మాతృ దినోత్సవం
కష్టాల కాడిని మోస్తూ
జోడి సరిజోడు అడుగులకు
అమ్మ.. ఒక ఆలంబనం!
బరువు బాధ్యతలను చిలికి అలిసినా
అమృతాన్నే అందించే
అమ్మ.. ఒక పాల సముద్రం!
కష్టాల కుంపటి బతుకులకు
జాలిపడి మనసు కరిగే
అమ్మ.. ఒక మంచుపర్వతం!
కుటుంబ అలజడుల
అలలను అదుపు చేసే
అమ్మ.. ఒక చెలియలి కట్ట!
సంకటాల సంసార నావను
సంతోషాల తీరం చేర్చే
అమ్మ.. ఒక చుక్కాని!
బంధాల బాటలో
అనుబంధాలను అల్లే
అమ్మ.. ఒక చెలిమి!
ఆశ నిరాశల ఒంటరి
బతుకు ఎడారిలో
అమ్మ.. ఒక ఆశల చెలిమె!
తరాన్నీ తరతరాన్నీ
నిరంతరం తరింపజేసే
అమ్మ.. ఒక అవతారం!
పి.బక్కారెడ్డి
97053 15250