
ఇంట్ల వుంటే ఏంది
మందిల వుంటే ఏంది
పెద్ద ఫరక్ వడేది ఏముంది!