e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home సాహిత్యం తల్లి కోసం.. తల్లి భాషలో మహాభారతం

తల్లి కోసం.. తల్లి భాషలో మహాభారతం

తల్లి కోసం.. తల్లి భాషలో మహాభారతం


15వ శతాబ్దం వరకూ ఒడిశాలో సంస్కృతమే రాజ్యమేలింది. ఆ కాలంలో సంస్కృతంలో కావ్యాలు వచ్చినా, అక్కడి ప్రజల భాషలో లేవు, వారికి అవి చేరలేదు. అప్పటివరకూ వారిదైన సాహిత్యం వారికి లేకుండా పోయింది. పైగా సంస్కృత ఆధిపత్యం అందరిలోనూ అలజడి రేపింది. ఆ సమయంలో 15వ శతాబ్దం తొలిపదుల్లో శూద్రమునిగా పేరు పొందిన సారళాదాస్‌, ఒక రైతుబిడ్డ ఒడియా వాడుక భాషలో అద్భుతమైన కావ్యాలు రాశాడు. అతనితోనే ఒడియా సాహిత్యం ఆరంభమైందని చెప్పుకోవచ్చు. అతన్ని ఆదికవిగానే ఒడియా వాసులు భావిస్తారు.

నేటి కటక్‌కు తూర్పున 30 మైళ్ల దూరంలో ఉన్న జంకడ దగ్గర కనకపుర గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో సారళాదాస్‌ జన్మించారు. జగత్‌సింగ్పూర్‌ జిల్లాలో ఒక సిద్ధిక్షేత్రం అది. అందుకనే అతని అసలుపేరు సిద్ధేశ్వరదాస్‌, లేక సిద్ధేశ్వర పరిడాగా ఉండింది. గంటం కంటే ముందు నాగలే పట్టాడు. ‘నేను మూర్ఖున్ని, పండితుడను కాను, శాస్ర్తాలు నాకు తెలియవు, మూర్ఖుల మధ్యే రాత్రులూ పగలూ గడిపేవాడిని’ అని తనకుతానే చెప్పుకొన్నాడు. కావున, ఎక్కువగా చదువుకోలేదనే అర్థం చేసుకోవచ్చు. అయితేనేం, అసాధారణమైన ఆత్మవిశ్వాసం కళాభిరుచితో మహాకావ్యాలు రాశాడు. అందులో అతను వాడిన భాషను బట్టి అప్పటికే ఆ భాష సాహిత్యానికి అత్యంత అనువైనదిగా తయారైందని అర్థమవుతుంది. ఆ కావ్యాలు, ప్రజల కోసం అతను రాసిన స్వతంత్ర రచనలు.

- Advertisement -

సారళాదాస్‌ తల్లికి మహాభారతం అంటే ఇష్టం. సంస్కృతంలో చదివి ఒడియా లో అర్థం చెప్పేవారు ఆమెకు దొరికేవారు కాదు. తల్లి అవస్థ చూసి, తల్లికోసం తల్లిభాషలో ‘మహా భారతం’ రాశాడు. దానికి సం స్కృత మహాభారతం ఆధార మే కానీ అనువాదం కాదు. అది ఇంచుమించు వ్యాస భార తం అంత పెద్దది. వ్యాస భారతానికి వివరణాత్మక కావ్యమైనా, అది అతని స్వతంత్ర ఒడియా కావ్యం. ఒడియా వారి జాతీయ మహాకావ్యం. దీని రచనా కాలం 1435-1468 మధ్య ఉంటుందని భావన. అందులో పాత్రలు, ప్రాంతాలు సైతం ఒడియావి కావ డం విశేషం. సంస్కృత కావ్య లక్షణాలన్నింటినీ తోసిరాజని తనదైన దాండి వృత్తంలో రాశాడు. కనుక ఆ భారతాన్ని ‘సారళాదాస్‌ భారతం’, లేదా ‘దాండీ భారతం’ అన్నారు.

దాండీ అంటే వరస. దాండీ వృత్తానికి, రెండేసి పాదాలుంటాయి. గణ, మాత్ర, అక్షర నియమాలేవీ ఉండవు. ప్రతి రెండు పాదాలకు చివర ప్రాస మాత్రం ఉంటుంది. అక్కడక్కడ వచనంలానే అనిపిస్తుంది. ఈ పద్ధతిని అప్పటి పల్లె పాటల నుంచి బహుశా అతను తీసుకొని ఉండొచ్చు. అతని తర్వాతి కవులు అనేకమంది దాన్ని అనుసరించారు. అయితే ఈ కావ్యం మూడు శతాబ్దాల వరకూ మౌఖికంగానే ఉండిపోయింది. ఆ తర్వాతే అది తాళపత్రాలలోకి వచ్చింది. అంతేకాదు 1898 వరకూ సారళాదాస్‌ మహాభారతం తాళపత్రాలోనే ఉండిపోయి ప్రచురించబడలేదు.

మహాభారతం అన్నది ఒడిశాలోనే జరిగినట్టు సారళాదాస్‌ రాశాడు. అప్పటి స్థానిక భాషనే కాకుండా, నాటి ఒడియా సంస్కృతి, సామాజిక వ్యవస్థ, మత రాజకీయాలు, నమ్మకాలు, నడవడి, ఆచారవ్యవహారాల వంటివన్నీ అందులో వాడుకోవడంతో అతను రాసిన దానికి మరింత బలం చేకూరింది.

ఒడియా మహాభారతం రెండు కుటుంబాల మధ్య జరిగిన యుద్ధాల కథ కాదు. అప్పటి పాండవులు, కౌరవుల ప్రజల మధ్య జరిగిన యుద్ధాలు. అందులో స్త్రీ పురుషులు, సైనికులు అందరూ ఒడియా వారే. సంస్కృత మహాభారతంలాగ 18 పర్వాలే ఉన్నా, వాటి పేర్లు వరస మారిపోయాయి. నగరాలు, రాజధానులు వేరు. పూరీ, కటకం, జాజిపుర లాంటి ఒడిశాలోని అనేక నగరాలు భాగమయ్యాయి.

నదులు, అడవులు, పర్వతాలు, సముద్రాలు వగైరా అన్నీ ఆ ప్రాంతం లోనివే. భగవద్గీత అందులో లేదు. ద్రౌపది వివాహ భోజనంలో వాడిన వంటకాలు మిఠాయిలు కూడా అక్కడి ఒడియా రుచులే. నాట్యాలు, దుస్తులు, అలంకరణలన్నీ స్థానికమైనవే. లోకోక్తులు, నమ్మకాలు, కథలు అక్కడివి విరివిగా వాడుకున్నాడు. అంతగా వారి కథగా తేనెలొలికే ఒడియా భాషలోనే రాశాడు. కాబట్టి ఒడిశాలో ఇంటింటా నేటికీ అతన్ని, అతని మహాభారతాన్ని గుర్తుచేసుకుంటూనే ఉంటారు.

సారళాదాస్‌ రచనల్లో నవప్రవర్తన సరళత్వం, మూలం నుంచి జరిగి వాటిని మరోలా వివరించగలిగే సామర్థ్యం, అతనివే అయిన గొప్ప ప్రత్యేకతలు. భారతదేశంలో బహుశా అతని పద్ధతిలో చెప్పిన మొదటి మహాభారత గ్రంథం అతనిదే కావచ్చు. సామాన్యుల కోసమే అన్నట్టు అయిదు గ్రంథాలు అతనివి ఉన్నాయి. అవి- ఛండీ పురాణ, బిలంక రామాయణ, లక్ష్మీ నారాయణ వచనిక, విచిత్ర రామాయణ, మహా భారత్‌లు. అతని విచిత్ర రామాయణాన్ని 18వ శతాబ్దంలో, జయపురం సంస్థానంలో దివానుగా ఉండిన డొంకాడ గోపీనాథకవి వచనంగా తెలుగు చేశాడు. దాని ఆధారంతో కొందరు తెలుగు కవులు నరసింహదేవర వేంకటశాస్త్రి (1780-1853), వేల్పూ రి వేంకటేశ్వరకవి (1800-1851), కళ్లేపల్లి వేంకట నరసింహమూర్తి (1874-1911), ఒమ్మూరి సోమయ్య, మాచిన సోమయ్య లాంటివారు పద్యాలుగా మలిచారు. తెలుగులో వచ్చిన తర్వాత తాళపత్రాలలో ఉన్న మూలగ్రంథాన్ని వెలికితీసి ప్రచురించుకున్నారు. సంస్కృతంలో ఉన్న అద్భుత రామాయణంలోని పోలికలు ఈ గ్రంథంలో కనిపిస్తాయి.

ఒక సామాజిక విప్లవం కోసం సారళాదాస్‌ గ్రంథ రచనలు చేశారు. వీరుడు, సాహిత్యాభిలాషి, ఒడియా భాషను అన్నివిధాలా ప్రోత్సహించిన రాజు కపిలేంద్రదేవ్‌ (1435-1467) పాలన కాలంలోనే అది జరిగింది. అయితే అతను గ్రామ ప్రజల కవి, రాజుల లేదా పండితుల కవి కాదు. నిజానికి 18వ శతాబ్దం వరకూ ఒడియా కవులెవరూ రాజులను ఆశ్రయించి ఏ కావ్యా లూ రాయకపోవడం అక్కడ విశేషం. అతను జన్మించిన కనకపుర గ్రామానికి దగ్గరలో ఒక మర్రిచెట్టు ఉంది. దానికింద సారళాదాసు సమాధి ఉంది. ప్రజల తీర్థ స్థలాల్లో ఇది కూడా ఇప్పుడు ఒక భాగమైంది. ఏటా ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చే మాఘ సప్తమి రోజు అతని వర్ధంతి జరుపుకొంటారు. అతని 600 సంవత్సరాల జయంతిని ఇటీవలే 2021 ఏప్రిల్‌లో ఘనంగా జరుపుకొన్నారు.

-యెల్లపు ముకుంద రామారావు
9908347273

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తల్లి కోసం.. తల్లి భాషలో మహాభారతం
తల్లి కోసం.. తల్లి భాషలో మహాభారతం
తల్లి కోసం.. తల్లి భాషలో మహాభారతం

ట్రెండింగ్‌

Advertisement