e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home ఎడిట్‌ పేజీ వికసిస్తున్న బాల సాహిత్యం

వికసిస్తున్న బాల సాహిత్యం

బాలలకు మన సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను వారసత్వంగా అందించేది సాహిత్యమే. ఈ సాహిత్యంలో పెద్దలు పిల్లలకోసం రాసే రచనలు, పిల్లల కోసం పిల్లలు రాసే రచనలుంటాయి. వేల ఏండ్ల కిందటినుంచే తెలుగు నేలలో మౌఖికం ద్వారా బాల సాహిత్యం విలసిల్లింది. పెద్దవారి నుంచి పాటలు, గేయాలు, పద్యాలు, కథలు మొదలైన అంశాలను పిల్లలు నేర్చుకునేవారు. చాలామంది ప్రాచీన, ఆధునిక కవులు తమ బాల్యం నుంచే రచనలు ప్రారంభించారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలంగాణ పిల్లలుకూడా పలు రచనలు చేస్తూ పుస్తక ముద్రణ చేస్తున్నారు. బాల సాహిత్యం ద్వారా పసి హృదయాలలో విజ్ఞాన బీజాలు మొలకెత్తుతాయి. భాషా పరిజ్ఞానం పెరుగుతుంది.

వికసిస్తున్న బాల సాహిత్యం

తెలంగాణలో ఘనంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల తర్వాత బాల సాహిత్యానికి ప్రాధాన్యం ఏర్పడింది. సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం బాల సాహిత్య అభ్యున్నతికోసం విశేషకృషి చేస్తున్నది. స్వరాష్ట్ర అవతరణ తర్వాత పాఠ్య పుస్తకాల్లో వచ్చిన మార్పులు విద్యార్థుల్లో సృజనాత్మక నైపుణ్యం వెలికితీసెలా ఉన్నాయి. పలువురు ఉపాధ్యాయులు పిల్లల రచనలతో పుస్తకాలు తెస్తున్నారు. తద్వారా అనేకమంది పిల్లలు తమ ఊహలకు పదునుపెడుతూ రచనలు చేస్తున్నారు. పరిసరాలపై, సమాజిక విషయాలపై రచనలు చేయటం సంతోషదాయకం.

పిల్లలు సృజించిన సాహిత్యం ఇవాళ తెలుగునేల మీద విస్తృతంగా వస్తున్నది. ఇది బాల సాహిత్య లోకంలో విప్లవాత్మక పరిణా మం, కొత్త ఒరవడి. మన బడిపిల్లలు రచయితలుగా, కవులుగా పరిచయమవడమే కాకుండా పుస్తకాల రూపంలో అచ్చవుతున్నారు! ఇందులో తెలంగాణ బడిపిల్లలు నాలుగడుగులు ముందే ఉన్నారు. అంతేగాక, పిల్లల సాహిత్యాన్ని పిల్లలే రాసుకోవడం అనేది బాల సాహిత్య చరిత్రలో కీలక మలుపు. ఈ నేపథ్యంలో పిల్లల్లో చారిత్రక విశేషాలు, ప్రదేశాలు, కట్టడాలు, సామాజిక పరిణామాలపట్ల జిజ్ఞాస, అవగాహన కల్పించడం మన బాధ్యత. తద్వారా పిల్లల ఊహాశక్తికి, వ్యక్తిత్వ నిర్మాణ ఆకాంక్షలకు అనుగుణంగా వారి రచనలు వస్తాయి.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో తాతయ్య, నానమ్మ లేదా ఇంట్లోని పెద్దలద్వారా పిల్లలు కథలు వినేవారు. జానపదాలను లాలిపాటలను, జోలపాటలను నేర్చుకునేవారు. మారుతున్న కాలంతోపాటు పిల్లల ఆలోచనా విధానంలో మార్పులు వస్తున్నాయి. పిల్లలు సాహిత్యాన్ని చదవ డమే కాకుండా వారే స్వయంగా రాస్తున్నారు. ఈ కరోనా సమయంలో తమ సమయాన్ని సద్వి నియోగం చేసుకొని అనేకమంది పిల్లలు తమ కలాలకు పని చెప్పారు.

బాల రచయితలచే వెలువడిన పుస్తకాలలో కొన్ని కవిత్వం, కథల రూపంలో వెలువడగా, సంకలనాలలో అనేకానేక అంశాలు పొందుపరి చారు.10వ తరగతి విద్యార్థి యం.డి.సమ్రీన్‌ ‘ముద్దబంతి’ అనే పేరుతో, ఐ.సౌమ్య ‘బంగారు బాల్యం’ పేరుతో పుస్తకాలు తెచ్చారు. 5వ తరగతి చదువుతున్న బి.అనిత రాసిన ‘అనిత పదాలు’ ఆకట్టుకోగా, 4వ తరగతి చదువుతున్న రాపోలు అద్విక్‌ ‘రామాయణం’ రాస్తే, ఈ పుస్తకానికి 9వ తరగతి విద్యార్థి హరినందన చిత్రాలు గీయడం విశేషం. అహల మాట శతకమును అమెరికాలో 4వ గ్రేడ్‌ చదువుతున్న అయ్యాల సోమయాజుల లక్ష్మీ అహల రాశారు. వివిధ దేశాల్లో ఉన్న తెలుగు పిల్లలుకూడా మన సంస్కృతి, వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలుగును మరువబోమని నిరూపిస్తున్నారు. చాలా మంది విద్యార్థులు భిన్నప్రక్రియలతో, విభిన్న మైన రచనలతో ఆకట్టుకుంటున్నారు.

వికసిస్తున్న బాల సాహిత్యం

ఇవ్వాళ పిల్లలెందరో అద్భుతమైన సృజనతో రచనలు చేస్తున్నారు. ‘ఓ వీర నీ ప్రాణం విడిచావు/ నీవు లేని రోజులు చావుతో సమానం/ కానీ నువ్వు ఉన్నప్పుడు వెయ్యి ఏనుగుల బలం/ నీలాంటి వీరుడు ప్రతి ఇంటిలో పుట్టాల’ని కోరుకుంటూ వివేక్‌ తేజ జవాన్‌ గురించి చెప్పాడు. ‘జలమే జగానికి జీవం/ జలమే జగానికి మూలాధారం’ అని శ్రావణి నీటి ఆవశ్యకతను తెలియజేసింది. ‘సంతలోకి వెళ్ళిన/ పాలకూర తెచ్చిన/ పప్పు వేసి వండిన/ అన్నములో తిన్నను / తొందరగా అరుగును/ జీర్ణశక్తి పెరుగును’ అంటూ ఆకుకూరల గొప్పతనాన్ని తెలిపింది దీపిక. ‘ఆడపిల్లల గుండెసప్పుడు బతుకమ్మ/ మట్టి బతుకుల బతుకు సిత్రం బతుకమ్మ’ అని సంస్కృతి సంప్రదా యాన్ని ప్రతిబింబించారు భువనే శ్వరి. ‘వేసే అడుగు దమ్మున్నదయితేనే/ దుమ్మురేపు తోంది / ఓటమిని దౌడు తీయిస్తుంది/ చిరిగిన చొక్కా అయితేనేం/చెదరని మనసుంటే చాలుగా’ అని అనిల్‌కుమార్‌ అంటాడు. ‘అమ్మ అనే ప్రేమ లేక/ అమ్మాయి అనే గౌర వం లేక/ అమ్మాయిల ప్రాణాలను ఘోరంగా/ బలి తీసుకుంటున్నారు కదరా’ అని నేడు ఆడపిల్లల పట్ల జరిగే అమానవీయ సంఘటనలను ఎత్తి చూపింది అర్చన. ‘ఆపదలు ఎదురైనప్పుడు/ ధైర్యాన్ని తలచుకోవాలి’ అంటూ కనీస ధర్మం గురించి చెప్పారు దీప్తి. ‘పిల్లలేమో చదవాలి/ పెద్దలు పని చేయాలి/ జ్ఞాన సంపద తోడ/ ప్రజలు వృద్ధి చెందాలి’ అంటూ ‘పిల్లలు బడికి- పెద్దలు పనికి’ అనే నినాదాన్ని అందమైన మణిపూసలో కూర్చారు నాగరాజు.

బాలల సాహిత్యం ఇంకా విరివిగా రావాలి. అది పిల్లలకు చేరువ కావాలి. ఉపాధ్యాయులు, బాల సాహితీవేత్తలు, పెద్దలు బాలసాహిత్య పుస్తకాలను పిల్లలకు అందేలా చూడాలి. అప్పుడే పుస్తక పఠనం పట్ల వారికి ఆసక్తి కలుగుతుంది. పిల్లలందరూ స్వచ్ఛ సమాజ నిర్మాణం వైపు అడుగులు వేసి ఆదర్శ పౌరులుగా, మానవీయంగా ఎదుగుతారు.

బాలసాహిత్యంలో స్వీకరించే వస్తువును జాగ్రత్తగా ఎంచుకోవాలి. రచయిత చెప్పదలచుకున్న విషయాన్ని పిల్లల స్థాయిలో ఒదిగి చెప్పాలి. విషయ స్వభావం మారకుండా విద్యార్థులకు లోకనీతిని, నైతికతను పెంచేలా ఉండాలి. లయాత్మకత, సరళత, చమత్క్రుతి ఉండాలి. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా రచనలు ఉండాలి. స్వీయ అధ్యయనానికి, అనుభవానికి, అవగాహనకు అవకాశం ఉండాలి. మానవీయ విలువలను చాటిచెప్పేలా రచనలు రావాలి. పిల్లల రచనలు నిత్యనూతనంగా, పఠనాభిలాషను పెంపొందించేలా ఉన్నప్పుడే రచయిత ఆశయం నెరవేరుతుంది.

  • కందుకూరి భాస్కర్‌, 97034 87088
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వికసిస్తున్న బాల సాహిత్యం

ట్రెండింగ్‌

Advertisement