e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home ఎడిట్‌ పేజీ అనర్గళ వక్త, స్వచ్ఛమైన బాష

అనర్గళ వక్త, స్వచ్ఛమైన బాష


పీవీతో తన కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యాన్ని, జ్ఞాపకాలను సీనియర్‌ పాత్రికేయులు, సమాచారశాఖ మాజీ కమిషనర్‌, ఆచార్య మాడభూషి శ్రీధర్‌ ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.

అనర్గళ వక్త, స్వచ్ఛమైన బాష

మా నాన్న ఎంఎస్‌ ఆచార్య, పీవీ సన్నిహితులు. పీవీ, ఆయన ఆప్తమిత్రుడు పాములపర్తి సదాశివరావు కలిసి నిర్వహించిన కాకతీయ పత్రికలో మా నాన్న పాత్రికేయుడిగా పనిచేశారు. ఆ తర్వాత నాన్న జనధర్మ పత్రికను పెట్టడంతోపాటు వివిధ పత్రికల్లో పనిచేయగా, పీవీ రాజకీయాల్లో బిజీగా మారిపోయారు. అయినా వరంగల్‌ వచ్చారంటే మా నాన్న గురించి తప్పక అడిగేవారు.

పాత్రికేయ వృత్తిలో భాగంగా వారు అతిథిగా వచ్చిన అనేక కార్యక్రమాలను మా పత్రిక తరపున నేనే కవర్‌ చేశాను. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి మాత్రం రెండు మధురానుభూతులున్నాయి. నేను అప్పుడే ఇంటర్‌ పూర్తిచేసిన రోజులు. అదే సమయంలో పీవీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కాకతీయ పత్రికలో వరంగల్‌కు చెందిన కొద్దిమంది మిత్రులు అభినందన సంచిక వేశారు. దానికి సదాశివరావు, మా నాన్న ఆచార్య సంపాదకులు. సంచిక ఆవిష్కరణ సభను చిన్న గదిలో అదీ కుర్చీలు వగైరా ఏమీ లేకుండానే ఏర్పాటుచేశారు. అందరూ చాపల మీదే కూర్చున్నారు. ముఖ్యమంత్రి పీవీ సైతం వారితో పాటు చాప మీదే కూర్చున్నారు. పీవీని కలవడం, మాట్లాడటం అదే మొదటిసారి. ఇక రెండవది. నేను 1984లో ‘ఉదయం’ విలేకరిగా ఉన్నప్పుడు కేంద్రమంత్రి హోదాలో పీవీ హైదరాబాద్‌ వచ్చారు. ఆ కార్యక్రమాన్ని కవర్‌ చేసేందుకు రాజ్‌భవన్‌ వెళ్లాను. అయితే పీవీని నేరుగా కలిసేందుకు జంకాను. అప్పటికీ ఆయనను కలువక ఏడేనిమిదేండ్లు గడిచాయి. గుర్తుపడతారో? లేదోనని తటపటాయించాను. కానీ పీవీ గదిలోకి వస్తూనే నన్ను చూసి దగ్గరికి వచ్చి భుజం మీద చేయివేసి ‘బాగున్నావా. నాయిన ఎట్లున్నడు’ అంటూ పలకరించారు. మా నాన్న నడుపుతున్న ‘జనధర్మ పత్రిక గురించి అడగడమే కాదు, దానిని ఎలాగైనా బతికించుకోవాలని హితబోధ చేశారు. వరంగల్‌లోని మిత్రుల యోగక్షేమాలను అడిగితెలుసుకున్నారు.

అనర్గళ వక్త, స్వచ్ఛమైన బాష

పీవీ ప్రసంగం సాహిత్యమైనా, రాజకీయమైనా, శాస్త్రసాంకేతికరంగమైనా శ్రోతలు మైమరిచిపోవాల్సిందే. వరంగల్‌ ఎంపీగా ఉన్నప్పుడు పీవీ వేయిస్తంభాల గుడికి వచ్చారు. ఆ ఆలయం చుట్టుపక్కల అప్పట్లో ఎక్కువగా ముస్లిం కుటుంబాలు ఉండేవి. వారితో పీవీ ఉర్దూలోనే మాట్లాడారు. అందులో ఒక్క హిందీ పదం లేదు. నేనే కాదు ఇతర పాత్రికేయులు కూడా ఉర్దూ బాగా తెలిసిన తెలుగు వారితో మాట్లాడి ఆ ప్రసంగం వివరాలు రాయాల్సి వచ్చింది. హిందీ మాట్లాడినా పొరపాటున కూడా ఒక్క ఉర్దూ పదం దొరలేది కాదు. ఇంగ్లీష్‌ అంతే. తెలుగు భాషపై, సాహిత్యంపై పీవీకి ఎంతో మమకారం. అందుకు ఆయన స్వయంగా నిర్వహించిన పోతన పంచశతి ఉత్సవాలే నిదర్శనం. ఇక రాజకీయ ఉపన్యాసాల గురించి చెప్పనక్కర్లేదు. పండితుడి నుంచి పామరుల దాకా అర్థమయ్యేలా చెప్పేవారు. శ్రోతల్లో నూతన ఆలోచనలు రేకెత్తించేవారు. పీవీ మరొక ప్రత్యేకత ఏమంటే ఏ సభలో ఉన్నాం? అది ఏ అంశానికి సంబంధించినది? అక్కడ ఏ విషయాలను ప్రస్తావించాలి? అన్నది బాగా తెలిసిన వ్యక్తి. ఆ పరిధిని దాటి వెళ్లేవారు కాదు. సంబంధిత అంశంపై ఎన్ని గంటలైనా ఉపన్యసించగల వాక్పటిమ, ప్రతిభ పీవీకే సొంతం.

పీవీ ప్రజాస్వామ విలువలకు ప్రాధాన్యమిచ్చేవారు. అభిప్రాయాలను తెలుసుకునేవారు. శాసనసభ అయినా, పార్లమెంట్‌ అయినా, పత్రికా సమావేశమైనా ప్రశ్నలకు ఠక్కున సమాధానం చెప్పేవారు. అందులో పీవీలో దాగి ఉన్న హస్యచతురత, సమయస్ఫూర్తి, వ్యంగ్యవైచిత్రి కనిపించేది. ఒకసారి పాత్రికేయ సమావేశంలో నా సహచర విలేకరి ఒకరు ‘రాష్ట్రంలో కొన్ని సమస్యలున్నాయని మీరే ఒప్పుకొన్నట్లు మా వద్ద రిపోర్టులున్నాయి. మరి ఆ సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?’ అని ప్రశ్నించగానే పీవీ క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే దానికి ‘మీరే పరిష్కారం చూపాలి’ అని సమాధానమిచ్చారు. ఆ జవాబు అర్థం కాక విలేకరులంతా దిక్కులు చూస్తుంటే మళ్లీ పీవీనే ‘సమస్యలున్నాయని నేనెక్కడా అనలేదు. నా పేరిట రిపోర్ట్‌ చేసింది మీరే. ఇప్పుడు అలానే నా పేరు మీదనే పరిష్కారం చెప్పండి’ అంటూ ఆ విలేకరికి వ్యంగ్యంగా చురకలంటించారు.

దేశానికి ఎనలేని సేవలు అందించిన పీవీ తెలంగాణ ముద్దుబిడ్డ కావడం మనందరికీ గర్వకారణం. అంతటి మహనీయుడికి ఇప్పటివరకు తగినంత గుర్తింపు రాకపోడం తలచుకుంటే ఆవేదన పొంగుకువచ్చేది. ఇన్నాళ్లకు రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా పీవీ శతజయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహిస్తుండటం సంతోషాన్నిస్తున్నది. పీవీ స్ఫూర్తిని నలుదిశలా చాటేలా కార్యక్రమాలను నిర్వహిస్తుండటం ఆనందదాయకం. పీవీ శతజయంతి సంవత్సరం సందర్భంగా ఆయనకు ‘భారతరత్న’ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని ఆకాంక్షిస్తున్నా.

Advertisement
అనర్గళ వక్త, స్వచ్ఛమైన బాష
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement