e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home ఎడిట్‌ పేజీ రామప్ప.. శిల్పి పేరే

రామప్ప.. శిల్పి పేరే

‘రామప్ప శిల్పి పేరు కాదు’ అని ముందే నిర్ణయించుకొని దానికి కావలసిన ఆధారాలు వెతికే పనిలో పడినట్లు ద్యావనపల్లి సత్యనారాయణ గారి వ్యాసం ఉంది. ఆయన వ్యాసం ఆరంభంలోనే ‘దేనికైనా శాస్త్రీయ ఆధారాల వెలుగులో నిర్ధారణకు రావలసి ఉంది’ అని వక్కాణించిన సత్యనారాయణ గారు ఏ శాస్త్రీయ ఆధారంతో ‘రామప్ప శిల్పికాదు’ అని తేల్చారో ఇందులో ఎక్కడా కనిపించదు.

మొదటి శేషాద్రి రమణ కవులు చెప్పిన సమాచారం ఏమంటే.. దూపాటి వేంకట రమణాచార్యులు శాసనాన్ని చదివి చాలా అమూల్యమైనదని చెప్పారు.కానీ దానిలో ఎక్కడా శిల్పి పేరు రామప్ప అని లేదని రాశారు. శిల్పి పేరు శాసనంలో ఎక్కడా లేకపోతే దూపాటి వారు అది శిల్పిపేరు కాదని ఎలా నిర్ధారిస్తారు. మన దేశంలో నూటికి 99 దేవాలయాల్లో శిల్పులు వారి పేర్లు ఎక్కడా రాసుకోలేదు. అంతమాత్రాన ఆ శిల్పులు లేనట్లా! రామప్పశిల్పి కాదు అని చెప్పడానికి ఇది శాస్త్రీయ ఆధారమా.. కానే కాదు.

- Advertisement -

ద్యావనపల్లి గారి వాదన ఏమంటే.. సమకాలీన గ్రంథాలలో రామప్ప గుడి శిల్పి పేరు లేదు. కాబట్టి అది శిల్పి పేరు కాదు అని. మన కవులు రాస్తే కట్టించిన ఆ రాజుల పేర్లు రాశారు కానీ, కట్టిన ఆ శిల్పుల పేర్లు రాశారా! అంతటి సహృదయతను చాటుకున్న పాపాన పోయారా. వీరు రాయలేదు కాబట్టి రామప్ప శిల్పి పేరు కాదని నిర్ధారణకు రావడం ఎలాంటి శాస్త్రీయం అవుతుంది. ఇది శాస్త్రీయ ఆధారం ఎందుకు అవుతుంది. ద్వావనపల్లి గారి తర్వాతి వాదన ఏమంటే.. గుడి రామలింగేశ్వరునిది. విష్ణుకుండిన కాలంలో అక్కడ రామలింగేశ్వరాలయం ఉండి ఉంటుంది. రామలింగేశ్వరాలయాన్నే ‘రామప్ప ఆలయం అని ఉంటారు’ అని ఊహించారు. అంతేకాదు ఆ కాలంలో తెలుగు, కన్నడ భాషలు కలిసి ఉన్నాయి ‘తెలుగన్నడం’లో రాముడిని రామ+అప్ప అని అంటారు. కాబట్టి ఇది రామాలయం అయి ఉంటుందని ఒక ఊహ చేశారు. ఇంకా ఏమంటారంటే.. మనం రాముడిని రామ+అయ్య అని కలిపి అన్నట్లుగా కన్నడం వారు అయ్యని అప్ప అంటారు కాబట్టి రామప్ప అవుతుంది కనుక రామలింగేశ్వరుని గుడిని ‘రామప్ప గుడి’ అని అన్నారు. అలా అనుకున్నా రామలింగేశ్వరాలయాన్ని రామలింగప్ప గుడి అని వ్యవహరించి ఉండాలి. కానీ లింగేశ్వరుడు అసలు దేవుడు. ఆయన పేరునే తీసివేసి ‘రామప్ప గుడి’అని ఎలా అంటారు. ఒకవేళ కన్నడం అలా అనే సంప్రదాయం ఉంటే కర్ణాటకలో ఏ రామాలయాన్ని అయినా రామప్ప గుడి అని అంటున్నారా? ‘రామాలయం’ అనే కదా అంటున్నారు. కాబట్టి సత్యనారాయణ గారిది ఏ మాత్రం పొసగని వాదన. కాబట్టి వీరి రామప్ప శిల్పి పేరు కాదు అని చెప్పే ఏ ఆధారమూ నిలిచేది కాదు.

రామప్ప గుడికి ఆ పేరు వందల ఏండ్ల నుంచి అనుస్యూతంగా వస్తున్న జానపదవాక్కు. జానపద సమాచారం కాలక్రమంలో గాథగా మారుతుంది. శిల్పి ఉం డటం యథార్థం. శిల్పి నిర్మాణం చేసి ఉండటం యథా ర్థం. శిల్పి పేరు ప్రఖ్యాతులు కాంచినవాడైతే ఆ శిల్పి పేరుపైన కట్టిన గుడిని ‘రామప్ప గుడి’ అని పిలవడం నాటి సాధారణ వాడుక కావడం సాధ్యమే. అంతేకాదు, ఆ గుడి కొద్దికాలంలో కట్టినది కాదు. దాదాపు నలభై ఏండ్లు పట్టిందనే ఆధారాలున్నాయని చరిత్రకారులు చెప్పారు. అంతకాలం ఒక ప్రధాన శిల్పి ఎందరో శిల్పు ల సహాయంతో కట్టిన గుడి అది. రామప్పకు ఏదైనా ప్రేమాయణం ఉండి ఉండవచ్చు. రాణి.. ఆ రాణి కూతురనేది కల్పన కావచ్చు. కానీ జానపదుల నోటిలో తరం నుంచి తరానికి ఒక సమాచారం వస్తే దాన్ని శాస్త్రీ య ఆధారం కాదని కొట్టి పారవేయడం సరైన పద్ధతి కాదు. ఆధునిక చరిత్ర రచన విధానంలో మౌఖిక ఆధారాలను కూడా శాస్త్రీయ ఆధారాలుగానే పరిగణిస్తారు. ‘Oral Tradition and Historical Methodol ogy’ అనే ప్రసిద్ధ గ్రంథమే ఉంది. కాకుంటే వాటిలో యథార్థం కావడానికి ఏయే అంశాలు పనికి వస్తాయి? దేన్ని కల్పనగా భావించవచ్చు అని చూస్తారు. ఇక్కడ అసలు శిల్పి అనే వాడు లేకుంటే జానపదుల కథలో నికి కానీ జానపదుల సమాచారంలోనికి కానీ రాదు. ఇక ప్రేమాయణం అధికంగా కల్పించినది కావచ్చు.

ఇదొక్కటే కాదు, సర్వాయి పాపన్న కథలోనూ నిజాం నవాబును ఎదిరించి యుద్ధం చేయడం ఒకరోజు రాజుగా గద్దెనెక్కడం ఈ కథంతా జానపద గాథగానే మనదాకా నేటితరానికి అందివచ్చింది. ఇందులో కల్పన ఉన్నా పాపన్న చారిత్రక వాస్తవంగా నేడు మనం గ్రహిస్తున్నాం. ఇంకా పరిశోధన సాగాలంటున్నాం. అతని కోట దానికి పాక్షిక సాక్ష్యం. ఇబ్రహీం కుతుబ్‌ షా హైదరాబాద్‌ సికింద్రాబాద్‌ల నడుమ చెరువు తవ్వించాడు. కానీ దానికి ప్రధాన ఇంజినీరు హుస్సేన్‌ పేరే స్థిరపడింది. ఆయన అక్కడి కార్మికులను బాగా చూసుకున్నాడు. దాంతో ఆయన దగ్గరుండి తవ్వించిన చెరువును అందరూ ‘హుస్సేన్‌సాగర్‌’ అని పిలిచారు. దానికి అదే పేరు స్థిరపడింది. కానీ ఇబ్రహీంకు ఆ పేరు రాలేదు.

సమ్మక్క, సారలమ్మ కథ.. ఒక ఐతిహ్యంగా నమ్మలేని మహిమలతో ఒక పురాకథగా మనముందు నిలిచింది. ఇందులో నమ్మదగ్గ శాస్త్రీయ ఆధారమేదీ మనకు దొరకదు. అంటే చరిత్రకారులు కోరుకునే శాసనాలు, నాణేలు, రాతప్రతులు, తాళపత్రాలు దొరకవు. కాబట్టి సమ్మక్క సారలమ్మ ఘటన జరగలేదు, వారు చారిత్రక వ్యక్తులు కారని సత్యనారాయణ గారు చెప్పగలరా. ఇం దులోని కల్పనను, పురాకథా సృజనను తీసివేసి చారిత్రక అంశాలనే గ్రహించి చరిత్ర నిర్మాణంలో వాటిని ఆధారంగా తీసుకోవడమే నేటి పద్ధతి. వ్యాసంలో ‘రామవాగు, లక్ష్మణవాగు అనేవి ఉన్నాయని వాటిమీద రామప్ప, లక్నవరం చెరువులు కట్టారని జానపద గాథ లు తెలుపుతున్నాయి’ అని చెప్పిన సత్యనారాయణ గారు వాటిని ఆధారంగా పరిగణిస్తూ రామప్ప శిల్పి కథ కూడా జానపద కథే అయినా దాన్ని నమ్మినవారు దీన్ని నమ్మకపోవడానికి కారణమేమిటి? నమ్మడానికి వీలు కాని ఆధారాలను పట్టుకొని శాస్త్రీయ ఆధారాలుగా చెప్పడానికి పూనుకున్నారు. కాబట్టి ‘రామప్ప శిల్పి పేరు కాదు’ అనే సత్యనారాయణ గారి వాదన చెల్లదు. జానపద స్రోతస్సులో తరాల నుంచి వస్తున్న సమాచారం రామప్ప శిల్పి అతను కట్టిన గుడి అనే. దీన్ని ‘శాస్త్రీయ ఆధారం కాదు’ అని చెప్పడం ఆధునిక చరిత్ర నిర్మాణ పద్ధతికి కూడా వ్యతిరేకం. కాబట్టి రామప్ప శిల్పి పేరు అనీ అతని పేరు పైన వచ్చినది రామప్ప గుడి అనే పరంపరా సమాచారం కాదనడానికి వీలులేని వాస్తవం.

ప్రొఫెసర్‌ పులికొండ సుబ్బాచారి
94404 93604

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement