నా మిత్రులు
తెల్లవారక ముందే నిద్ర లేస్తారు
కలలు పరుచుకున్న పక్కలో
కట్లపాము పాకుతున్నట్టు
పులి పంజా విసురుతున్న
జింకపిల్ల జంకులా
వాళ్ళు నిద్ర లేస్తారు!
అగ్గిపుల్లంత పొద్దు వెలిగించి
పొయ్యినిండు దావానలం మీద
శత్రువు చావుకు గిన్నెడంత ఎసరు పెడుతారు
ఆకలి దెయ్యం మూర్ఛపోయే
మంత్రమేదో ఉడికిస్తారు..!
తట్టా బుట్టా
పలుగూ పారా భుజానేసుకుని
గుప్పెడు బలంముద్ద మూటగట్టుకుని
కలల సాగుకు పయనమవుతారు!
బతుకు దారిలో
వాళ్ళు
పాదముద్రలు వొదిలివెళ్తుంటే…
మంత్రి గారు ఎవరో వొస్తున్నట్టు
పహారాకు దిగిన సైనికుల కవాతు వొంక
తొంగి తొంగిచూస్తున్న పిల్లాడిలా
అప్పుడొస్తాడు
కందిని ఎత్తిపట్టిన సాయం సూర్యుడు!
ఆ ఎర్రటి నిప్పుముఖం వాడు
పడమటి గుట్ట చాటు
అలా తలతిప్పుకోగానే
వాళ్ళు..
పనిచేతలలో కష్టం ఊడ్చుకుపోయే
పిడికెడు ముసిముసి నవ్వురాగాలెత్తుకుని
గూటికిచేరే
స్వేద పరిమళానంద పారిజాతాలు
గువ్వపిల్లల గింజ ఎదురుచూపుల
వాడిపోని బుక్కెడు కడుపునిండు నమ్మకాలు..!
రెక్కలు ముక్కలవుతున్న ఆశయసాధనలో
జిగురు ఆశేదో అంటించుకుని
రాత్రంటే చేదయినట్టు
పగలంటే ప్రాణమన్నట్టు
ప్రతి ఉలికిపాటులోనూ
పంటపంటకూ
కొడవలి చీరుకుపోతున్న బెరుకున్నట్టు
ఎందుకో మరి
నా మిత్రులు
తెల్లవారక ముందే నిద్ర లేస్తారు..!
పని.. పని.. పని..
గుర్రాన్ని అదిలించినట్టు
ముల్లుగర్ర పొడుస్తున్నట్టు
మెడలమీద కెక్కి కూర్చున్న
పనితోనే పని!
కట్టె కొట్టినా.. బొమ్మ చెక్కినా
చెప్పు కుట్టినా.. డప్పు మోగించినా
బట్ట ఉతికినా.. మగ్గం నేసినా
నెత్తి గొరిగినా.. కుండ చేసినా
మెతుకు పంటయినా
ఆకాశమెత్తు తాటి పానకం
నేలకు దించినా..
వాళ్ళు శ్రామికులనండి
కార్మికులనండి
వాళ్ళు మాత్రం
లోకమంతటి నావా
సుఖ తీరాలకు చేరవేస్తున్న
దేవదూతలు..!