e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News Mother's Day Special : అమ్మ కడుపు చల్లగా

Mother’s Day Special : అమ్మ కడుపు చల్లగా

అమ్మ నవ్వుతుంది..చిట్టికూతురు ముసిముసి నవ్వులు చూసి.అమ్మ బాధ పడుతుంది.బిడ్డడు అడ్డం పడితే! అమ్మ ఆకలి తీరుతుంది. గారాల పట్టి మారాలు మాని, నాలుగు ముద్దలు తింటే.అమ్మ సంతోషిస్తుంది..కొడుకు కోరుకున్న ఉద్యోగంలో చేరినప్పుడు.బిడ్డల బాగోగులే అమ్మ ఆనందాలు. వాళ్ల కష్టనష్టాలు ఆమెకు భారాలు.ఈ కరోనా వేళ.. అమ్మ ప్రాధాన్యాలు మారిపోయాయి. ఆమె లక్ష్యం ఒక్కటే! తన పిల్లలు క్షేమంగా ఉండాలి. ఆమె సంకల్పం ఒక్కటే, ఎట్టి పరిస్థితుల్లోనూ తన వాళ్లకు వైరస్‌ సోకరాదు! అందుకు తను ఎంచుకున్న మార్గాలు అనేకం. ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా.. బిడ్డలకోసం అమ్మ చేస్తున్నపోరాటంపై ప్రత్యేక కథనం.

Mother's Day Special : అమ్మ కడుపు చల్లగా

జ్యోతిషశాస్త్రంలో చంద్రుడిని మాతృస్వరూపంగా చెబుతారు. ఆ చంద్రుడు సూరీడికాంతిని గ్రహించి ప్రతిఫలిస్తాడు.ఈ అమ్మా అంతే. తన బిడ్డల మంచి-చెడ్డలే తన జీవితంగా బతికేస్తుంది. అందుకే, అమ్మ మనసు జాబిలికన్నా చల్లన. అమ్మ నవ్వు వెన్నెలకన్నా తెల్లన. ఆ తల్లి జాబిల్లి ఇప్పుడు జాలిచూపులు చూస్తున్నది. గద్ద గోటికి చిక్కకుండా తన పిల్లలను రెక్కలమాటున అదుముకునే తల్లికోడిలా బిక్కచూపులు చూస్తున్నది. ప్రపంచాన్ని చుట్టేసి, దేశాలు దాటేసి, రాష్ర్టాలను మింగేసి, ఊళ్లోకి వచ్చేసి, వీధిలో మాటేసిన మహమ్మారి నుంచి తన పిల్లలను కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నది. ఈ ప్రయత్నంలో చిన్న పిల్లలను లాలిస్తున్నది, కాస్త పెద్ద పిల్లలనైతే బుజ్జగిస్తున్నది, పిల్లలున్న పిల్లలను హెచ్చరిస్తున్నది. ఇక్కడితో ఆగిపోతే, అమ్మ ఎందుకు అమ్మ అవుతుంది? తన వాళ్లు వైరస్‌ బారిన పడకుండాఅష్టదిగ్బంధనం చేస్తున్నది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టకుండా అష్టావధానం చేస్తున్నది. మానసికంగా కుంగిపోకుండా ఆత్మవిశ్వాసం నింపుతున్న‌ది.

అమ్మ కడుపు చల్లగా

ప్రసార మాధ్యమాల్లో వస్తున్న కరోనా వార్తలు అందరినీ కలవర పరుస్తున్నాయి. ఇంటిల్లిపాది గురించి ఆలోచించే అమ్మను మరింత కుంగదీస్తున్నాయి. ఈ మాయదారి కరోనా, రాళ్ల వర్షంలా వచ్చి పడితే తల్లి బిడ్డలకు గొడుగయ్యేదే! వరదలా తరుముకొస్తే ఆనకట్టలా అడ్డు నిలిచేదే! కంటికి కనిపించకుండా వచ్చి శరీరంలోకి జొరబడే సూక్ష్మక్రిమి అంతు తేల్చడానికి తల్లికూడా సూక్ష్మంగా ఆలోచిస్తున్నది. తనకెలాంటి అతీంద్రియ శక్తులు లేకపోయినా శాయశక్తులూ కూడదీసుకొని బిడ్డలను, ఇంటిని కాపాడుకుంటున్నది. ఈ ప్రయత్నంలో అమ్మకు ఆంక్షలెన్నో! అడ్డం తిరిగే బిడ్డలెందరో!అయినా, తను రాజీ పడదు, ఓడిపోదు. తన బిడ్డలను ఓడనివ్వదు. అయితే, పేగుబంధం బలంగా ఉండాలని కోరుకుంటున్న తల్లులు కరోనా వేళ కాస్త కఠినంగా, ఇంకాస్త మురిపెంగా, మరికాస్త లౌక్యంగా వ్యవహరించాల్సిందే.

ఇంటింటి ధన్వంతరి

Mother's Day Special : అమ్మ కడుపు చల్లగా

మన దేశంలో వంటింటి వైద్యం ఇంకా సజీవంగా ఉందంటే అందుకు కారణం అమ్మే! తాతమ్మల నుంచి అమ్మమ్మలు, వాళ్లద్వారా అమ్మలు వంటింటి చిట్కాలను చిటికెలో నేర్చేసుకున్నారు. తరాలు మారినా, అంతరాలు పెరిగినా.. గృహవైద్యంలో అమ్మ యూకే రిటర్న్‌ డాక్టర్‌కన్నా మెరుగైన చికిత్సను సిఫారసు చేస్తుంది. చెప్పడమే కాదు, చేసి చూపుతుంది. బిడ్డ కాలికి ముల్లు గుచ్చుకుంటే చకచకా ఉల్లిపాయ వేడి చేసి కాపడం, మోకాలికి గాయమై రక్తస్రావం జరుగుతుంటే మరుక్షణం చాయ్‌పత్తా పెట్టడం.. ఇలాంటివన్నీ ఎప్పుడు నేర్చేసుకుందో అమ్మ! సమయానికి తగు పరిష్కారంతో ప్రత్యక్షమవుతుంది. జలుబు వదలనప్పుడు మిరియాల పాలు, దగ్గు రేగినప్పుడు తులసిరసం, చెవిపోటుకు ఎల్లిపాయ నూనె.. చిన్నచిన్న సమస్యలను గోటితోనే తేల్చేసే అపర అశ్వినీ దేవత. దాదాపు ఏడాదిగా పెనుసవాలు ఎదుర్కొంటున్నదామె. మాయదారి కొవిడ్‌ను దారి తప్పించడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులనూ ఉపయోగిస్తున్నది. పోషకాలను సమపాళ్లలో అందిస్తూ వారి ఆరోగ్యాన్ని పెంచే క్రతువు నిర్వహిస్తున్నది. మసాలా దినుసులు, కాయగూర ముక్కలు, ఆకుకూర వెరైటీలతో పాకయజ్ఞం చేస్తూ.. యాగ ఫలితాన్ని పిల్లలకు పంచుతున్నది.

అమ్మ కడుపు చల్లగా

ఆరోగ్య లక్ష్మి

అందరూ ఇంటిపట్టునే ఉండటంతో అమ్మ పని రెట్టింపైంది. పిల్లలు బడికి, ఆఫీస్‌కు వెళ్లే రోజులే నయం! ఉదయం వెళ్తే ఏ సాయంత్రానికో వచ్చేవాళ్లు. అంతా సమయం ప్రకారం జరిగేది. ఇప్పుడు సంయమనంతో పనులు చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి. బాల్కనీలో ల్యాప్‌టాప్‌తో పెద్దబ్బాయి, మధ్యగదిలో సిస్టమ్‌ ముందు చిన్నమ్మాయి ఆన్‌లైన్‌ క్లాసులు వింటూనో, వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేస్తూనో బిజీబిజీగా ఉంటున్నారు. ‘అమ్మా టిఫిన్‌లోకి ఊతప్పం చేసి పెట్టవూ!’ అని ఒకరు, ‘నాకైతే బన్‌ విత్‌ జామ్‌’ అని ఇంకొకరు, పిల్లలు ఆర్డర్లమీద ఆర్డర్లు వేస్తుంటే, ఇంటాయన ఊరుకుంటాడా గంటకో కాఫీ, నిమిషానికో పని! టిఫినీల పర్వం పూర్తవ్వక ముందే భోజనాల వేళ ఆసన్నమవుతుంది. ఒకరికి పప్పు నచ్చదు, ఇంకొకరికి కూర గిట్టదు. ఇంట్లో పెద్దాయనకు రోటిపచ్చడి లేకుంటే ముద్ద దిగదు. స్కూలేజ్‌ పిల్లలకైతే నంజుకోవడానికి ఏదో ఒక వెరైటీ ఉండాల్సిందే! ఇన్ని చేసి అందరికీ వేడివేడిగా వడ్డించి, అంట్లు ఎత్తి, గిన్నెలు తోమేసరికి ఈవెనింగ్‌ స్నాక్స్‌ టైమ్‌ స్నేక్‌లా చేతులకు చుట్టుకుంటుంది.

అమ్మ కడుపు చల్లగా

ఆ పనీ పూర్తయ్యేసరికి డిన్నర్‌ బెల్స్‌ మోగుతాయి. డైనింగ్‌ టేబుల్‌ మీదే ‘రేపు టిఫిన్‌లోకి ఇవ్వి, లంచ్‌లోకి అవ్వి..’ అంటూ డిమాండ్లు వినిపిస్తాయి. రేపటి మెనూకు సంబంధించిన పనులన్నీ రాత్రికి రాత్రే చక్కదిద్ది మంచం చేరిన అమ్మ.. పిల్లల కప్పులు సర్ది, వారి గురించే ఆలోచిస్తూ కలత నిద్రలోకి జారుకుంటుంది. అమ్మది వారం రోజుల్లో ముగిసిపోయే యుద్ధం కాదు. జీవితాంతం సాగే పోరాటం. తన ఒంట్లో శక్తి లేదని కొడుకులో, బిడ్డలో గుర్తించేవరకు అమ్మ టైమ్‌ టేబుల్‌లో మార్పుండదు. వర్కింగ్‌ మదర్‌ అయితే ఈ పని రెట్టింపు. ఇన్ని పనులు చేస్తూ తన వృత్తి ధర్మాన్ని నిజాయతీగా పాటిస్తుంది. ఇంత బిజీగా జీవితాన్ని గడిపేస్తున్న అమ్మకు కరోనా పరీక్ష ఒక లెక్కా? అందుకే, కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కోవడంలో తన కుటుంబానికి రక్షగా నిలుస్తున్నది. పోషకాహారం అందిస్తూ ఆరోగ్యాన్ని పెంపొందిస్తున్నది.

ఎన్నాళ్లయినా అదే ఓపిక

Mother's Day Special : అమ్మ కడుపు చల్లగా


కరోనా సమయం పిల్లలకు పరీక్షలు రద్దు చేసినా, తల్లులకు మాత్రం కఠిన పరీక్షలు పెడుతున్నది. దాదాపు ఏడాదిగా ఆన్‌లైన్‌ క్లాసులకు పరిమితమైన పిల్లలకు అమ్మతో అనుబంధం ఎక్కువే పెరిగింది. అదే సమయంలో ఆమెకు ఎదురైన సవాళ్లు ఇన్నీ అన్నీ కావు. శారీరక అలసటకు దూరమైన పిల్లలు ఆన్‌లైన్‌ బడితో మానసిక బడలికకు గురవుతున్నారు. ఎదిగే వయసులో, ఆటలతో అలసి పోవాల్సిన వాళ్లు నాలుగ్గోడలకు పరిమితం కావడంతో బరువు పెరుగడం ఏ తల్లికైనా ఆందోళన కలిగించే విషయమే! అలాగని అర్ధాకలితో పిల్లలను ఏ తల్లీ మాడ్చలేదు. ఆన్‌లైన్‌ పాఠాలు సరిగ్గా అర్థంకాక పిల్లల్లో మానసిక సంఘర్షణ కూడా పెరిగిపోయింది. వీటన్నిటికీ మళ్లీ ఒకటే మంత్రం, ఒకటే ఉపాయం.. అది అమ్మ ఆలనాపాలనా.

కొత్తదే అయినా ఈ పాత్రనూ ఆమె సమర్థంగా పోషిస్తున్నది. బిడ్డలకు విద్యాబుద్ధులు చెబుతూనే, వారి ఒత్తిడిని చిత్తు చేసే ఎత్తులు ఎన్నో వేస్తూ వస్తుంది. ఇంటి పనులు పురమాయిస్తూ వారికి ఆటవిడుపును అందిస్తున్నది. తనూ చిన్నపిల్లగా మారిపోయి వారితో ఆటలాడుతున్నది. మొత్తానికి ఓ ఏడాది ఎలాగో అలా నెట్టుకొచ్చింది. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌తో మళ్లీ బడిబాటలు ఎప్పుడు తెరుచుకుంటాయో అంతుబట్టడం లేదు. మరిన్ని రోజులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయం తల్లికి ఎవరో చెప్పాలిన అవసరం లేదు. తన బిడ్డల బాగోగులు తనకన్నా బాగా మరెవరికి తెలుస్తాయి!

Mother's Day Special : అమ్మ కడుపు చల్లగా

అడ్డాల బిడ్డడినైనా, గడ్డాలవాడైనా కడుపున పుట్టినవాళ్లకు కష్టం వస్తే తల్లి తల్లడిల్లుతుంది. పురాణాలు మొదలు కరోనాల వరకు పిల్లల విషయంలో ఆమ్మ ఆందోళనలో మార్పు రాలేదు. ఈ విపత్కర పరిస్థితుల్లో బిడ్డలకు రక్ష తల్లే! అమ్మ గీసిన గీటు దాటనంత వరకు ఏ కరోనా ఏం చేయదు. మాస్కుకన్నా మందంగా అమ్మప్రేమ అడ్డుగా ఉంటుంది. శానిటైజర్‌కన్నా మిన్నగా అమ్మ హెచ్చరికలు పనిచేస్తాయి. అమ్మ గట్టిగా నిలబడటం వల్లే లాక్‌డౌన్‌లు విజయవంతమవుతున్నాయి. అమ్మమాట వింటే కరోనా రక్కసినుంచి సులువుగా తప్పించుకోవచ్చు. తల్లిని అర్థం చేసుకోవడం, తనకు సహకరించడమే పిల్లలుగా ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా అమ్మకిచ్చే అపురూప కానుక.

అమ్మ కడుపు చల్లగా

అమ్మమాట విందాం

పిల్లల యోగక్షేమాలు తల్లికి ముఖ్యం. అందుకే, ఆరాట పడుతుంది. ఆంక్షలు విధిస్తుంది. చిన్నపిల్లలైతే నయానో, భయానో వింటారు గానీ యువతతో తల్లులకు పెద్దచిక్కే వచ్చి పడింది. తమకు కరోనా రాదనే గుడ్డి నమ్మకం, వచ్చినా తట్టుకుంటామనే వెర్రి అపోహతో తమకోసం శ్రమించే తల్లులను ప్రమాదాల్లోకి నెడుతున్నారు. బయట తిరగక పోతే వచ్చే నష్టం ఏం లేకున్నా, తరచూ గడప దాటుతున్నారు. అమ్మమాట కాదని మరీ వీధుల్లోకి వస్తున్నారు. స్నేహితులతో తిరుగుతున్నారు. గుంపులతో చేరుతున్నారు. మాస్కులు పెట్టుకోవడం భారంగా భావిస్తున్నారు. ‘శానిటైజేషన్‌ అవసరమా?’ అనుకుంటున్నారు. కానీ, వైరస్‌కు దయాదాక్షిణ్యాలు లేవు. కండలు తిరిగిన శరీరాన్ని చూసి కరోనా వెనక్కి తగ్గదు.

చిన్నపాటి నిర్లక్ష్యం చాలు వైరస్‌ ఒంట్లోకి జొరబడటానికి! వైరస్‌ సోకినా ఆ లక్షణాలు వెంటనే బయటపడవు. కానీ, ఈ వైఖరి కారణంగా ఏండ్లుగా ఇంటికోసం శ్రమించి రోగ నిరోధక శక్తి సన్నగిల్లిన తల్లులకు పెనుప్రమాదం వాటిల్లుతున్నది. పిన్నలనుంచి వైరస్‌ సోకి ఎందరో పెద్దలు ప్రాణాలు కోల్పోయారు. ఆ పరిస్థితి ఎదురు కాకూడదంటే కొన్నాళ్లు స్వీయనియంత్రణ ఒక్కటే మార్గం! మీ కోసం కాకపోయినా జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసమైనా నిబంధనలు పాటించాల్సిందే! అమ్మమాట వింటే ఆమెను గౌరవించిన వాళ్లు మాత్రమేకాదు, అమ్మ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్లూ అవుతారు.

పొదుపు మంత్రం పదిలం

Mother's Day Special : అమ్మ కడుపు చల్లగా

ఈతరం అమ్మల మాటేమిటోగానీ, పాతతరం అమ్మలకు పొదుపు మంత్రం వెన్నతో పెట్టిన విద్య. ఉన్నదాంట్లో ఉన్నతంగా వండి వార్చడం ఎలాగో మరొకరు చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుత కరోనా కాలంలో పొదుపు తంత్రాన్ని నిక్చచ్చిగా ప్రయోగించాల్సిందే! పరిస్థితులు మరెంతగా దిగజారిపోతాయో అంచనా వేయలేక పోతున్న ఈ తరుణంలో ఆహారం, ఆర్థికాంశాల్లో కొంత కఠినంగా వ్యవహరించడం అనివార్యం. వ్యాక్సినేషన్‌ విజయవంతంగా పూర్తయి కరోనా తోక ముడిచే వరకు ఆచితూచి స్పందించాలి. దుబారాకు కళ్లెం వేయాలి.

ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే ఆర్థికంగా చతికిల పడకుండా జాగ్రత్త వహించాలి. పదార్థాలు వృథా కాకుండా అరికట్ట గలిగితే ఆదా చేసినట్టే. అత్యవసరమైతే తప్ప, కొత్త వస్తువులు కొనుగోలు చేయకండి. బయటకు వెళ్లి విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఎలాగూ లేదు. అలా కొంత వ్యయం తగ్గినా, డిటర్జెంట్‌ పౌడర్‌నుంచి డిజిటల్‌ పేమెంట్స్‌ వరకు మీ ఆధీనంలో ఉండేలా చూసుకుంటే ఆర్థికంగా సమస్యలు ఉత్పన్నం కావు. ఈతరం అమ్మలు ఆర్థిక స్వాతంత్య్రం కలిగి ఉండటంతో ఖర్చు విషయంలో కాస్త పట్టువిడుపులు ప్రదర్శిస్తుంటారు. కొన్నాళ్లు ఓపికతో ఉండండి. కరోనా సద్దు మణిగిన తర్వాత ఈ పొదుపు పైకాన్ని ఏదైనా ప్రయోజనానికి వెచ్చించవచ్చు.

అనుబంధాలు చెడకుండా..

Mother's Day Special : అమ్మ కడుపు చల్లగా

అమ్మ కొంగు బంగారం. అవసరానికి పదో పరకో అందులో దొరికేస్తాయి. అమ్మ పోపులపెట్టె బంగారం. నెలాఖరున చిల్లరఖర్చులు నెట్టుకొచ్చేవి అవే. అతివను మించిన గొప్ప విత్తమంత్రి లేరు. అందులో నిధుల పంపకంలో అమ్మ చేసే సిఫారసులకు తిరుగుండదు. అయితే, కరోనా దెబ్బతో చాలా కుటుంబాల ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది. ఉద్యోగ భద్రత కరువైంది. ఉపాధి దూరమైంది. ఆర్థిక సమస్యలు ఇంట్లో వాతావరణాన్ని ఎంతగా కలుషితం చేస్తాయో వేరే చెప్పనవసరం లేదు. ఆర్థిక మూలాలు దెబ్బ తిన్నప్పుడు అనుబంధాలూ బీటలు వారుతుంటాయి. జమా-ఖర్చుల పొడ అనుబంధాలపై పడకుండా చూడాల్సిన బాధ్యత అమ్మదే! ఇంటాయన సంపాదన అమాంతం పడిపోయినా, తన ఉపాధికి గండం వచ్చినా తట్టుకునే మనోస్థయిర్యం పెంచుకోవాలి. రానున్న రోజుల్లో ఇంకెలా ఉంటుందో చెప్పలేం. అందుకే, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ప్రాధాన్యాల
వారీగా బడ్జెట్‌ కేటాయింపులు ఉండాలి. ప్రతినెలా మిగులు బడ్జెట్‌ ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. కొన్నాళ్లు ఎవరేమనుకున్నా లెక్కాపత్రం మీ ఆధీనంలా ఉండేలా చూసుకోండి. అప్పుడు ఆర్థిక కష్టాలూ ఉండవు, అనుబంధాల్లో అరమరికలకూ తావుండదు.

అమ్మ కడుపు చల్లగా

అందం కరిగిపోతున్నా..

‘కేర్‌’ మంటూ పసికందు పొత్తిళ్లల్లోకి చేరింది మొదలు అమ్మ కేరింగ్‌ ఇంతా అంతా ఉండదు. అప్పటివరకు అమ్మ.. కేవలం ‘ఆమె’ మాత్రమే! తల్లి పాత్రలోకి వచ్చింది మొదలు తనలో ఎంతో మార్పు! బిడ్డకు పాలు బాగా పడతాయన్న ఒకే ఒక్క కారణంతో, చిన్నప్పుడు చీదరించుకున్న బొప్పాయి పండు ముక్కలను ఇష్టంగా తింటుంది. వాసన గిట్టని వెల్లుల్లి కారాన్ని మమకారంగా ఆరగిస్తుంది. తన అందం కరిగి పోతుందని, ఆకారం వికారం అవుతుందని తెలిసినా బిడ్డ సంరక్షణే అమ్మకు ముఖ్యం. అమ్మపాలను మించిన వ్యాక్సినేషన్‌ లేదు మరి. సాటివచ్చే పోషకాల నిధులూ లేవు. అందుకే, తన ఆరోగ్యం గురించి ఆలోచించకుండా రక్తాన్ని క్షీరంగా మార్చి బిడ్డకు పడుతుంది. బిడ్డకు ఆరు నెలలు తల్లిపాలు చాలు. ఆపైన పోతపాలు అలవాటు చేసినా.. పసికందు వెర్రిచూపులను అర్థం చేసుకొని చనుబాలు నోటికి అందిస్తుంది తల్లి. రెండోసారి అమ్మ అయ్యాక గానీ మొదటి బిడ్డకు పాలను మరిపించదు.

Mother's Day Special : అమ్మ కడుపు చల్లగా

పేగుబంధం కదిలించినా..

కరోనా వేళ ఇంట్లో ఉండే ఎందరో తల్లులు పోరాటం చేస్తుంటే, కొవిడ్‌ కట్టడికి ఎందరో అమ్మలు రంగంలోకి దూకారు. ఇంటిపట్టునే బిడ్డలను ఉంచి ప్రాణాలకు వెరవకుండా కార్యదక్షులై పోరాడుతున్నారు. గతేడాది కర్ణాటకలోని బెళగావిలో దవాఖానలో విధులు నిర్వర్తిస్తున్న తల్లిని చూస్తూ అద్దాల వెనుకనుంచి మూడేండ్ల చిన్నారి వెక్కివెక్కి ఏడ్చిన దృశ్యం నేటికీ కండ్లముందు కదలాడుతున్నది. ఇలాంటి తల్లులెందరో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా విధుల్లో నిమగ్నమయ్యారు. వేలమంది కొవిడ్‌ బాధితులకు ఎందరో తల్లులు అండగా నిలుస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులనుంచి కలెక్టర్లవరకు ఎందరో మాతృమూర్తులు విధుల్లో తలమునకలై ఉన్నారు. విధులు ముగించుకొని ఇంటికి వచ్చాకకూడా పిల్లల క్షేమం కోరి వారికి దూరంగా ఉంటున్నారు. తన బిడ్డకు ఏం కాకూడదనే ఆరాటం అమ్మ మనసును కఠినంగా మారుస్తున్నది. పేగుబంధం కదిలినా గుండెను రాయిగా చేసుకున్న అమ్మకు సలామ్‌ చేద్దాం.

Mother's Day Special : అమ్మ కడుపు చల్లగా

అమ్మకిద్దాం లాక్‌డౌన్‌ కానుక!

ఏడాదిగా అన్నీ తానై ఇంటిని నడిపిస్తున్న అమ్మకు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా! అయితే, వెంటనే అమ్మకు లాక్‌డౌన్‌ ప్రకటించండి. వంటింటినుంచి ఈ ఒక్కరోజైనా తనకు విముక్తిని ఇవ్వండి. ఉదయం ఆరు గంటల నుంచి లాక్‌డౌన్‌ అమలు చేయండి. పక్కమీది నుంచి దిగకముందే ఆమెకు వేడివేడి కాఫీ అందించండి. అమ్మ వారిస్తుంది. వంటింట్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుంది. సున్నితంగా అడ్డుకోండి. బతిమాలి ఒప్పించండి. ఈ రోజంతా ఇక్కడున్న పేపర్‌ అక్కడ పెట్టడానికి వీళ్లేదని షరతు పెట్టండి. టిఫిన్‌ మొదలు డిన్నర్‌ వరకు తనకు ఇష్టమైన పదార్థాలు వండి వడ్డించండి! వండటానికి కావాల్సిన పదార్థాలు ఎక్కడున్నాయో చెప్పడానికి మాట సాయం తీసుకోండి. ఇదే అదనుగా అమ్మ పనిలో పాలు పంచుకోవడానికి సిద్ధపడుతుంది. ‘మాటిచ్చావ్‌ అమ్మా!’ అని సెంటిమెంట్‌ గుర్తు చేయండి. లోలోపన నవ్వుతూనే పైకి గంభీరంగా నటిస్తూ కుర్చీలో కూర్చుండి పోతుంది అమ్మ. ఆ క్షణంలో అమ్మ కండ్లలోని ఆనందాన్ని మీ మనసుతో చూడండి. చెమ్మగిల్లిన అమ్మ కండ్లలో కదలాడే ప్రేమను తృప్తిగా ఆస్వాదించండి. ఏ దేవుడికీ దక్కలేని అదృష్టం మీ సొంతం చేసుకోండి. ఈ లాక్‌డౌన్‌ ఒక్కరోజుతో ఆపేయొద్దు. తరచూ అమలు చేయండి. కనీసం పక్షానికోసారైనా అమ్మకు ‘అప్రకటిత విరామం’ ఇవ్వండి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చూడండి..

Mother’s day special: అమ్మ కోసం ఐదు బహుమతులు

coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి

Coronavirus Recovery: క‌రోనా త‌గ్గినా నీర‌సంగా ఉంటుందా? ఈ జాగ్ర‌త్త‌లు అవ‌స‌ర‌మే

Double Mask అవ‌స‌ర‌మా? స‌ర్జిక‌ల్‌, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?

Coronavirus Doubts : నీటి ద్వారా క‌రోనా వ్యాపిస్తుందా? ఈత కొడితే కొవిడ్‌-19 వ‌స్తుందా?

Oxygen : క‌రోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజ‌న్ పొందండి

ఒక్క మాస్క్ స‌రిపోదా? రెండు మాస్కులు క‌చ్చితంగా వాడాలా?

Covid-19 deaths : క‌రోనా మృతుల అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లొచ్చా? లేదా?

Vaccine Doubts : క‌రోనా వ్యాక్సిన్ రెండు డోసులు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సిందేనా? ఒక్క డోస్ స‌రిపోదా?

Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న త‌ర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?

బోర్లా ప‌డుకుంటే ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ పెరుగుతాయా.. ఆ వైర‌ల్ వీడియోలో నిజ‌మెంత‌?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
Mother's Day Special : అమ్మ కడుపు చల్లగా

ట్రెండింగ్‌

Advertisement